(విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
సింహాచలం దేవస్థానం చైర్పర్సన్‌గా సంచైత గజపతిరాజు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆమె దూకుడుకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఈ వివాదం అశోక్ గజపతిరాజు కుటుంబానికి, ఆమెకు మధ్యనే కాకుండా టిడిపి, వైసిపి మధ్య పోరులా కూడా మారింది. చివరకు ఈ వ్యవహారం ఎక్కడ వరకు వెళ్ళింది అంటే… సింహాచలం దేవస్థానం అధికారులను బెదిరించే స్థాయికి చేరింది. ఉత్తరద్వార దర్శనం వేడుకల సాక్షిగా మరోమారు ఈ రెండు కుటుంబాల మధ్య చిచ్చు రేగింది.
విషయం ఏంటంటే… సింహాచలం దేవస్థానం అనువంశిక ధర్మకర్తలుగా ఏళ్ల తరబడి ఆనంద్, అశోక్ గజపతి కుటుంబ సభ్యులు స్వామి ఉత్సవాలను తమ చేతుల మీదుగా నడిపిస్తూ వచ్చారు. అయితే ఉత్సవం రోజున చైర్మన్ మాత్రమే కాకుండా కుటుంబ సభ్యులందరిని సమానంగా గౌరవించి స్వామి దర్శనానికి అవకాశం కల్పిస్తూ వచ్చారు. అందులో భాగంగా వైకుంఠ ఏకాదశి రోజున అశోక్ గజపతి సతీమణి సుధా గజపతిని ఆహ్వానించాలని దేవస్థానం అధికారులు భావించారు. దీంతో విషయం తెలుసుకుని శివాలెత్తిన పోయిన ప్రస్తుత చైర్పర్సన్ దేవస్థానం అధికారులకు గట్టి వార్నింగ్ ఇచ్చినట్టు స్వయంగా సుధా గజపతి ఆరోపించారు.
ఉద్యోగుల పేర్లు చెబితే భవిష్యత్తులో వారిని కూడా ఇబ్బందులపాలు చేసే అవకాశం ఉందని, అందుకే దర్శనానికి టికెట్ కొనుగోలు చేసుకుని వెళ్లాలని భావించినట్టు చెప్పారు. అయితే ఉత్తర ద్వార దర్శనానికి తనను తప్ప, ఇతర వంశీయులు ఎవరిని పిలవ రాదని, చివరకు నా కుటుంబ సభ్యులను కూడా ఆహ్వానించవద్దని, దర్శనానికి అనుమతించవద్దని సంచైత ఖరాఖండీగా చెప్పడంతో.. ఎందుకు వచ్చిన తంటా అని అధికారులు సుధా గజపతికి కనీసం ఆహ్వానం కూడా పంపలేదు.
వాస్తవానికి ఇది ఒక చైర్మన్ కి సంబంధించిన ఉత్సవం కాదు… వంశీయులు అందరూ పాల్గొనే వేడుక. కానీ ఆ విషయం చెప్పే ధైర్యం కూడా దేవస్థానం అధికారులు చేయలేకపోయారు. అయితే తనకు ఆహ్వానం అందకపోవడం పై ఆమె దేవస్థానం అధికారులను సంప్రదించగా, ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆమె హెచ్చరించినందునే తాము ఆహ్వానించలేకపోయామని, ఆమె దర్శనం అనంతరం కొంత సమయం తర్వాత వస్తే దర్శనం ఏర్పాటు చేస్తామని అధికారులు ఆమెకు నచ్చజెప్పారు. ఒక వంశీయుల కుటుంబానికి దక్కాల్సిన గౌరవాన్ని కూడా రాజకీయ అండతో లాక్కున్న వైనంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇదిలా ఉండగా ఆమె ఉదయం దర్శనానికి వెళ్లే సమయంలో.. మీడియా పట్ల దురుసుగా వ్యవహరించారు. దీంతో మీడియా ప్రతినిధులు ఆమెకు వ్యతిరేకంగా ఆలయ ప్రాంగణంలో నినాదాలు చేశారు.
ఆది నుంచి వివాదాలతోనే ..
