సంక్రాంతి – ఈ పేరు వింటేనే తెలుగు సినిమాకు పండగ. ఈ పండగలో స్టార్ హీరో సినిమా ఉంటే అంతకన్నా మజా వేరేమీ ఉండదు. నందమూరి ఫ్యామిలీ.. అక్కినేని ఫ్యామిలీ.. ఘట్టమనేని ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ.. ఈ పేర్లేవీ ఈసారి సంక్రాంతి సినిమా బరిలో వినిపించడం లేదు. ఈసారి సంక్రాంతికి సినిమాని సూపర్ స్టార్ అనుకోవాలేమో. ఎందుకంటే అన్నీ డిఫరెంట్ కథాంశాలతో భారీ అంచనాలు ఉన్న సినిమాలే బరిలో కనిపిస్తున్నాయి. కాకపోతే ఈసారి సంక్రాంతి పందెం కోళ్లు అన్నీ మాస్ మసాలా దట్టించి వస్తున్నాయి.
ఈ సంక్రాంతి పందెంలో విజేత ఎవరన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అయితే ఇంతకీ బరిలో ఉన్న ఆ సినిమాలు ఏవి? అనేది చూద్దాం. థియేటర్ల సమస్య కూడా ఉంది కాబట్టి ఈ సంక్రాంతికి ఓ నాలుగు సినిమాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. వీటిలో ఒకటి తమిళ డబ్బింగ్. గత ఏడాది కూడా నాలుగు సినిమాలే బరిలో నిలిచినా రెండు చిత్రాలు మాత్రమే బ్లాక్ బస్టర్ లుగా నిలిచాయి.
మహేష్ బాబు ‘సరిలేరు మీకెవ్వరు’, ‘అల వైకుంఠపురములో’ చిత్రాలు కలెక్షన్ల పరంగా కుమ్మేశాయి. ఈసారి అంతకుమ్ముడు ఉంటుందా లేదా అన్నది అనుమానమే. ఎందుకంటే కరోనా కారణంగా 50 శాతం ఆక్యుపెన్సీ అన్న నిబంధన ఉంది. అయితే ప్రస్తుతం వ్యాక్సిన్ కూడా వచ్చేసింది.. ప్రభుత్వం నిబంధనలు కూడా సడలించే అవకాశం ఉంది. థియేటర్లు సరిపోవు కాబట్టి కొన్ని సినిమాల విడుల వాయిదా పడిపోయింది.
విజయ్ ‘మాస్టర్’ జనవరి 13
గత ఏడాది రజినీకాంత్ దర్బార్ తో సందడి చేస్తే ఈసారి ఇళయ దళపతి విజయ్ బరిలోకి దిగుతున్నారు. అదే ‘మాస్టర్’ సినిమా. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. ఎందుకంటే ‘ఖైదీ’ లాంటి బంపర్ హిట్టిచ్చిన దర్శకుడు కావడం, ఇందులో మరో హీరో విజయ్ సేతుపతి ఓ విలక్షణ పాత్రను పోషించడంతో ఈ సినిమా మీద ఆడియన్స్ లో ఆసక్తి నెలకొంది. ఇప్పటిదాకా విజయ్ కి తెలుగులో అంతగా మార్కెట్ లేదు. ఆ లోటును ఈ సినిమా భర్తీ చేస్తుందన్న అంచనాలు ఉన్నాయి. లోకేష్ కనకరాజ్ స్పీడు తెలియంది కాదు.. ఈ సినిమా షూటింగ్ లో ఉండగానే కమల్ హాసన్ తోనే సినిమా ప్రారంభించేశాడు. లోకేష్ శైలికి విజయ్ యాక్షన్ స్పీడు తోడైతే సినిమా ఓ రేంజ్ లోనే ఉంటుంది. దీని విడుదల తేదీ జనవరి 13గా ఖరారైపోయింది.
Must Read ;- టాలీవుడ్ స్టార్ బ్రదర్స్ సంక్రాంతికి రావడం లేదా..?

రామ్ ‘రెడ్’ జనవరి 14
యంగ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ ద్విపాత్రాభినయం చేసిన ‘రెడ్’ కూడా సంక్రాంతి పుంజుగానే చెప్పాలి. సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని జనవరి 14న విడుదల చేయనున్నారు.
