అన్నిట్లో వేలు పెట్టి.. పెత్తనం చేసి …!
అంతా నా ఇష్టం .. అన్నింట్లో నా వేలు .. నా కాలు ఉండాల్సిందేనని పెత్తనం చేస్తూ .. అధికారులను ముమ్ముతిప్పలు పెడుతుంటాడు ఈ షాడో మేయర్! విశాఖ మేయర్ కూర్చీ .. ఆయన పాలిట కోతికి కొబ్బరిచిప్ప దొరికిన మాదిరిగా తయారైంది. అందుకే కుప్పిగంతులేస్తున్నాడని సొంతపార్టీ వారే విమర్శలు గుప్పిస్తున్నారు. నిజానికి విశాఖ మేయర్ హరివెంకటకుమారి అయినా .. తన భర్త శ్రీనివాసరావుదే పెత్తనం! వెనకుండికాకుండా… అంతా తానే ముందుండి, ఆమెను పక్కనపెట్టి మరి చక్కదిద్దుతుంటాడు. ప్రజలు, అధికారులు, కార్పొరేటర్లలకు ఏ పనులు కావాలన్నా.. ఈ షాడో మేయర్ వద్దకు వెళ్లాల్సిందే! మేయర్ కార్యాలయానికి రాకున్న ఆమె ఛాంబర్లో కూర్చుని పాలనా వ్యవహారాలను చక్కబెడుతుంటారు ఈ షాడో. స్టాండింగ్ కమిటీతోపాటు కౌన్సిల్ అజెండాలో ఏ అంశాలను పెట్టాలో అధికారులకు దిశా నిర్దేశం చేస్తాడు. పేరుకే మేయర్ హరివెంకటకుమారి .. పెత్తనమంతా భర్త శ్రీనివాసరావుదేనన్నది విశాఖ నగరంలో బహిరంగ రహస్యమే!
షాడో ఆగడాలతో గగ్గోలు పెడుతున్న అధికారులు ..!
షాడో మేయర్ ఆగడాలకు జీవీఎంసీ అధికారఘనం గగ్గోలు పెడుతోంది! గతంలో కమిషనర్ సృజన ఉన్నప్పుడు అధికారులపై ఒత్తిడి కొంచెం తక్కువగానే ఉండేదని, ఆమె బదిలీ తరువాత ఈ షాడో మేయర్ పెత్తనం ఉద్యోగులపై ఎక్కవైందని ఆరోపిస్తున్నారు. కార్యాలయంలోని పలు విభాగాలకు చెందిన అధికారులను ఛాంబర్ కు పిలిపించుకుని సమీక్షలు చేస్తూ.. ఆదేశాలు ఇస్తుంటారు. అలా స్టాండింగ్ కమిటీ, జీవీఎంసీ సాధారణ కౌన్సిల్ సమావేశాలకు అజెండా రూపకల్పన వంటి మొత్తం శ్రీనివాసరావు కనుసన్నల్లో జరగాల్సింది. తనకు నచ్చినట్లు, కావాల్సిన విధంగా అజెండాలను రూపొందిస్తున్నారని విపక్షంతోపాటు అధికారపార్టీకి చెందిన కార్పొరేటర్లు సైతం ఆరోపిస్తున్నారు. ఈ నెల 23న జరిగే స్టాండింగ్ కమిటీ సమావేశంలో.. గత రెండుళ్లలో మెకానికల్ విభాగానికి సంబంధించిన పెండింగ్ బిల్లులు చెల్లింపు, లీజ్ చెల్లించలేదనే కారణంతో సీజ్ చేసిన దుకాణాల్లో కొన్నింటిని తెరుచుకునేందుకు అనుమతించడంతోపాటు 51 అంశాలతో అజెండా తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మేయర్ ఛాంబర్ లో ఆమెకు బదులు షాడో మేయర్ అధికారులతో సమీక్షలు చేయడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. గత కమిషనర్ హయంలో ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ లేదని విమర్శలు గుప్పిస్తున్నారు. షాడో పెత్తనం విరగడైతేనే జీవీఎంసీ బాగుపడుతోందని అధికారులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.










