భగ్నప్రేమికుడ్ని దేవదాసు అని పిలుస్తాం. అప్పుడే కాదు, ఇప్పుడు మాత్రమే కాదు ఎప్పటికీ అలానే పిలుస్తాం. తరతరాలపై దేవదాసు ప్రభావం ఏంటో చెప్పడానికి ఇంతకుమించిన ఉదాహరణ బహుశా ఇంకోటి ఉండదేమో.
ఏఎన్నార్ లివ్స్ ఆన్ అనే క్యాప్షన్ ను బహుశా ఈ సినిమాను దృష్టిలో పెట్టుకొనే పెట్టారేమో అనిపిస్తుంది. అంతలా తనదైన ముద్రవేశాడు దేవదాసు. ఇది కేవలం ఓ సినిమా కాదు. చెప్పుకుంటే చరిత్ర. ఓ చిన్న నవల ఆధారంగా వచ్చి దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది ఈ సినిమా. సుప్రసిద్ధ బెంగాలీ రచయిత శరత్ చంద్ర ఛటర్జీ రాసిన దేవదాస్ అనే నవల ఆధారంగా ఆదే పేరుతో తెరకెక్కింది దేవదాసు. ఆ నవలను తెలుగులోకి అనువదించి మరీ చక్రపాణి ఈ చిత్రాన్ని నిర్మించారు. వేదాంతం రాఘవయ్య దర్శకత్వానికి, అక్కినేని, సావిత్రిల నటనకు, ఘంటసాల గానానికి ఈ సినిమా చరిత్రలో మచ్చుతునకగా నిలిచి పోతుంది.
నిజానికి ఇది అక్కినేని చేయాల్సిన సినిమా కాదు, ఎన్టీఆర్ కోసం అనుకున్నారు. హీరోయిన్ గా భానుమతిని
అనుకున్నారు. అయితే భానుమతి డేట్స్ దొరకలేదు. తీరా ఆమె డేట్స్ దొరికేసరికి, ఎన్టీఆర్ బిజీ అయిపోయారు. దాంతో అక్కినేని నాగేశ్వరరావు, షావుకారు జానకిని ఎంపిక చేశారు. స్వయంగా వేదాంతం రాఘవయ్య, జానకి ఇంటికెళ్లి ఆమెను ఒప్పించారు. 1951 నవంబర్ 24వ తేదీ రాత్రి 8 గంటలకు రేవతీ స్టూడియోలో ‘దేవదాసు’ చిత్రం ముహూర్తం జరిగింది. రేవతీ స్టూడియోలో మొదలైన తొలి చిత్రం ఇదే.
అయితే భగ్నప్రేమికుల కథలు తెలుగులో పనిచేయవని చాలామంది భయపెట్టారు. దీంతో మొదటి షెడ్యూల్ అవ్వగానే సినిమా ఆపేశారు. మధ్యలో మరో సినిమా చేశారు. ఆ తర్వాత నిర్మాత డీఎల్ నారాయణ పట్టుబట్టి దేవదాసును పట్టాలపైకి తీసుకొచ్చారు. అంతా తప్పుకున్నా సరే తనే సోలోగా నిర్మాతగా మారి దేవదాసు నిర్మించారు. అదే టైమ్ లో ఓ కీలక పరిణామం జరిగింది. జమునను తీసేసి ఆ పాత్రలో సావిత్రిని తీసుకున్నారు. ఓ మంచి పాత్ర మిస్సయినందుకు జమున 3 రోజుల పాటు షూటింగ్స్ అన్నీ ఆపేసి మరీ ఇంట్లో కూర్చొని ఏడ్చారు.
ఓవైపు సినిమా షూటింగ్ అవుతుంటే, మరోవైపు విమర్శలు మాత్రం ఆగలేదు. అప్పటివరకు కత్తిపట్టి జానపదాలు చేసిన నాగేశ్వరరావును దేవదాసుగా చూడలేమంటూ చాలా విమర్శలు, సెటైర్లు వచ్చాయి. ఇవి అక్కినేని వరకు కూడా చేరాయి. దీంతో ఆయన దేవదాసు పాత్రను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నవలను తెలుగులో అనువదించిన చక్రపాణి వద్దకెళ్లి దేవదాసు పాత్రలో లోతు తెలుసుకున్నారు. తాగుబోతు లుక్స్ లో, నీరసించిన కళ్లతో కనిపించడం కోసం రాత్రివేళల్లో షూటింగ్స్ చేశారు. ఇక క్లైమాక్స్ కోసమైతే 2 పూటలు భోజనం మానేశారు ఏఎన్నార్. అలా నిజంగానే నీరసించిపోయి నటించారు. తర్వాత కోలుకోవడానికి 2 వారాల పైనే పట్టింది.
