ఆదిపురుష్ తో ప్రభాస్ ఇమేజ్ ను ఓం రౌత్ డామేజ్ చేస్తే ప్రశాంత్ నీల్ పరువు తీసేశాడు. కేజీఎఫ్ 2 టీజర్ మించి ఉంటుందనుకున్న సలార్ టీజర్ ను ప్రశాంత్ నీల్ తుంచి పారేశాడు. ఈ రోజు ఉదయం 5.12 గంటలకు సలార్ టీజర్ విడుదలైంది. ప్రభాస్ అభిమానులైతే రాత్రి నిద్రపోలేదు. ఏదో ఊహించుకుంటే ఏదో చూపించాడు దర్శకుడు.
కేజీఎఫ్ మాదిరిగానే డార్క్ షేడ్ లో ఈ టీజర్ ఉంది. కానీ ఆ టీజర్ తో దీన్ని పోల్చలేం. అక్కడ యష్ హీరోయిజనం ఎలివేట్ అయింది.. ఇక్కడ మాత్రం టీజర్ లో ప్రభాస్ మొహాన్నే సరిగా చూపించలేదు. అదే ఇంగ్లీష్ డైలాగులతోనే టీజర్ ఉంది. పాన్ ఇండియా సినిమా అని చెప్పి అన్ని భాషలకూ ఒకే టీజర్ ను విడుదల చేశారు. పోనీ ఆ డైలాగులో పస ఉందా అంటే అదీ లేదు. సన్నివేశాల్లో దమ్ముందా అంటే అదీ లేదు. కేజీఎఫ్ 2 తర్వాత వస్తున్న మూవీ కావడంతో అంచనాలు ఆకాశాన్నంటాయి. ఒక నిమిషం 46 సెకన్లు ఉన్న ఈ టీజర్ లో టిన్ను ఆనంద్, ప్రభాస్, పృధ్వీరాజ్ సుకుమారన్ కనిపించారు.
పాన్ ఇండియా డైరెక్టర్ నుంచి సినిమా వస్తుందంటే ఎంతో ఊహించుకోవడం సర్వసాధారణం. ప్రభాస్ ను పూర్తిగా చూపించకుండా అంతలా ఊరించాల్సిన అవసరం ఏమొచ్చిందో. కేజీఎఫ్ 2 టీజర్ నిడివిలోనే ఇది కూడా ఉంది. కానీ అందులో అమ్మ సెంటిమెంటును చూపించారు. హీరో ఇంట్రడక్షన్ ఇంగ్లిష్ డైలాగ్ తోనే వస్తుంది. ‘హిస్టరీ టెల్స్ అజ్ దట్ పవర్ ఫుల్ ప్లేసెస్ మేక్ పవర్ ఫుల్ పీపుల్. హిస్టరీ వజ్ రాంగ్. పవర్ ఫుల్ పీపుల్ మేక్ ప్లేసెస్ పవర్ ఫుల్’ అనే డైలాగ్ తో చూసేవారికి గూస్ బంప్స్ తెప్పిస్తాయి.
ఇప్పుడు సలార్ లోనూ అలాంటి ప్రయోగమే చేయాకున్నాడు ప్రశాంత్ నీల్. కానీ అభిమానుల్లో అశాంతినే మిగిల్చాడు. టిన్ను ఆనంద్ పై రౌడీ గ్యాంగులు తుపాకులు గురిపెట్టగా అతను డైలాగ్ చెప్పడంతో టీజర్ ప్రారంభమవుతుంది.‘లయన్, చీటా, టైగర్, ఎలిఫెంట్.. చాలా డేంజరస్.. కానీ జురాసిక్ పార్క్ లో మాత్రం కాదు. ఎందుకంటే ఆ పార్క్ లో ..”అర్దోక్తిలో ఆగిపోగానే డైనోసార్ గర్జన వినిపిస్తుంది.. ప్రభాస్ కనిపిస్తాడు. చాలా పేలవంగా హీరో ఇంట్రడక్షన్ ఉంది. సలార్ – సీజ్ ఫైర్ పార్ట్ వన్ గా దీనికి సీక్వెల్ ఉందని మాత్రం ముందే చెప్పేశారు.
ఈ టీజర్ తో అభిమానుల్లో నిరాశ పోవాలంటే వెంటనే మరో టీజర్ ను రిలీజ్ చేయడంగానీ, ట్రైలర్ విడుదల చేయడం గానీ వెంటనే జరగాలి. సెప్టెంబరు 28న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. రవి బస్రూర్ నేపథ్య సంగీతంలోనూ మొనాటనీ కనిపించింది. తన రెగ్యులర్ ఫార్మాట్ ను ప్రశాంత్ నీల్ కొంతకాలం పక్కన పెడితే బాగుంటుంది. లేదా దాన్ని కేజీఎఫ్ సీక్వెల్స్ కే పరిమితం చేసినా సరిపోతుంది. మొత్తానికి ప్రభాస్ అభిమానులకు అత్యంత నిరాశపరచిన టీజర్ గా దీన్ని చెప్పాల్సి ఉంటుంది.