ఎస్సీ, ఎస్టీల్లో అనేక అసమానతలున్నాయని, రిజర్వేషన్ ఫలాలు అన్ని వర్గాలకు ఒకేరీతిన అందడం లేదని, దానిని సరిదిద్దే అవకాశం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని, అయితే ఆ అధికారాలను ఎవ్వరూ తొలగించరాదంటూ సుప్రీంకోర్టులో జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం గురువారం నాడు కీలక వ్యాఖ్యలు చేసింది. అంతే కాదు రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా రిజర్వేషన్లపై స్వయం నిర్ణయం తీసుకుంటే అది రాజ్యాంగంలోని ఆర్టికల్ 341, 342, 342ఎ ల ఉల్లంఘన కిందకు వస్తందని చెప్పలేమని కూడా వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలతో చాలాకాలంగా తెలుగు రాష్ట్రాలలో రిజర్వేషన్ ప్రక్రియపై జరుగుతున్న ఉద్యమాలకు ఊతమిచ్చినట్లు అయ్యింది.
ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరించడాన్ని సవాల్ చేస్తూ 2005 సంవత్సరంలో దాఖలైన పిటీషన్ ను అప్పట్లో సుప్రీంకోర్టు కొట్టివేసింది. అయితే పంజాబ్ తో పాటు దేశంలోని కొన్ని రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణను అమలులోకి తీసుకువచ్చాయి. అప్పట్లో ఆ వర్గీకరణను కొట్టివేస్తూ ఆయా రాష్ట్రాల హైకోర్టులు కొట్టివేశాయి. వీటిని తిరిగి 2014 వ సంవత్సరంలో ఐదుగురు సభ్యులైన జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ అనిరుద్దబోస్ లతో కూడిన న్యాయమూర్తుల ధర్మాసనానికి సుప్రీంకోర్టు అప్పగించింది. ఈ అంశంపై దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత ధర్మాసనం గురువారం నాడు తన తీర్పు వెలువరించింది. ఎస్సీ, ఎస్టీ వర్గాల రిజర్వేషన్లలో అసమానతలు ఉన్నాయని, దీనిని సరిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్న విశేష అధికారాలను తీసేయకూడదని ఈ ధర్మాసనం తన తీర్పును వెలువరించింది. దీంతో మళ్లీ తెలుగు రాష్ట్రాలలో రిజర్వేషన్ల అంశంపై కదలిక వచ్చినట్లు అయ్యింది.
సుప్రీం తాజా తీర్పును అనుసరించి రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్ల ప్రక్రియపై నూతనంగా విధివిధానాలను రూపొందించే అవకాశం వచ్చింది. ఇప్పటి వరకూ అమలులో ఉన్న రిజర్వేషన్ ప్రక్రియను పక్కన పెట్టి సుప్రీంకోర్టు తాజా తీర్పును అనుసరించి తమకున్న అధికారాల మేరకు రిజర్వేషన్లు సమానంగా పంపిణీ చేసే అవకాశం కలిగింది. రిజర్వేషన్లు ఎలా అమలు చేయాలనే అధికారం రాష్ట్రాలకే ఉందని సుప్రీంకోర్టు తాజా తీర్పులో పేర్కొనడంతో తెలుగు రాష్ట్రాలలో మళ్లీ తేనె తుట్టను కదిలించినట్లు అయ్యిందని రాజ్యాంగ నిపుణులు అంటున్నారు.
మాదిగల డిమాండ్‌కు ఊతం
ఇతర రాష్ట్రాల కంటే తెలుగు రాష్ట్రాలలో రిజర్వేషన్ల ప్రక్రియపై మూడు దశాబ్దాలుగా ఉద్యమం నడుస్తోంది. మాదిగలు తమకు రిజర్వేషన్ ఫలాలు సక్రమంగా అందడం లేదంటూ ఉద్యమిస్తున్నారు. క్షేత్రస్ధాయిల రిజర్వేషన్ల తీరును పరిశీలించి దానికి తగ్గట్టుగా నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని సుప్రీం వ్యాఖ్యానించింది.
ప్రతి ఒక్కరి కన్నీళ్లు తుడవడం రాజ్యాంగం బాధ్యతని పేర్కొంటూ సుప్రీంకోర్టు తాజాగా చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాలలో మళ్లీ రిజర్వేషన్ల ఉద్యమానికి ఊతం ఇచ్చినట్లు అయ్యింది. పైగా ఎస్సీ, ఎస్టీలందరూ ఒకే సామూహిక జాతిగా రారంటూ నివేదికలు పేర్కొంటున్నాయని కూడా సుప్రీం కోర్టు వ్యాఖ్యానించడం రిజర్వేషన్ల వర్గీకరణకు మరింత ఊతమిచ్చినట్లు అయ్యింది. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో తెలుగు రాష్ట్రాలలో మళ్లీ రిజర్వేషన్ వర్గీకరణ ఉద్యమానికి ఊతం వచ్చినట్లేనని రాజ్యాంగ నిపుణులు, ఉద్యమకారులు వ్యాఖ్యానిండం కొసమెరుపు.