తమిళ హీరో శింబుకు ఇప్పుడు సింగర్ గానూ క్రేజ్ పెరిగింది. తెలుగులో పోటుగాడు, బాద్ షా సినిమాల్లో పాటలు పాడిన సంగతి తెలిసిందే. తెలుగు హీరోలు సైతం శింబు పాటను కోరుకుంటున్నారంటే మరి అతను ఎంత క్రేజ్ సంపాదించుకున్నాడో కదా. ఇటీవల రామ్ హీరోగా నటించిన వారియర్ సినిమాలో కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ది బులెట్ ఆన్ ది వే లో పాడుకుందాం డ్యూయట్ పాట జనంలోకి అలా బుల్లెట్ లా దూసుకుపోయింది. ముఖ్యంగా మాస్ ను ఆకట్టుకునేలా శింబు గళం ఉంది. అందుకే కొందరు హీరోలు శింబు పాట కావాలని పట్టుపడుతున్నట్టు తెలిసింది.
విషయానికి వస్తే నిన్ననే 18 పేజెస్ సినిమాలో ఓ పాట విడుదలైంది. ఈ పాటను కూడా శింబు పాడటం విశేషం. నేనీ పాటను పాడలేనని శింబు అంటే నువ్వు పాడకపోతే నేను ధర్నా చేస్తా అంటూ నిఖిల్ తమాషా చేయడం కూడా వైరల్ అయ్యింది. గోపీసుందర్ సంగీత దర్శకత్వంలో 18 పేజెస్ పాట విడుదలైంది. కార్తికేయ-2 సినిమా ఇచ్చిన సక్సెస్ తో నిఖిల్ మంచి ఊపు మీద ఉన్నాడు. ఇందులో కూడా నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్. బన్నీ వాసు నిర్మించే ఈ చిత్రానికి పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకుడు. ‘టైం ఇవ్వు పిల్ల’ అనే పల్లవితో సాగే ఈ పాటను సెల్ ఫోన్ పట్టుకుని డ్యాన్స్ చేసేలా చిత్రీకరించారు.
నిన్న విడుదలైన ఈ పాట కూడా వైరల్ అయ్యే అవుతోంది. మరో విశేషమేమిటంటే దళపతి విజయ్ కోసం శింబు పాడటం మరో విశేషం. దిల్ రాజు నిర్మాతగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వారసుడు చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. దీని తమిళ వెర్షన్ వారిసులోని రెండో పాటను ఇటీవల విడుదల చేశారు. ఈ సినిమా కోసం శింబు పాట పాడటమే కాదు విజయ్ తో కలిసి కాలు కూడా కదిపాడు. ఈ పాట తమిళ వెర్షన్ 4న విడుదలైంది. తెలుగు వెర్షన్ మాత్రం ఇంకా విడుదల కాలేదు. ఈ పాట పల్లవి కూడా ఇట్స్ టైమ్ అనేలానే ఉంది. మొత్తానికి శింబుకు గాయకుడిగానూ మంచి టైమ్ వచ్చినట్టే ఉంది.