మనకు అంకెలు తొమ్మిదే ఎందుకు ఉన్నాయి. ఈ తొమ్మిది అంకెలు అనంతమైన సంఖ్యలను ఎలా ఇవ్వగలుగుతున్నాయి? సూర్యకుటుంబంలో మరి గ్రహాలు కూడా తొమ్మిదే ఎలా ఉన్నాయి?
మన జ్యోతిష శాస్త్రం దీన్ని ఎలా అంచనా వేసింది? జ్యోతిషం మూఢనమ్మకం, అంతా ట్రాష్ అని కొట్టి పారేస్తారు కొందరు. మనకు సుదూరంలో ఉన్న రెండు గ్రహాలు ఒకే రాశిలో ఉన్న విషయాన్ని మన పూర్వికులు ఏ టెక్నాలజీ లేని రోజుల్లో ఎలా గుర్తించారు? మన సైంటిస్టులు చెప్సిన విషయాలకూ, జ్యోతిష విషయాలకూ దగ్గర సంబంధం ఎలా కనిపిస్తోంది? ఈ నెల 21వ తేదీ గురువు, శని ఒకే రాశిలో అత్యంత సమీపంలో ఉంటారని సైంటిస్టులు చెబుతున్నారు. నిజానికి ఆరోజు గురువు, శని గ్రహాలు రెండూ ఒకే రాశిలో డిగ్రీల పరంగా కూడా ఒకే చోట ఉన్నాయి.
ఈ కలయికను ఎలా గుర్తించగలిగారు?
ఈ విషయాన్ని మన జ్యోతిష పండితులు ఎలా రాయగలిగారు? అలా రాయ గలిగారంటే మన జ్యోతిష శాస్త్రం కూడా నిజమని అనుకోవాలి కదా. మన వేదాంగాలలో జ్యోతిషం కూడా ఒకటి. పరాశరుడి ద్వారానే ఈ జ్యోతిష శాస్త్రం వెలుగులోకి వచ్చింది.గ్రహాలు మనిషి జీవితం మీద ఎంతవరకు ప్రభావాన్ని చూపుతాయి అనే విషయాన్ని పక్కన పెడితే ఎక్కడో సుదూర తీరాలలో ఉన్న రెండు గ్రహాలు ఒకే చోట కనిపించే విషయాన్ని మన జ్యోతిష పండితులు అంచనా వేయడం మాత్రం గొప్ప విషయం. ప్రధానంగా ఇక్కడ ప్రస్తావించాల్సిన అంశం ఈ డిసెంబరు 21వ తేదీన గురు, శని ఒకే రాశిలో అత్యంత సమీపంలో ఉండటం అనేది దాదాపు నాలుగు శతాబ్దాల క్రితం జరిగిందని మన సైంటిస్టులు అంటున్నారు. వారు చెప్పిన ప్రకారం 1623లో ఈ రెండు గ్రహాలూ అత్యంత సమీపంలోకి వచ్చాయి.
గ్రహాల మధ్య ఎంతెంత దూరం?
మరో విశేషమేమిటంటే అవి ప్రకాశవంతంగా మన కంటికి కనిపిస్తాయి కూడా. అందువల్ల ఈ కలయిక మీద అత్యంత ఆసక్తి ఏర్పడింది. అసలు మన భూమి నుంచి శని గ్రహానికి మధ్య ఉన్న దూరం 1.5961 బిలియన్ కిలో మీటర్లు. ఇదే భూమి నుంచి గురు గ్రహానికి ఉన్న దూరం 880.67 మిలియన్ కిలోమీటర్లు. ఈ రెండు గ్రహాలు అత్యంత సమీపంలోకి రావడానికి 397 సంవత్సరాలు పడుతుందట. 1226లో ఒకసారి ఇలా సమీపంలోకి వచ్చాయి. ఆ తర్వాత 1623లో మరోసారి వచ్చాయి. మళ్లీ ఇన్నాళ్లకు రాబోతున్నాయి. ఈ నెల 21వ తేదీ సాయంత్రం 5.28 గంటలకు వీటిని మన కళ్లతో చూడవచ్చని కూడా ఖగోళ శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇక్కడ మనం జ్యోతిష శాస్త్రాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది. ఈ రెండు గ్రహాలు మకర రాశిలో దాదాపు ఒకే డిగ్రీలో ఉండటాన్ని మీరు గమనించవచ్చు.
జ్యోతిష శాస్త్రం ప్రకారం ఆ రోజు రాశి చక్రాన్ని మీకోసం ఇక్కడ ఇస్తున్నాం గమనించండి
షష్టిపూర్తి అందుకేనా?
వాటి మధ్య దూరం ఎంత అన్నది పక్కన పెడితే మనకు ఎంతో దూరంలో ఉన్న రెండు అతి పెద్ద గ్రహాల గమనాన్ని మన జ్యోతిష వేత్తలు ఏ టెక్నాలజీ సాయం తీసుకోకుండా అంచనా వేయగలిగారు. అసలు ఈ రెండు గ్రహాలు మకర రాశిలో కలుసుకుని దాదాపు 60 ఏళ్లు అవుతుంది. ఎందుకంటే గురువు మకర రాశి నుంచి బయలుదేరి మళ్లీ మకర రాశిలోకి రావడానికి 12 ఏళ్లు పడుతుంది. అదే శని మకర రాశిలో బయలుదేరి మళ్లీ మకర రాశిలోకి రావడానికి 30 ఏళ్లు పడుతుంది. ఒక వ్యక్తి షష్టపూర్తి చేసుకున్నాడంటే అతను పుట్టిన సమయంలోని జాతక చక్రంలో గురువు, శని ఏ రాశిలో ఉంటారో మళ్లీ 60 ఏళ్ల తర్వాత అదే రాశిలో కలుసుకుంటారు. అందుకే షష్టి పూర్తి కూడా ఈ వయసులోనే చేసుకుంటారు. ఈ గ్రహద్వయం మకర రాశిలో కలుసుకుని 60 ఏళ్లు అయ్యిందని మనం గమనించాలి. తెలుగు సంవత్సరాలు 60గా నిర్ణయించడానికి కారణం కూడా ఇదేనంటారు మన పండితులు.
చంద్రుడి గమనమే కీలకం
ఈ 60 ఏళ్లు పూర్తవగానే మనిషి మరో జన్మ ఎత్తినట్టుగా భావించాలట. ఈ నెల 21 వ తేదీన గురువు, శని సమీపంలోకి వచ్చినప్పుడు వాటి మధ్య దూరం 73.5 కోట్ల కిలోమీటర్లు ఉంటుందని అంచనా. సాధారణంగా మనకు అత్యంత సమీపంలోని గ్రహం చంద్రుడు. ఈ చంద్రుడి గమనం ఆధారంగానే మన జ్యోతిష్కులు ఇతర గ్రహాలను గుర్తించగలిగారు. భూమి నుంచి చంద్రుడి దూరం 3,84,000 కి.మీ. మిగిలిన గ్రహాలన్నీ లక్షల కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. గురువు, శని ఒకే రాశిలో కలవడాన్ని కంజక్షన్ అంటారు. సాధారణంగా ప్రతి 20 ఏళ్లకూ ఒకసారి ఈ రెండు గ్రహాలూ కలుస్తుంటాయి. ఇలా కలిసిన ప్రతిసారీ మనిషి జీవితంలో కీలక మార్పులు కలుగుతుంటాయని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. వ్యక్తి పురోభివృద్ధి ఈ గ్రహాల కలయిక వల్ల జరుగుతుంది.
– హేమసుందర్ పామర్తి