ఏం మాయ చేశావే చిత్రంతో తెరంగేట్రం చేసి కుర్రకారు మనసును దోచేసిన బ్యూటీ సమంత. ఈ మూవీలో తన అందం, అభినయంతో తర్వాత అనేక ఆఫర్స్ ను దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ.పవర్ స్టార్ మొదలు సౌత్ ఇండస్ట్రిలో దాదాపు అందరూ యంగ్ హీరోలతో జతకట్టిన ఈ కుట్టి అతితక్కువ సమయంలోనే అగ్ర కథానాయికగా ఎదిగింది. ఈ క్రమంలోనే ఒకేసారి అటు తెలుగులోనూ, ఇటు తమిళంలోనూ దక్షిణ భారత ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారాన్ని ఒకేసారి ఒకే ఏడాదిలో అందుకున్న నటిగా కూడా సమంత రికార్డు సొంతం చేసుకుంది.
ఇక వరుస చిత్రాలతో బిజీగా గడుపుతున్న సమయంలోనే పెళ్ళి చేసుకున్న సమంత కుర్రకారు మనస్సు గాయపరిచింది. తర్వాత వ్యక్తిగత కారణాలతో వివాహ బంధం నుంచి వేరుపడి ఒంటరి అయిన సమంత అప్పటి నుంచి కెరీర్ పై ఫోకస్ బాగా పెంచింది.అయితే తాజాగా ఈ అమ్మడు బాలీవుడ్ ప్రాజెక్టులో నటించబోతోందనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సమంత ప్రముఖ నటుడు రణవీర్ సింగ్ సరసన తొలిసారి నటించనుందని టాక్. వీరిద్దరూ కలసి ఉన్న ఫొటోను సమంత షేర్ చేయడంతో ఈ వార్తకు మరింత బలం చేకూరినట్లుగా కనిపిస్తోంది. ఈ ఫొటోలో రణవీర్ సింగ్ బ్లూ షర్ట్ తో ఉండగా, సమంత ఎయిర్ ఫోర్స్ యూనిఫామ్ తో ఉంది. దీంతో సమంత ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ పాత్రలో కనపించనుందని అనుకుంటున్నారు. ఈ ఫోటోను సామ్ తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో షేర్ చేసింది. ఈ పిక్ లో సమంత చేతిలో సన్ గ్లాసెస్ ఉండగా, ‘సమ్ థింగ్ బ్యూటీఫుల్ ఈజ్ ఆన్ ద హొరైజన్’ అని ఫోటోకు ఓ క్యాప్షన్ ను తగిలించింది ఈ బ్యూటీ.
ఇదిలా ఉంటే సమంత స్టెప్పులతో అదరగొట్టిన ‘ఊ అంటావా మావ’ పాట తనకు ఎంతో ఇష్టమని రణవీర్ సింగ్ ఇప్పటికే ఒకసారి చెప్పాడు. ‘‘పాటలో ఏముందో నాకు అర్థం తెలియదు. కానీ, మ్యూజిక్ మాత్రం నా హృదయాన్ని తాకింది’’ అని రణవీర్ చెప్పుకొచ్చాడు.ఈ క్రమంలో ప్రస్తుతం వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోను సామ్ షేర్ చేయడంతో ఇద్దరూ కలిసి మూవీ చేయబోతున్నారనే వార్తలు జోరందుకున్నాయి.
ఇటీవల సమంత పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉండేందుకు ప్రయత్నిస్తోంది. ఇటీవలే వచ్చిన ‘కాతు వాకుల రెండు కాదల్’ సినిమాలో కనిపించింది. విజయ్ దేవరకొండతో కలసి ‘ఖుషి’ సినిమా షూటింగ్ లో పాల్గొని ఇటీవలే కశ్మీర్ నుంచి తిరిగొచ్చింది. శాకుంతలం, యశోద సినిమాలు సైతం సమంత ఖాతాలో ఉన్నాయి. మరి రన్ వీర్ సింగ్ తో సామ్ సినిమా పక్కా అయితే ఎలా ఉండబోతోందో అనే అంశం ఆమె అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయనే చెప్పుకోవచ్చు.