వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం పొద్దున్నే తన తండ్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డిని స్మరించుకుంటూ ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ఈ ట్వీట్ పై ఆయన వైరి వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. తన తండ్రికి జగన్ నివాళి అర్పిస్తూ చేసిన ట్వీట్ లోని అంశాలన్నీ నిజంగా నిజమేనా? అన్న దిశగా సెటైర్ల మీద సెటైర్లు పడిపోతున్నాయి.
జగన్ ఏమని ట్వీటారంటే..?
అయినా జగన్ సదరు ట్వీట్ లో ఏమని పేర్కొన్నారంటే.. *చెదరని చిరునవ్వే నువు పంచిన ఆయుధం.. పోరాడే గుణమే నువు ఇచ్చిన బలం.. మాట తప్పని నైజం నువు నేర్పిన పాఠం.. నీ ఆశయాలే నాకు వారసత్వం.. ప్రజల ముఖాల్లో విరిసే సంతోషంలో నిను చూస్తున్నా.. పాలనలో ప్రతిక్షణం నీ అడుగుజాడను స్మరిస్తూనే ఉన్నా.. జన్మదిన శుభాకాంక్షలు నాన్నా* అంటూ జగన్ అందులో తనదైన శైలి సెటైరిక్ వ్యాఖ్యలు చేశారు.
అన్నింటిపైనా సెటైర్లే
ఈ ట్వీట్ ను చూసిన ఆయన రాజకీయ ప్రత్యర్థులు అందులోని ఒక్కొక్క అంశాన్నే ప్రస్తావిస్తూ జగన్ మాదిరే సెటైరిక్ విమర్శలు గుప్పిస్తున్నారు. అందులోని ప్రతి అంశాన్ని ప్రశ్నిస్తూ.. వాటికి భిన్నంగా జగన్ వ్యవహరించిన తీరు గుర్తు చేస్తూ మరీ విరుచుకుపడుతున్నారు. అవెలా సాగాయో చూద్దాం పదండి.
# చెదరని చిరునవ్వే నువు పంచిన ఆయుధం.. మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పై విరుచుకుపడ్డ సందర్భంగా మీ నవ్వేమైంది?
# పోరాడే గుణమే నువు ఇచ్చిన బలం.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం కేంద్రం వద్ద రాజీ పడ్డప్పుడు మీ పోరాడే గుణం ఏమైంది?
# మాట తప్పని నైజం నువు నేర్పిన పాఠం.. అవ్వతాతలకు పెంచిన పెన్షన్ ఇస్తానని మాట తప్పినప్పుడు మాట తప్పని నైజం ఏమైంది?
# నీ ఆశయాలే నాకు వారసత్వం.. రాజకీయాలను కక్షసాధింపులకు వినియోగించని వైఎస్సార్ వారసత్వం మీలో ఎక్కడ?
# ప్రజల ముఖాల్లో విరిసే సంతోషంలో నిను చూస్తున్నా.. రాజధాని రైతుల ముఖాల్లో మీకు సంతోషం కనిపిస్తోందా?
# పాలనలో ప్రతిక్షణం నీ అడుగుజాడను స్మరిస్తూనే ఉన్నా.. ప్రతి పథకంపైనా లెక్కలేనన్ని విమర్శలు వస్తుంటే వైఎస్సార్ అడుగుజాడలు కనిపించడం ఎక్కడ?
Must Read ;- అక్కడ అన్న.. ఇక్కడ చెల్లి