తమిళనాట మంచి టైమింగ్ ఉన్న కామెడీ ఆర్టిస్టు యోగిబాబు. అతన్ని చూస్తే ముళ్ల పందిని చూసినట్టు ఉంటుంది. అందంగా ఉన్న నటులూ కామెడీని పండించారు, అంద వికారంగా ఉండి నవ్వించిన వారూ ఉన్నారు. కామెడీ నటుడికి అంద వికారం ఓ ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. తమిళనాట యోగిబాబుకు అది వరంగా మారిందనే చెప్పాలి. స్టార్ హీరో సినిమాలో అతనికి తప్పకుండా ఓ పాత్ర ఉండి తీరుతుంది. ఇది వరకు సెంథిల్ ను రీప్లేస్ చేస్తూ యోగిబాబు వచ్చాడు. యోగిబాబు ప్రధాన పాత్ర ధారుడిగా ‘మండేలా’ పేరుతో ఓ సినిమా రూపొందింది.
ఇది ఓ సెటైరికల్ కామెడీ చిత్రం. ఈ సినిమా రేపు ఏప్రిల్ 14వ తేదీ విజయ్ టీవీలో 9.30 నుంచి ప్రసారం కానుంది. అంతేకాదు ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో ఏప్రిల్ 5 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాలో షీలా రాజ్ కుమార్, సంగిలి మురుగన్, కన్నరవి కూడా నటించారు. మాన్ కరాటే, ఆండవన్ కటలై, కోలమావు కోకిలా, కాకా ముత్తై, కిరుమి, పరియెరు పెరుమాల్ లాంటి చిత్రాలతో యోగి బాబు తమిళ చిత్ర పరిశ్రమ దృష్టిని ఆకర్షించారు. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన ‘చెన్నై ఎక్స్ ప్రెస్’లోనూ యోగిబాబుకు చోటు దక్కడం విశేషమే కదా. మడోన్నే అశ్విన్ దర్వకుడిగా తొలి ప్రయత్నంతో ఈ మండేలా చిత్రం రూపొందింది.

ఈ సినిమా కథలోకి వెళితే ఓ గ్రామ పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో కథ సాగుతుంది. ఆ ఊళ్లో ఉండే నెల్సన్ మండేలా అనే ఓ క్షురకుడు ఒక్కసారిగా వార్తల్లో వ్యక్తిగా ఎలా మారాడు అన్న ఆసక్తితో దీన్ని తెరకెక్కించారు. అతని విలువైన ఓటు పంచాయితీ ఎన్నికల్లో నిర్ణయాత్మకంగా మారడమే దీనికి కారణం. ఈ సినిమా ట్రైలర్ ఇటీవల విడులైంది. ఇందులోని ఇతివృత్తం అందరినీ ఆకర్షించడంతో అందరి దృష్టీ ఈ సినిమాపై పడింది. ఈ సినిమా కథకూ ఇంతకుముందు రూపొందిన ‘న్యూటన్’ సినిమా కథకూ దగ్గర పోలికలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ రెండు సినిమా టైటిళ్లూ నిజజీవిత వ్యక్తుల పేర్లే.
కాకపోతే వీరిప్పుడు జీవించి లేరు. న్యూటన్ చిత్రం 2017లో విడుదలైంది. ఇందులో రాజ్ కుమార్ రావు, పంకజ్ త్రిపాటి నటించారు. ఇది కూడా ఓటు నేపథ్యంతో ముడిపడిన కథే. ఓ మారుమూల పల్లెలో స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగంపై ఇది రూపొందింది. ‘ఐజాక్ న్యూటన్’, ‘నెల్సన్ మండేలా’ స్ఫూర్తితో ఈ సినిమాలకు ఇలా పేర్లు పెట్టారని అనుకోవచ్చు. మండేలా సినిమాలో దర్శకుడు మడోన్నే అశ్విన్ తానే స్వయంగా ఆరు పాటలు రాశారు. దీనికి భరత్ శంకర్ సంగీత దర్శకుడు. కేవలం హాస్యం కోసమే ఈ సినిమాని యోగిబాబుతో రూపొందించినట్టు అర్థమవుతోంది. ఈ సినిమా ద్వారా ఆయన మెప్పిస్తారో, ఎవరినైనా నొప్పిస్తారో చూడాలి.











