పాఠశాలల్లో విద్యార్థుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అనంతపురం జిల్లా రాప్తాడు పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై జరిగిన అమానుష దాడి ఘటనపై ఆయన స్పందించిన తీరు, చూపిన ఉదారత పట్ల ప్రజల నుంచి “శభాష్ లోకేశ్” అంటూ అభినందనలు వ్యక్తమవుతున్నాయి. ఘటన తెలిసిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా విద్యార్థినుల రక్షణే లక్ష్యంగా మొదటి పీరియడ్ పూర్తికాగానే పాఠశాలల గేట్లు మూసివేయాలని కఠిన ఆదేశాలు జారీ చేసి తన పరిపాలనా దక్షతను నిరూపించుకున్నారు.
బాధితురాలికి మెరుగైన వైద్యం అందించడంలో యువనేత లోకేశ్ చూపిన చొరవ ప్రతి ఒక్కరి హృదయాలను తాకింది. గాయపడిన బాలికను వెంటనే బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రికి తరలించేందుకు కర్ణాటక ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని ప్రత్యేకంగా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయించారు. అంతటితో ఆగకుండా, స్వయంగా బెంగళూరు వెళ్లే వరకు విశ్రమించలేదు. ఆసుపత్రికి వెళ్లి వైద్యులతో మాట్లాడి, 12 గంటల పాటు సాగిన శస్త్రచికిత్సల వివరాలు తెలుసుకుని బాలిక పరిస్థితి నిలకడగా ఉందని ధైర్యాన్ని నింపారు.
బాధిత కుటుంబానికి కొండంత అండగా నిలిచారు మంత్రి లోకేశ్. బాధిత తండ్రికి తన వ్యక్తిగత ఫోన్ నంబర్ అందించి, “ఆ పాపను నా సొంత కూతురిలా చూసుకుంటాను.. ఏ అవసరం వచ్చినా నేరుగా కాల్ చేయండి” అని ఇచ్చిన భరోసా ఆయన మానవీయ దృక్పథానికి నిదర్శనంగా నిలిచింది. మరోవైపు, ఈ దారుణాన్ని కళ్లారా చూసి తీవ్ర భయాందోళనలకు గురైన తోటి విద్యార్థుల కోసం విదేశాల తరహాలో 20 మంది మానసిక నిపుణుల బృందాన్ని రంగంలోకి దించారు. ఈ బృందం విద్యార్థుల ఇళ్లకు వెళ్లి ధైర్యం చెప్పడం లోకేశ్ ముందుచూపుకు అద్దం పడుతోంది.
ఆడపిల్లల జోలికి రావాలంటేనే ఉన్మాదులు వణికిపోవాలి అని హెచ్చరించిన లోకేశ్, పోలీసుల చర్యలకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఫలితంగా నిందితుడు హేమంత్‌ను పోలీసులు కొన్ని గంటల్లోనే అదుపులోకి తీసుకోవడమే కాకుండా, పట్టుకునే క్రమంలో జరిగిన కాల్పుల్లో నిందితుడు గాయపడి ఆసుపత్రి పాలయ్యాడు. ఆపదలో ఉన్న కుటుంబానికి ఒక తండ్రిలా, సోదరుడిలా అండగా నిలిచి.. తక్షణ నిర్ణయాలతో వ్యవస్థను పరుగులు తీయించిన విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కార్యదక్షతపై రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది.











