ఢిల్లీలో CEC జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ నిరసనలు చేస్తున్న CJPకి వైసీపీ చీప్ జగన్మోహన్ రెడ్డి బహిరంగంగానే మద్దతు ప్రకటించారు. CJP ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రంకాల అరెస్టును ఖండించారు. ఐతే ఇదే సౌరవ్ దాస్ గతంలో తాను ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుగా పని చేసిన కాలంలో జగన్ అవినీతి బండారాన్ని క్విడ్ ప్రో కో దందాలను తవ్వి తీశారు. ఈ అంశం ఇప్పుడు సోషల్‌మీడియాలో చర్చనీయాంశంగా మారింది. 2023లో జగన్ అవినీతికి సంబంధించి సుదీర్ఘమైన ట్వీట్స్ చేశారు సౌరవ్ దాస్.
వైఎస్ జగన్ కుటుంబానికి మెజారిటీ వాటాలున్న భారతి సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన కేసులను సౌరభ్ దాస్ అప్పట్లో లోతుగా విశ్లేషించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కడప జిల్లాలో గనుల కేటాయింపుల కోసం భారీగా క్విడ్ ప్రో కో లావాదేవీలు జరిగాయని, దీని ద్వారా భారతి సిమెంట్స్‌కు వందల కోట్ల విలువైన సున్నపురాయి అక్రమంగా దక్కిందని ED స్పష్టం చేసింది. అప్పట్లో సుమారు రూ. 152 కోట్లకు పైగా విలువైన ఆస్తులను ED ఫ్రీజ్ చేయడం, ఆ తర్వాత న్యాయస్థానాల్లో జరిగిన పరిణామాలను సౌరభ్ దాస్ ఆధారాలతో సహా బయటపెట్టారు.
ఇక ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో జరిగిన అత్యంత గోప్యమైన, వివాదాస్పద బెంచ్ హంటింగ్ ఉదంతాన్ని కూడా సౌరభ్ దాస్ వెలుగులోకి తెచ్చారు. అత్యంత సున్నితమైన ఈ రాజకీయ కేసును హఠాత్తుగా ఒక బెంచ్ నుంచి వేరే బెంచ్‌కు ఎలాంటి కారణాలు చూపకుండానే మార్చడం వెనుక ఉన్న మతలబును ఆయన ఎత్తిచూపారు. అంతేకాకుండా, ఆ బెంచ్‌లో ఉన్న న్యాయమూర్తి వద్ద లా క్లర్క్‌గా పనిచేస్తున్న వ్యక్తికి, వైసీపీకి చెందిన కీలక నేతలతో ఉన్న సంబంధాలను ప్రస్తావిస్తూ న్యాయవ్యవస్థలో పారదర్శకత లోపాన్ని ఆయన ఎలుగెత్తి చాటారు.
అలా ఒకనాడు వైఎస్ జగన్ ఆర్థిక నేరాలను, క్విడ్ ప్రో కో చరిత్రను, వ్యవస్థల మేనేజ్మెంట్ను దేశం ముందు నిలదీసిన జర్నలిస్టులలో సౌరభ్ దాస్ ఒకరు. కాలక్రమేణా రాజకీయ సమీకరణాలు మారడంతో, ఇవాళ అదే కాక్రోచ్ జనతా పార్టీ నేతల అరెస్ట్‌లపై జగన్ స్పందించి మద్దతు పలకడం గమనార్హం. ఏది ఏమైనప్పటికీ, గతం లో జగన్ అవినీతి జాతకాన్ని తవ్వి పోసిన విశ్లేషణలు మాత్రం ఇప్పటికీ రాజకీయంగా చర్చనీయాంశంగానే ఉన్నాయి.











