గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ పరిస్థితి నిజంగానే ఇప్పుడు పొయ్యిలో నుంచి పెనంపై పడినట్టైందని చెప్పాలి. పంజాబ్ లాంటి కీలక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపించిన తరుణంలో బాగానే ఉన్న కాంగ్రెస్ పరిస్థితిని స్వయంగా ఆ పార్టీనే నాశనం చేసిందన్న వాదనలూ వినిపిస్తున్నాయి. సీఎం కుర్చీలో కుదురుగా కూర్చుని ఎన్నికలకు సమర సన్నాహాలు చేస్తున్న పంజాబ్ తాజా మాజీ సీఎం, పార్టీ సీనియర్ నేత కెప్టెన్ అమరీందర్ సింగ్ ను సీఎం పదవి నుంచి పీకేసి ఏదో సాధిద్దామని భావించిన కాంగ్రెస్ పార్టీకి.. ఆ పార్టీ అధిష్ఠానం ఎంతగానో నమ్మిన పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ భారీ దెబ్బ కొట్టేశారు. అమరీందర్‌ను సీఎం కుర్చీ నుంచి దించేసేలా వ్యూహా రచించిన సిద్ధూ.. ఇప్పుడు తాను పీసీసీ పగ్గాలు వదిలేసి కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాకిచ్చారు. మొత్తంగా పార్టీకి ఏళ్ల తరబడి వీర విధేయుడిగా ఉన్న కెప్టెన్‌ను దూరం చేసేసిన సిద్ధూ.. తాను కూడా అండగా నిలవలేనని తేల్చేశారు. ఇలా వరుస విఫరిణామాలతో కాంగ్రెస్ పార్టీ షాక్‌లో కూరుకుపోయింది.
సీఎం కుర్చీకే గురిపెట్టి..
కెప్టెన్ అమరీందర్ సింగ్ ను సీఎం కుర్చీ నుంచి దించేసి ఆ స్థానంలో తాను కూర్చోవాలని సిద్ధూ భావించారు. పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు సమీపిస్తున్న తరుణాన్ని తనకు అనుకూలంగా మలచుకుని తన వ్యూహానికి పదును పెట్టారు. సిద్ధూలో ఏం చూసి కాంగ్రెస్ అధిష్ఠానం ఆయన మాటను నమ్మిందో గానీ.. ఓ వైపు కెప్టెన్ వద్దని చెబుతున్నా సిద్ధూకు పీసీసీ పీఠాన్ని కట్టబెట్టి కొత్త పేచీకి తెర తీసింది. పీసీసీ చీఫ్ గా పదవిని దక్కించుకున్న సిద్ధూ.. సీఎం పీఠాన్ని కూడా దక్కించుకోవాలని యత్నించారు. ఈ క్రమంలో తాను అమలు చేసిన వ్యూహానికి కెప్టెన్ అయితే పదవి నుంచి తప్పుకున్నారు. అయితే సిద్ధూను మాత్రం సీఎంగా అంగీకరించేది లేదని కెప్టెన్ తేల్చేశారు. ఈ నేపథ్యంలో గత్యంతరం లేని నేపథ్యంలో దళిత నేత, కెప్టెన్ కేబినెట్ లో మంత్రిగా ఉన్న చరణ్‌జిత్ సింగ్ చన్నీ సీఎం కుర్చీ ఆయాచితంగా దక్కించేసుకున్నారు. అయితే చన్నీ అభ్యర్థిత్వంపై మెజారిటీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా.. పరిస్థితిని ఎలా చక్కదిద్దాలో సిద్ధూకు తెలియలేదు. దీంతో పీసీసీ చీఫ్ పదవి నుంచి తాను తప్పుకుంటున్నట్లుగా సిద్ధూ కీలక నిర్ణయం తీసుకోక తప్పలేదు. వెరసి కెప్టెన్ ను సీఎం కుర్చీ నుంచి దించేసిన సిద్ధూ తాను మాత్రం పీసీసీ పీఠంపై కుదురుగా కూర్చోలేకపోయారు.
బీజేపీలోకి కెప్టెన్.. సిద్ధూ దారేమిటో..?
సిద్ధూ రేపిన మంటకు సీఎం కుర్చీని వదిలేసిన కెప్టెన్ అమరీందర్ సింగ్.. తాను కాంగ్రెస్ పార్టీని వీడబోనని ముందుగా ప్రకటించారు. అయితే ఏమైందో తెలియదు గానీ.. మంగళవారం నాడు ఆయన నేరుగా బీజేపీ కీలక నేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఆ వెంటనే తాను బీజేపీలోకి చేరిపోతున్నట్లుగా కెప్టెన్ సంచలన ప్రకటన చేశారు. ఈ పరిణామంతో కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా షాక్ తిన్నది. చూస్తుంటే.. అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్నది. ఇటు సీఎంగా కెప్టెన్ లేరు. అటు పార్టీని నడిపిస్తారని భావించిన సిద్ధూ పీసీసీ పదవిని వదిలేసి కూడా కాడి కింద పడేశారు. సీఎం కుర్చీలో ఇంకా కుదురుకోని చన్నీ కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో విజయతీరాలకు నడిపిస్తారన్న గ్యారెంటీ లేదు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలో దిక్కు తోచక కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం మల్లగుల్లాలు పడుతోంది. ఈ తరహా పరిస్థితికి కారకుడిగా నిలిచిన సిద్ధూ మాత్రం కెప్టెన్ ను ఔట్ చేసేసి తాను రిటైర్డ్ హర్ట్ గా మారిపోయి.. పార్టీని నట్టేట ముంచేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- అక్కడ రేవంత్ బాసూ.. చంద్రబాబు కాదు