దేవదాసు పాత్ర కోసం రాత్రిళ్లు నిద్ర మానేసి, అర్థరాత్రి షూటింగ్ చేసేవారు. ఆ నిద్రకళ్లతో నటించడం వల్ల అక్కినేని నిజంగా తాగారని అంతా అనుకునేవారు. నిజానికి ఆ టైమ్ కు అక్కినేనికి మద్యం అలవాటు లేదు. ఆయన దేవదాసు పాత్రలో ఎంతలా లీనమయ్యారంటే.. సినిమా రిలీజ్ తర్వాత అతిగా తాగొద్దంటూ ఏఎన్నార్ కు వేలాది ఉత్తరాలొచ్చాయి. ఇక పార్వతి పాత్ర పోషించిన సావిత్రికి ఆ టైమ్ కు 18 ఏళ్లు మాత్రమే. ఇక ఈ సినిమాలో మరో ప్రత్యేకత ఏంటంటే.. సినిమాలో ఎక్కడా దేవదాసు-పార్వతి ప్రేమిస్తున్నాననే విషయాన్ని చెప్పుకోరు. కథ అలా సాగిపోతుందంతే.
ఈ సినిమా షూటింగ్ లోనే మరో ఘోరం కూడా జరిగింది. సంగీత దర్శకుడు సీఆర్ సుబ్బురామన్ మరణించారు. దీంతో దేవదాసులో మిగిలిన 2 పాటల్ని ఆయన శిష్యుడు ఎమ్మెస్ విశ్వనాథన్ కంపోజ్ చేసి పెట్టారు. ఆ పాటలే అందం చూడవయా.. జగమే మాయ. ఈ పాటలు ఎంత పెద్ద హిట్టయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జగమే మాయ పాటకోసమైతే ఘంటసాల 3 నెలలు కష్టపడాల్సి వచ్చింది. ఎమ్మెస్ విశ్వనాథన్ పనితనం చూసి ఘంటసాల పొంగిపోయారు.
ఇలా ఓ చెడు జరిగిన ప్రతి సందర్భంలో దేవదాసుపై, అక్కినేనిపై, సావిత్రిపై విమర్శలు ఆగలేదు. అయినా అవేం పట్టించుకోకుండా పూర్తి నమ్మకంతో సినిమా రిలీజ్ చేసి విడుదల చేశారు. అలా 1953 జూన్ 26న విడుదలైన ఈ సినిమాకు మొదటి రోజు ఫ్లాప్ టాక్ వచ్చింది. సినిమా బాగాలేదు పాటలే బాగున్నాయన్నారు. వారం తిరిగేసరికి దేవదాసు పవరేంటో తెలిసొచ్చింది. నెగెటివ్ కాస్తా పాజిటివ్ టాక్ గా మారి, అఖండ విజయాన్నందుకుంది. 1928 నుంచి ఇప్పటివరకూ బెంగాలి, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో దాదాపు 12 సార్లు ‘దేవదాసు’ కథ తెరకెక్కింది. వీటన్నింటిలో తెలుగు ‘దేవదాసు’ నంబర్ వన్ గా నిలిచిందంటే, దానికి కారణం అక్కినేని నటన.
1937లో హిందీలో పి.సి.బారువా దేవదాసు చిత్రాన్ని నిర్మించారు. కె.ఎల్.సైగల్, జమున హీరోహీరోయిన్లు.. అదే సంవత్సరంలో తమిళంలోనూ సి.వి.రావు నటుడు, దర్శకుడుగా దేవదాసు సినిమా వెలువడింది. మళ్ళీ 1955లో హిందీలో దిలీప్ కుమార్, వైజయంతిమాల, సుచిత్రాసేన్‌లతో మరొక దేవదాసు వచ్చింది. మళ్ళీ హిందీలోనే షారుక్ ఖాన్, ఐశ్వర్యారాయ్, మాధురీ దీక్షిత్‌లతో 2002లో ఇదే కథ సినిమాగా వచ్చింది. అన్ని భారతీయ భాషలలో కలసి దాదాపు 10 సార్లు ఈ సినిమా విడుదల అయినా నాగేశ్వరరావు దేవదాసుగా నటించిన ఈ చిత్రానికి వచ్చినంత పేరు మరే దేవదాసు చిత్రానికీ రాలేదు.
1974లో కృష్ణ దేవదాసుగా నటించిన సినిమా విడుదలై 50రోజులు ఆడితే, అదే సమయంలో మళ్ళీ విడుదలైన ఏఎన్నార్ దేవదాసు 200 రోజులు ఆడింది. అదీ ఈ సినిమా గొప్పదనం. ఈతరం వాళ్లకి ఈ కథా వస్తువులో పెద్ద గొప్పతనమేమీ కనిపించదు. పేదింటి అమ్మాయిని గొప్పింటి అబ్బాయి ప్రేమించడం, అబ్బాయి తరపు పెద్దలు వీరి ప్రేమను అంగీకరించకపోవడం, ఆ అబ్బాయి బాధను మరిచిపోవడం కోసం మద్యానికి బానిస కావడం. ఈ కథాంశంతో ఇప్పటి వరకూ చాలా సినిమాలే వచ్చాయి. కానీ ఈ ఫార్ములాకి మూలం ‘దేవదాసు’. ఈ నగ్నసత్యాన్ని ఎవ్వరూ కాదనలేరు. అందుకే దేవదాసు అనేది కేవలం ఓ క్లాసిక్ మాత్రమే కాదు, ఇదొక చరిత్ర.