మాజీ మంత్రి, వైఎస్ సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏపీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సీబీఐకి లేఖ రాశారు. వివేకానందరెడ్డి హత్య జరిగిన 3 గంటల సేపు పోలీసు అధికారులను కూడా లోపలకు అనుమతించలేదని ఆయన లేఖలో గుర్తు చేశారు. వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించి సంవత్సరం అవుతున్నా నేటికీ ఈ కేసులో ఎలాంటి పురోగతి లేదని ఏబీ రాసిన లేఖలో పేర్కొన్నారు. వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించిన కీలక ఆధారాలు తన వద్ద ఉన్నాయని దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారికి రెండు సార్లు ఫోన్ చేసినా నేటికీ స్పందించలేదని సీబీఐ చీఫ్‌కు రాసిన లేఖలో ఆయన వెల్లడించారు.
గుండెపోటుగా చిత్రీకరించాలని చూశారు..
వివేకానందరెడ్డి హత్య కేసును కొందరు గుండెపోటుగా చిత్రీకరించాలని చూశారని ఏబీ వెంకటేశ్వరావు లేఖలో స్పష్టం చేశారు. వివేకానందరెడ్డి హత్య తరవాత ఇల్లంతా కడిగారని, వివేకాను ఆసుపత్రికి తరలించే వరకు కడప ఎంపీ అవినాష్‌రెడ్డి ఎవరినీ లోపలకు అనుమతించలేదని ఏబీ రాసిన లేఖలో తెలిపారు. వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్ష్యాలను తారుమారు చేశారనడానికి ఇంతకంటే నిదర్శనం మరొకటి అవసరం లేదన్నారు. ఈ మొత్తం సమాచారాన్ని అప్పటి దర్యాప్తు అధికారికి కూడా అప్పగించానన్నారు. అందుకే తనపై వైసీపీ నేతలు కక్షకట్టారని ఏబీ వెంకటేశ్వరరావు అభిప్రాయపడ్డారు.
Also Read : వివేకా హత్యకేసు, పరిటాల హత్య కేసు.. నిందితుల మరణాలు కామన్ !