ఈసారి జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ఒక పదం చాలా ఎక్కువగా వినిపించింది. అదే.. ‘‘షై ఓటర్లు’’. దీని అర్థం.. వీరు అభిమానించే పార్టీ గురించి బయటకు చెప్పుకోవటానికి సిగ్గు పడతారు. అదే సమయంలో.. తమ గుండెల్లో ఉన్న అభిమానాన్నిఓట్ల రూపంలో బ్యాలెట్ బ్యాక్సుల్లో నిక్షిప్తం చేస్తుంటారు. ఇలాంటి వారి తీరును ఎగ్జిట్ పోల్స్ మాత్రమే కాదు.. రాజకీయ పార్టీలు కూడా అంచనా వేయలేవు.ఈ కారణంతో ఊహించని రీతిలో ఫలితాలు వెలువడుతూ ఉంటాయి.
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా పలు ప్రాంతాల్లో ఈ షై ఓటర్ల కారణంగా అనూహ్య ఫలితాలు చోటు చేసుకున్నాయి. అంతేకాదు, వీరి పుణ్యమా అని.. రిపబ్లికన్లు, అదేనండి ట్రంప్‌కు మద్దతు ఇచ్చే వారి సంఖ్య ఇంతలా ఉంటుందా?అన్న ఆశ్చర్యం వ్యక్తమైంది. కరోనా కారణంగా ప్రభావితమైన ప్రాంతాలు, ప్రాణాలు ఎక్కువగా పోయినచోట్ల కూడా ఈ షై ఓటర్ల కారణంగా ట్రంప్ అధిక్యతలో ఉండటం డెమొక్రాట్లకు ఒక పట్టాన మింగుడు పడలేదు.
దాదాపు ఈ తరహా షై ఓటర్లు దుబ్బాక ఫలితాన్ని కూడా ప్రభావితం చేశారా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. బీజేపీ మీద ఉన్న అభిమానాన్ని గుండెల్లోనే ఉంచుకున్నారే తప్పించి బయటకు చెప్పేందుకు ఇష్ట పడలేదు. దీనికి కారణం తెలంగాణ అధికారపక్షంపై వ్యతిరేకతను మాటల్లో చూపిస్తే ఇబ్బందులు ఎదురవుతాయని. అదే సమయంలో.. తమ గుండెల్లో ఉన్న భావన ఎవరితోనైనా చెబితే, వారు అధికార పక్షానికి సానుకూలంగా ఉంటే తమకు ఇబ్బందులు ఎదురవుతాయన్న రీతిలో గుంభనంగా ఉండిపోయారని భావిస్తున్నారు.
ఇదే..టీఆర్ఎస్ కొంప మునిగేలా చేయటంతోపాటు పలు సర్వే సంస్థలు మొదలు మీడియా సంస్థలు సైతం దుబ్బాక ఫలితాన్ని అంచనా వేయటంలో తప్పటడుగులు పడేలా చేశాయంటున్నారు. ఇప్పటి వరకు ఈ షై ఓటర్ల ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా కనబడలేదు. దుబ్బాకలో మొదలై.. ఈ వరుస.. రానున్న రోజుల్లో మరింత కీలకం కానుందని చెప్పక తప్పదు. మిగిలిన పార్టీలతో పోలిస్తే బీజేపీ మీద ఉన్న అభిమానాన్ని బాహాటంగా చెప్పుకోవటానికి తెలుగు ప్రజలు అంతగా సిద్ధంగా లేరనే చెప్పాలి. దీనికి కారణం.. బీజేపీ అన్నంతనే హిందుత్వ.. నాన్ సెక్యులర్ అన్న భావ జాలంతో పాటు మరిన్ని అంశాలు ఉన్నాయి. అదే ఇప్పుడు తెలంగాణ అధికార పక్షానికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిందని చెప్పక తప్పదు.