ఎన్నో ఏళ్ల తర్వాత ఏర్పాటు చేసిన ట్రస్ట్ బోర్డు నియామకంతో కొత్త తలనొప్పి తెచ్చి పెట్టినట్టైంది. ఆమె వ్యవహార శైలి, నిర్ణయాలు నచ్చక దేవస్థానం విధుల నుంచి తప్పించండి… అంటూ పలువురు ఈ వో లు గతంలో ఉన్నతాధికారులకు మొరపెట్టుకున్నారు. అప్పటి నుంచి ప్రముఖ దేవాలయం ఇంచార్జి పాలనలోనే కొనసాగుతోంది.
అన్నవరం దేవస్థానం ఈవో వి.త్రినాధ రావు కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ దేవాదాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది. కరోనా వైరస్ కారణంగా గత కొంత కాలంగా దేవస్థాన సిబ్బందికి పూర్తిస్థాయిలో జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. తాత్కాలిక సిబ్బందిని, కాంట్రాక్టు సిబ్బంది ని తొలగించి ఆర్థికభారం తగ్గించుకోవాలని భావించిన చైర్ పర్సన్ నిర్ణయానికి వ్యతిరేకంగా నే వ్యవహరించాల్సి వచ్చింది.
ఆమె ఆదేశాల మేరకు తొలగించిన 183 మంది సిబ్బందిని మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు దేవాదాయ శాఖ మంత్రికి సీఎం జగన్ ద్వారా చెప్పించడం తో తిరిగి విధుల్లోకి తీసుకోక తప్పని పరిస్థితులు ఎదురయ్యాయి. ఇక పాలకమండలి తీసుకుంటున్న నిర్ణయాలు కూడా ఇక్కడ బాధ్యతలు స్వీకరించే ఈవోలకు తలనొప్పిగా మారాయి. సుమారు నాలుగున్నర నెలలుగా ఓ అనధికార వ్యక్తి సింహగిరి కాటేజీలో బస చేయడం దేవస్థానం అధికారులపై పెత్తనం చేయడంపై తీవ్ర అసహనం ఉద్యోగుల్లో వ్యక్తమైంది. దీనికి తోడు అదే వ్యక్తిని ఓఎస్డీగా నియమించాలని చైర్పర్సన్ ప్రకటించడంతో పాలకమండలి సభ్యులతోనూ అగాధం పెరిగింది.
చైర్పర్సన్ ఆదేశాల మేరకు.. ఓ ఎస్ డి పోస్టును సృష్టించి, నెలకు 50 వేల రూపాయలు జీతం కట్టబెట్టేందుకు తీర్మానించింది. అంతేకాదు.. భోజన, వసతి, రవాణా సౌకర్యాలు సైతం కల్పించాలని బోర్డులో ఆమె నిర్ణయం తీసుకుంది.. శతాబ్దాల చరిత్ర ఉన్న దేవస్థానంలో… దశాబ్దాల కాలం నుంచి చైర్మన్ వ్యవస్థ నడుస్తోంది. కానీ ఎవరు ప్రవర్తించని రీతిలో ఆమె అజమాయిషీ చేయడంపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సుధా గజపతిరాజు స్వామి దర్శనం చేసుకుంటే , ఆమెకు వచ్చిన నష్టం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
సీఎం కూడా అసంతృప్తి…
ప్రస్తుత పరిస్థితులను బట్టి.. ఆమె వ్యవహార శైలిపై రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇంటెలిజెన్స్ ద్వారా నివేదిక రప్పించుకున్నట్టు సమాచారం. దీంతో ఆమె తీరుపై సీఎం కూడా అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె అనుభవిస్తున్న హోదా.. మూడునాళ్ళ ముచ్చట గానే మిగలబోతున్నదని విశ్వసనీయంగా తెలుస్తోంది. ఆమెపై నడుస్తున్న కేసులు కూడా త్వరలోనే ఓ కొలిక్కి వస్తాయని, ఖచ్చితంగా ఆమెకు వ్యతిరేకంగానే న్యాయస్థానం తీర్పు వస్తుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.