అప్పు.. అప్పుడే విరోధం అంటారు. అది చేసేవారిని దృష్టిలో పెట్టుకొని అన్న మాట. కానీ సినిమా ఇండస్ట్రీలో కొందరు నిర్మాతలకు ఫైనాన్స్ చేస్తే .. వారితో విరోధం పెట్టుకున్నట్టే అని ‘షైలాక్’ మలయాళ సినిమా చెబుతుంది. అమెజాన్ప్రై మ్ లోనూ, ఆహాలోనూ అందుబాటులో ఉన్న ఈ సినిమా ఆకట్టుకుంటుంది.
కథేంటి?: బాస్ అనే ఒక ఫైనాన్సియర్ .. సినీ పరిశ్రమలోని బడా నిర్మాతలకు ఫైనాన్స్ చేస్తూ ఉంటాడు. కానీ తను ఇచ్చిన అప్పు.. అసలు, వడ్డీతో సహా తిరిగి ఇవ్వకపోతే.. వారి పాలిట షైలాక్ అవుతాడు. అయితే బాస్ కు , ఒక బడా ప్రొడ్యూసర్ అయిన ప్రతాప్ వర్మతో ఈ విషయంలో విరోధం వస్తుంది. పోలీస్ కమీషనర్ ఫెలిక్స్ జాన్ సహాయంతో బాస్ ను ఇబ్బందిపెట్టాలని శత విధాలా ప్రయత్నిస్తాడు. కానీ బాస్ తనకున్న తెలివితేటలతోనూ, పలుకుబడితోనూ అతడి కుట్రల్ని తిప్పి కొడుతూ ఉంటాడు. ఆ ప్రయత్నంలో ప్రతాప్ వర్మ కొడుకును దారుణంగా చంపిస్తాడు బాస్ . అతడు అలా చంపించడానికి ఏదో కారణం ఉండే ఉంటుందని అనుమానిస్తారు ప్రతాప్ వర్మ, కమీషనర్. అతడు ఖచ్చితంగా తమ పాత శత్రువై ఉంటాడని ఊహిస్తారు. దానికి తగ్గట్టుగానే బాస్ అనేవాడు ఎవరో వారికి తెలుస్తుంది. ఇంతకీ బాస్ ఎవరు? అతడికి ప్రతాప్ వర్మ అండ్ కో కి ఉన్న కనెక్షన్ ఏంటి అన్నదే మిగతా కథ.
ఎలా తీశారు?: రివెంజ్ యాక్షన్ డ్రామా అన్నది చాలా పాత జోనర్. గతంలో స్టార్ హీరోలందరూ ఈ ఫార్ములాతోనే హిట్స్ కొట్టారు. కానీ ఇప్పుడు అలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తున్నాయి. అయితే సరికొత్త పాయింట్ తో రివెంజ్ డ్రామాను పండిస్తే ఈ తరం ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించవచ్చని .. దర్శకుడు అజయ్ వాసుదేవ్ ‘షైలాక్’ సినిమాతో నిరూపించాడు. ఈ తరహా జోనర్ కు మమ్ముట్టిని కథానాయకుడిగా ఎంపికచేసుకోవడం బాగా కలిసొచ్చింది. అదే సమయంలో సినీ పరిశ్రమలో మాఫియా ఎలా ఉంటుంది? నిర్మాతలు ఫైనాన్సియర్స్ ను ఎలా వేధిస్తారు అన్న విషయాలు కళ్ళకు కట్టినట్టు చూపించాడు. బాస్ గా మమ్ముట్టి, ప్రతాప్ వర్మగా కళాభవన్ షాజాన్, కమీషనర్ గా సిద్ధిక్ , మరో ముఖ్యమైన పాత్రలో తమిళ నటుడు రాజ్ కిరణ్, అతడి భార్యగా మీనా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అయితే ఇందులో మమ్ముట్టికి హీరోయిన్ లేకపోవడం విశేషం.
హైలైట్స్ : ఇందులో మమ్ముట్టి నటనే హైలైట్. ఫైనాన్సియర్స్ ను ఇబ్బందిపెట్టే ప్రొడ్యూసర్స్ కు ఏక మొత్తంగా క్లాస్ పీకే సన్నివేశం ఆకట్టుకుంటుంది. అలాగే.. ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో వచ్చే రాజ్ కిరణ్ అండ్ ఫ్యామిలీ సీన్స్ ఎమోషనల్ గా కదిలిస్తాయి. అసలు బాస్ .. సినీ ప్రొడ్యూసర్ తో ఎందుకు విరోధం పెట్టుకున్నాడు అన్న దానికి సమాధానంగా ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ నిలుస్తుంది. అయితే ఇలాంటి సినిమాలు టాలీవుడ్ లో గతంలో ఎన్నో వచ్చాయి కాబట్టి.. తెలుగు జనానికి పర్వాలేదు అనిపిస్తుంది. ఈ తరహా రివెంజ్ యాక్షన్ మలయాళంలో అప్పుడప్పుడు వస్తుంటాయి. అందుకే అక్కడ సూపర్ హిట్టు గా నిలిచింది షైలాక్.
నటీనటులు : మమ్ముట్టి, కళాభవన్ షాజాన్, సిద్ధిక్, రాజ్ కిరణ్, మీనా, జాన్ విజయ్, బిబిన్ జార్జ్, హరీశ్ కనారన్, అర్జున్ నందకుమార్, రాఫీ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.
నిర్మాణం : జోబి జార్జ్
దర్శకత్వం : అజయ్ వాసుదేవ్
ఒక్కమాటలో : ఎగ్సయిటింగ్ రివెంజ్ డ్రామా
ఎక్కడ చూడాలి?: అమెజాన్ ప్రైమ్, ఆహా (తెలుగులో)
భాష : మలయాళం
రేటింగ్ : 3 /5
-ఆర్కే











