తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు , మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ఆ పార్టీ ప్రతి సంవత్సరం మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఏటా మే 27 నుంచి 29 వరకు మూడు రోజులపాటు నిర్వహించే ఈ వేడుకను టిడిపి నాయకులు, కార్యకర్తలు ఒక పండగలా భావిస్తారు.
గడిచిన రెండేళ్లుగా కరోనా కారణంగా తెలుగుదేశం పార్టీ మహానాడును ఆన్ లైన్ లోనే నిర్వహించుకోవాల్సి వచ్చింది. ఇక ఈ ఏడాది కోవిడ్ ప్రభావం కాస్త తగ్గుముఖం పట్టడంతో మహానాడు ప్రత్యక్షంగా నిర్వహించేందుకు టిడిపి నిర్ణయించింది. అయితే ఎప్పటిలాగా మూడు రోజులు కాకుండా ఈసారి మహానాడు ఒక్కరోజుకే పరిమితం చేయాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. దీంతో మహానాడు ఎన్టీఆర్ జయంతి రోజైన మే 28 వ తేదీ ఒక్కరోజే జరగనుంది.
ఇక ఈ ఏడాది మహానాడుకు సంబంధించి షెడ్యూల్ ఖరారేయింది. ఈసారి మహానాడును ఒంగోలు శివారులో నిర్వహించనున్నారు. మే 27 వ తేదీన నాలుగైదు వేల మంది పరిమిత ప్రతినిధులతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తారు.ఇక 28న నిర్వహించే మహానాడుకు ఎవరైనా హాజరుకావొచ్చని టీడీపీ నేతలు తెలిపారు. ఆ రోజు నిర్వహించే భారీ బహిరంగ సభలోనే ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను ప్రారంభించనున్నారు, ఈ ఉత్సవాలను ఏడాదిపాటు కొనసాగించాలని టిడిపి హై కమాండ్ నిర్ణయించింది.