కోవిడ్-19 వ్యాధి అంటే కరోనాకు కారణమైన SARS-CoV-2 వైరస్ రకరకాలుగా రూపాంతరం చెందుతూ ప్రపంచ వ్యాప్తంగాను, ఇండియాలోను ఎక్కువ మందికి సోకుతూ ప్రాణాలను హరిస్తోంది. భారత దేశంలో కరోనా సెకండ్ వేవ్‌కు కారణమైన డెల్టా వేరియంట్‌తో లక్షలాది మంది వ్యాధి బారిన పడి వేల సంఖ్యలో చనిపోయారు. ప్రస్తుతం డెల్టా ప్లస్ B.1.617.2.1 వేరియంట్‌గా వైరస్ రూపాంతరం చెందింది. థర్డ్ వేవ్‌కు ఈ వేరియంట్ కారణమన్న అంచనాలున్నాయి. ఈ వేరియంట్ యూరప్, ఆసియా, అమెరికాలోని తొమ్మిది దేశాల్లో రిపోర్టు అయ్యింది. ఇండియాలో డెల్టా ప్లస్ వేరియంట్ జూన్ 11న రిపోర్టు అయ్యింది. ఈ వేరియంట్ మిగతా వాటి కంటే వేగంగా వ్యాప్తి చెందుతుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ రకం వైరస్ మోనోక్లోనల్ యాంటిబాడిస్ వైద్యాన్ని కూడ తట్టుకుంటుందని ఇండియాలోని ప్రముఖ వైరాలజిస్ట్ షాహిద్ జమీల్ తెలిపారు. జూన్ 16 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 11 దేశాల్లో 197 కేసులు నమోదు అయ్యాయి. భారత దేశంలోని మహారాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో 40 డెల్టాప్లస్ వైరస్ కేసులు బయటపడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించింది. భారత్‌లో థర్డ్ వేవ్‌కు ఈ వేరియంట్ కూడ ఒక కారణం కావచ్చని ఐసీఎంఆర్ శాస్త్రవేత్త తరుణ్ భట్నాగర్ తెలిపారు.

తొలి కేసులు మహారాష్ట్రలోనే..
కొత్త రకం వైరస్లు ఏవైనా తొలి కేసులు మహారాష్ట్రలోనే బయటపడుతున్నాయి. బౌగోళిక స్వరూపం, జనసాంద్రత, జీనోమిక్ సీక్వెన్సింగ్ ఎక్కువగా చేయటం మొదలైనవి కొత్త రకం వైరస్లు ఇక్కడ బయట పడటానికి కారణమన్న విశ్లేషణలున్నాయి. డెల్టా ప్లస్ వేరియంట్ కేసు కూడ మన దేశంలో మొదటగా మహారాష్ట్రలోనే బయటపడగా ఇప్పటి వరకు 21 మంది దీని బారిన పడ్డారు. దీనికి మూలకమైన డెల్టా B.1.617 వైరస్ కూడ ఫిబ్రవరిలో మొదటగా ఈ రాష్ట్రంలోనే బయట పడింది. దీని నుంచి రూపాంతరం చెందిన డెల్టా ప్లస్ B.1.617.2.1 వైరస్ మోనో క్లోనల్ యాంటిబాడీ థెరపీని తట్టుకుని నిలబడుతుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. బౌగోళిక పరిస్థితులు, జనసాంద్రతలే మహారాష్ట్రలో కోవిడ్ వేరియంట్లు మొదటగా వెల్లడవటానికి కారణమని కోవిడ్ కంట్రోల్లో ఆ రాష్ట్ర టెక్నికల్ సలహాదారు, హెల్త్ కేర్ నిపుణుడు సుభాష్ సాలుంకే పేర్కొన్నారు. ఎక్కువగా పరీక్షలు చేయడం కూడ దీనికి కారణంగా పేర్కొన్నారు. ఫిబ్రవరిలో మొదట డెల్టా కేసు బయటపడినప్పటి నుంచి కరోనా వైరస్‌లో పరివర్తనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా ఇప్పుడున్న వ్యాక్సిన్లు ఈ వేరియంట్లపై ఏ మేరకు పనిచేస్తాయన్నది పరిశోధన చేయాల్సిన అవసరం ఉందన్నారు. సీఎస్ఐఆర్ తో కలిసి జీనోమిక్ సీక్వెన్సింగ్ ను ఎక్కువగా పరిశీలించడం కూడ మహారాష్ట్రలో కొత్త వేరియంట్లు బయటపడటానికి కారణమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జలగావ్లో వ్యాక్సిన్ తీసుకోని వారిలో ఈ డెల్టా ప్లస్ వేరియంట్ బయట పడటంతో దీనిపై వ్యాక్సిన్ల ప్రభావం ఏ మేరకు ఉంటుందనేది నిర్ధారణ కావడం లేదు.
కరోనా రోగి పక్క నుంచి వెళ్ళినా..
డెల్టా ప్లస్ వేరియంట్ త్వరగా వ్యాప్తి చెందుతుందని, మాస్క్ లేకుండా ఈ వైరస్ సోకిన వ్యక్తి పక్క నుంచి వెళ్ళినా కరోనా బారిన పడే ప్రమాదం ఉందని ఏఐఐఎంఎస్ డైరెక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు. కోవిడ్ నియంత్రణ నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తే కొంతవరకు దీని బారిన పడకుండా ఉండవచ్చన్నారు. మోనోక్లోనల్ యాంటీబాడి థెరపీకి ఈ వైరస్‌కు రెసిస్టెన్స్ ఉన్నందున, దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం భారత్‌లో డెల్టా ప్లస్ కేసులు తక్కువగా ఉన్నాయని, ప్రజలు తప్పకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. వచ్చే 6 నుంచి 8 వారాలు ఈ వైరస్ బారిన పడకుండా ఉండటానికి కీలకమని తెలిపారు, కొత్త రకం వైరస్ వ్యాప్తి చెందకుండా అవసరమైతే లాక్ డౌన్ లాంటి కంటెయిన్మెంట్ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం ఉన్న కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లు ప్రస్తుతం ఉన్న డెల్టా వేరియంట్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నా కొత్త వేరియంట్‌పై ఏ మేరకు ప్రభావం చూపుతాయనే విషయాలు పరిశీలించాల్సి ఉందన్నారు.
Must Read ;- అదుపులో వ్యాప్తి : దేశంలో కొత్త కేసులు 60 వేల లోపే!