ఇందులో రామ్ పోతినేని సరసన నివేదా పేతురాజ్, మాళవికా శర్మ, అమృతా అయ్యర్ కథానాయికలుగా నటించారు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో శ్రీస్రవంతీ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మించింది. రామ్ చిత్రాలు దేవదాసు, మస్కా ఇంతకుముందు సంక్రాంతికే విడుదలయ్యాయి. మణిశర్మ సంగీతం సమకూర్చిన ఈ సినిమా పాటలకు కూడా మంచి స్పందన లభిస్తోంది.
రవితేజ ‘క్రాక్’ జనవరి 15
మాస్ మహారాజ రవితేజ కూడా ఈ సంక్రాంతి బరిలోకి దిగడం ఖాయమైంది. మలినేని గోపీచంద్ దర్శకత్వంలో రూపొందిన ‘క్రాక్’ జనవరి 15న విడుదలవుతోంది. ఒంగోలు నేపథ్యంలో జరిగిన కథాంశానికి క్రైం ఎలిమెంట్ జోడించి దీన్ని తెరకెక్కించారు. ఎస్. ఎస్. తమన్ దీనికి సంగీతం అందించారు. గత ఏడాది తమన్ ఆల్బమ్ ఏ స్థాయిలో రికార్డులు బద్దలు కొట్టిందో తెలిసిందే. మరి మాస్ మహరాజ్ కోసం ఆయన అందించిన బాణీలు కూడా సినిమా తర్వాత ఏ స్థాయిలో ఉంటాయో చూడాలి. విక్రామర్కుడు తరహా పోలీసు ఆఫీసర్ పాత్రను రవితేజ ఇందులో పోషించాడు. మాస్ మహారాజ్ అనే పేరును రవితేజ ఈ సినిమాతో మరోసారి సార్థకం చేసుకుంటాడని భావించాలి. ఇందులో రవితేజ సరసన శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటించింది.

సాయిశ్రీనివాస్ ‘అల్లుడు అదుర్స్’ జనవరి 15
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు కూడా సంక్రాంతి సెంటిమెంటు ఉంది. అందుకే ‘అల్లుడు అదుర్స్’ చకచకా ముస్తాబైంది. పైగా ‘రాక్షసుడు’ లాంటి హిట్ తర్వాత మరోసారి తన సత్తా నిరూపించుకునేందుకు సాయి శ్రీనివాస్ ఉవ్విళ్లూరుతున్నాడు. ఈసారి తమన్ కు పోటీగా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కూడా బరిలోకి ఈ సినిమాతో వస్తున్నాడు. ముఖ్యంగా హీరో 8 ప్యాక్ తో కనిపిస్తాడట. ఇందులో నభానటేష్, అనుఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటించారు. థియేటర్లు ప్రారంభమయ్యాక నభా నటేష్ ‘సోలో బ్రతుకే సో బెటర్’ లాంటి హిట్ అందుకుని శుభారంభాన్ని అందించింది. మరి ఆ సెంటిమెంటు కూడా వర్కవుట్ అవుతుందేమో చూడాలి.
బరిలో నుంచి ఎందుకు తప్పుకున్నారో?
నిజానికి మరికొన్ని సినిమాలు కూడా ఈ సంక్రాతి బరిలో ఉండాల్సి ఉంది. వీటి విడుదలను ఎందుకు వాయిదా వేసుకున్నారో అర్థం కావడం లేదు. ముఖ్యంగా మెగా మేనల్లుడు ‘ఉప్పెన’ గత ఏప్రిల్ లోనే విడుదల కావాలి. రెడ్ తో పాటే విడుదల కావలసిన ఈ సినిమా విడుదల ఎందుకు వాయిదా పడుతుందో అర్థం కావడం లేదు. అలాగే నితిన్ ‘రంగ్’ దే కూడా. అలాగే అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ఒకటి. ఈ సినిమా విడుదలకు ఇంకా ఎలిజిబిలిటీ వచ్చినట్టు లేదు. నాగార్జున వైల్డ్ డాగా కూడా వాయిదా పడిపోయింది. సంక్రాంతి పందెం కోళ్లు బరి నుంచి తప్పుకున్నాక ఈ సినిమాలు వరుసగా విడుదల కావచ్చు. అయినా ఎప్పుడొచ్చామన్నది కాదు ప్రేక్షకుల గుండెల్లో బుల్లెట్ దిగిందా లేదా అన్నదే ముఖ్యం.
– హేమసుందర్ పామర్తి