ప్రేమ అనే అక్షరాలకు అర్థం చెప్పడం కష్టం .. ఆ అనుభూతిని నిర్వచించడం అసాధ్యం. పండువెన్నెల్లా .. గోదావరి అలల్లా ప్రేమ ఎప్పుడూ కొత్తగానే కనిపిస్తూ ఉంటుంది. మనుసును మాయ చేసే మంత్రం తానేనని అనిపిస్తూ ఉంటుంది. అలాంటి ప్రేమ కథాంశంతో వచ్చే సినిమాలకు కుర్రాళ్లు ఎప్పుడూ పల్లకీ పడుతూనే ఉంటారు. అందులోని పాటలను ఉత్సాహమనే రథంలో ఊరేగిస్తూనే ఉంటారు. అలాంటి పాట ఒకటి ఇప్పుడు యూత్ హృదయాలను టచ్ చేస్తూ ప్రవహిస్తోంది. ‘ఒకే ఒక లోకం నువ్వే ..’ అంటూ యూత్ లోకమే తానై కూర్చుంది.
ఆదిసాయికుమార్ .. సురభి జంటగా శ్రీనివాస్ నాయుడు దర్శకత్వంలో ‘శశి’ సినిమా రూపొందింది. శ్రీనివాసరావు .. రామాంజనేయులు .. ఆర్పీ వర్మ నిర్మాతలుగా వ్యవహరించిన ఈ సినిమా, త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. రీసెంట్ గా ఈ సినిమా నుంచి, ‘ఒకే ఒక లోకం నువ్వే’ పాటను వదిలారు. నాయకా నాయికల మధ్య గల ప్రేమ గాఢతను కొలిచేదిగా ఈ పాట కనిపిస్తోంది. చంద్రబోస్ సాహిత్యాన్ని అందించిన ఈ పాటకు అరుణ్ చిలువేరు సంగీతాన్ని సమకూర్చాడు.
ప్రేమికుల భాష చంద్రబోస్ కి బాగా తెలుసు అనడానికి గతంలో ఆయన రాసిన చాలా పాటలు అద్దం పడతాయి. మందార ఆకుపై మంచుబొట్టులా ఆయన అక్షరాలు తళుక్కున మెరుస్తాయి. గులాబీ రేకుపై తేనె బొట్టులా తీపి అనుభూతిని కలిగిస్తాయి. ఆ పదాల మాటున దాగిన అందమైన అర్థాలు అంతరంగంలోకి జారిపోయి అల్లరి చేస్తాయి. ఆయన పాటల్లోని పదాల్లో పలకరింపు .. భావాల పులకరింపు కొత్త అనుభూతికి మత్తు ద్వారాలు తెరుస్తుంది. ఈ పాటలోనూ ఆయన పదాల గారడీ చేశాడు .. సున్నితమైన భావాలను సుకుమారంగా ఆవిష్కరించాడు.
‘కళ్లతోటి నిత్యం నిన్నే కౌగిలించనా .. కాలమంతా నీకే నేను కావలుండనా?, ఎండనీకు తగిలిందంటే చెమట నాకు పట్టేనే .. చలే నిన్ను చేరిందంటే వణుకు నాకు పుట్టేనే .. ‘ వంటి పదాల్లోని సొగసులు పడుచు హృదయాల్లో నాటుకుపోతాయి. ఈ మధ్య కాలంలో కాస్త అనుభూతిపాళ్లు ఎక్కువగా ఉన్న పాటల జాబితాలో ఈ పాటను చేర్చవచ్చు. సిద్ శ్రీరామ్ ఆలాపన .. ఈ పాటకి మరింత ప్రత్యేకతను తెచ్చింది. కుర్రాళ్ల గుండె గుడిలో ఒక మంత్రంలా మోగుతున్న ఈ పాట, ఈ సినిమాకి హెల్ప్ అయ్యేలానే కనిపిస్తోంది.
Must Read ;- ఎల్లలులేని సంగీతమే ఏఆర్ రెహ్మాన్ (బర్త్ డే స్పెషల్)