అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగిన ముద్దుగుమ్మ సమంత. మోడలింగ్ తో తన కెరీర్ ను ప్రారంభించిన సమంత తెలుగు , తమిళంలో అనేక చిత్రాల్లో నటించి ఎందరో అభిమానులను కూడగట్టుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న ఈ బ్యూటీ అక్కడా వరుస ఆఫర్ లతో దూసుకుపోతూ అక్కడా సెటిల్ అయ్యేందుకు ప్రయత్నిస్తోంది.
ఒకానొక దశలో ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో మోస్ట్ పాపులర్ పాన్ ఇండియా హీరోయిన్ గా సమంత టాప్ పొజిషన్ లో నిలిచిందంటే ఆమె రేంజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక తన సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే సమంత రెగ్యులర్ గా వార్తల్లో కనిపిస్తుంటుంది. కాగా, తాజాగా ఆమె మరోసారి హెడ్ లైన్స్ లో నిలిచింది.
అయితే ఈసారి తన విషయాలతో కాదు, ఒక పోస్ట్ కి లైక్ కొట్టి సామ్ చర్చనీయాంశంగా మారింది.తెలంగాణ చేనేతకు సమంత బ్రాండ్ అంబాసడర్ గా వ్యవహరించిన సమంత, తాజాగా మంత్రి కేటీఆర్ ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన ఒక పోస్ట్ కు ఆమె లైక్ కొట్టింది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేటీఆర్ ఈ పోస్ట్ చేశారు. ‘దేశ జనాభాలో కేవలం 2.5 శాతం జనాభా మాత్రమే ఉండే తెలంగాణ… దేశ జీడీపీలో 5 శాతాన్ని అందిస్తోంది. ఈ నేపధ్యంలో భారతదేశానికి కావాల్సింది డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు కాదు.. డబుల్ ఫలితాలను ఇచ్చే పాలన’ అని ఆయన కేటీఆర్ ఇన్స్టాలో పోస్ట్ చేశారు. కాగా, ఈ పోస్ట్ కు సమంత లైక్ కొట్టింది.కేటీఆర్ పోస్ట్ కు సామ్ లైక్ కొట్టడం ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.