వైసీపీ ప్రధాన కార్యదర్శి, పార్టీ ఉత్తరాంధ్ర ఇంచార్జీ వేణుంబాక విజయసాయిరెడ్డి గడచిన కొన్ని రోజులుగా ఎక్కడా కనిపించడం లేదు. నిత్యం ఉత్తరాంధ్రలోనే తనదైన శైలి రాజకీయాలు నడుపుతున్న సాయిరెడ్డి.. వైసీపీ తరఫున సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉంటున్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, జనసేన అధినేత పవన్ కల్యాణ్, రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజులపై అవసరం ఉన్నా, లేకున్నా తనదైన శైలిలో విచిత్ర కామెంట్లు చేసే సాయిరెడ్డి.. ఇటీవలి కాలంలో ఆ దిశగా దాడి చేయడం లేదు. అసలు తనకేమీ పట్టనట్టే వ్యవహరిస్తున్నారు కూడా. విశాఖలోనూ ఆయన కనిపించడం లేదు. అప్పుడప్పుడు కనిపించినా.. ఏదో ఇలా వచ్చాం అలా వెళ్లామన్నట్లుగా ఆయన తీరు ఉందనే చెప్పాలి. ఇలా ఒక్కసారిగా సాయిరెడ్డి సైలెంట్ కావడానికి గల కారణాలేమిటన్న విషయంపై పెద్ద ఎత్తున విశ్లేషణలు సాగుతున్నాయి. అసలు సాయిరెడ్డికి ఏమైంది అంటూ రాజకీయ విశ్లేషకులు కూడా కామెంట్లు చేస్తున్నారు.
పెద్దల సభకు పంపరట
ఇలా ఉన్నట్లుండి సాయిరెడ్డి మౌనవ్రతం పట్టడానికి గల కారణాలేమిటన్న దిశగా పరిశీలన చేస్తే.. ఓ ఆసక్తికర అంశం వెలుగు చూసింది. అదేంటంటే.. ప్రస్తుతం వైసీపీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న సాయిరెడ్డి.. పార్లమెంటరీ పార్టీ నేతగానూ వ్యవహరిస్తున్నారు. అయితే రాజ్యసభ సభ్యుడిగా ఇప్పటికే వరుసగా రెండు సార్లు అవకాశం దక్కించుకున్న సాయిరెడ్డి ఏకబిగిన 12 ఏళ్ల పాటు ఎంపీగా కొనసాగారు. తాజాగా వచ్చే ఏడాది మే నెలలో సాయిరెడ్డి పదవీ కాలం ముగియనుందట. ఈ క్రమంలో మరోమారు తనకు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వాల్సిందేనని జగన్‌ను సాయిరెడ్డి కోరారట. అయితే సాయిరెడ్డి అభ్యర్థనకు జగన్ ఏమాత్రం స్పందించలేదట. అవకాశం ఇస్తాననో, ఇవ్వననో అనే మాట కూడా చెప్పలేదట. జగన్ సైలెంట్ అయ్యారంటే.. నో చెప్పినట్టే కదా. తాను అడిగినప్పుడు జగన్ స్పందించకుంటే.. తాను మాత్రం ఇక పార్టీ తరఫున వైరి వర్గాలపై ఎందుకు దూకాలి అన్న దిశగా ఆలోచించిన సాయిరెడ్డి మౌనవ్రతాన్ని ఎంచుకున్నారట. ఈ వార్తల్లో ఏ మేర నిజముందో తెలియదు గానీ.. సాయిరెడ్డి సైలెన్స్ ను గమనించిన వారు మాత్రం ఈ మాట నిజమేనని నమ్ముతున్నారు.
సీటు దక్కకపోతే పరిస్థితి ఏంటి?
వైసీపీ తరఫున తొలి రాజ్యసభ సభ్యత్వం సాయిరెడ్డికే దక్కింది. జగన్‌పై నమోదైన అక్రమాస్తుల కేసుల్లోనూ సాయిరెడ్డి ఉండటం, జగన్ ఆర్థిక వ్యవహారాలన్నింటిని కూడా సాయిరెడ్డే పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో ఆయనకు పార్టీలో ఎనలేని ప్రాధాన్యం ఇస్తూ, ఆయనను రాజకీయాల్లోకి దింపేసిన జగన్.. ఆయనకు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని కట్టబెట్టారు. అంతేకాకుండా.. విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తున్నామన్న భావనతో విశాఖతో పాటు ఉత్తరాంధ్ర పార్టీ వ్యవహారాలన్నింటినీ సాయిరెడ్డికి అప్పగిస్తూ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇదే అదనుగా సాయిరెడ్డి.. జగన్‌కు తెలిసి కొన్ని, తెలియకుండా మరికొన్ని పనులు చేస్తూ తనదైన శైలిలో చక్రం తిప్పుతున్నారు. మొన్నామధ్య మితిమీరిన సాయిరెడ్డి పెత్తనంపై విశాఖ నేతలు జగన్ కు ఫిర్యాదు కూడా చేశారు. ఇలాంటి నేపథ్యంలో రాజ్యసభ సభ్యత్వాన్ని పొడిగించకపోతే.. సాయిరెడ్డి పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. రాజ్యసభ పదవి లేకుండా.. కేవలం పార్టీ పదవులతోనే సాయిరెడ్డి సంతృప్తి చెందుతారా? అన్న కోణంలో సొంత పార్టీ నేతలే సాయిరెడ్డి భవిష్యత్తుపై ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు
Must Read ;- ముహూర్తం ఫిక్స్.. ఉండేదెవరు?, ఊడేదెవరు?