హైదరాబాద్ మహానగరం ప్రపంచ పటంలో నిలవడానికి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ముందుచూపే ప్రధాన కారణమనే వాదనకు తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యలు మరింత బలాన్ని చేకూర్చాయి. ఇటీవల NTV తాజా ఇంటర్వ్యూలో మాట్లాడిన తుమ్మల.. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు ఔటర్ రింగ్ రోడ్డు (ORR) నిర్మాణానికి కావలసిన భూసేకరణ అంతా TDP ప్రభుత్వ హయాంలోనే పూర్తయిందని స్పష్టం చేశారు. ఆ సమయంలో తాను R అండ్ B, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంత్రిగా వ్యవహరించానని, ఆ కీలక ప్రాజెక్టుల పునాదుల వెనుక ఉన్న కృషిని తుమ్మల గుర్తుచేసుకున్నారు.
ఆనాడు భూసేకరణ ప్రక్రియ సవాలుగా మారినప్పటికీ, రైతులు నష్టపోకుండా వేగంగా నిర్ణయాలు తీసుకున్నామని తుమ్మల వెల్లడించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఓఆర్ఆర్ నిర్మాణం కోసం ల్యాండ్ అక్విజిషన్ సమయంలో ఎకరాకు గరిష్టంగా రూ. 6 లక్షల రూపాయల వరకు చెల్లించామని ఆయన తెలిపారు. చంద్రబాబు నేతృత్వంలో అప్పట్లో దూరదృష్టితో వేసిన అడుగులే, తర్వాతి కాలంలో హైదరాబాద్ రూపురేఖలను పూర్తిగా మార్చేయడమే కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా నగరాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టాయని ఈ సందర్భంగా ప్రస్తావించారు.
నాడు అతి తక్కువ ధరకు సేకరించిన భూములు..ఇవాళ ఊహకందని స్థాయిలో విలువను సంతరించుకోవడంపై తుమ్మల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో ల్యాండ్ సేకరణ జరిపిన ప్రాంతాల్లో భూముల ధరలు ఇవాళ ఆకాశాన్ని తాకుతున్నాయని, ముఖ్యంగా కోకాపేట వంటి ప్రాంతాల్లో ఇప్పుడు ఎకరం భూమి వందల కోట్ల రూపాయలు పలుకుతోందని ఆయన గుర్తుచేశారు. ఆనాడు ప్రభుత్వం విజన్ తో తీసుకున్న నిర్ణయాలు, సేకరించిన భూములే ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి అత్యంత భారీ ఆదాయ వనరులుగా, ఆర్థిక రంగానికి ఊతంగా మారాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
మంత్రి తుమ్మల చేసిన ఈ తాజా వ్యాఖ్యలతో హైదరాబాద్ మహానగర అభివృద్ధిలో చంద్రబాబు పాత్రపై మరోసారి రాజకీయ, సామాజిక వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. ఏ ప్రభుత్వం వచ్చినా అభివృద్ధి ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లినప్పటికీ.. నాటి టీడీపీ ప్రభుత్వంలో పడిన పునాదులే నేటి హైటెక్ హైదరాబాద్కు ప్రాణవాయువుగా మారాయని నగర ప్రజలు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.











