చేపలు మామూలుగా మనకు మార్కెట్లో దొరికే ధరల సంగతి మర్చిపోండి. కొన్ని చేపలు చాలా ఎక్కువ ధర పలుకుతాయనే సంగతి మనకు తెలుసు. పులస చేప పేరెత్తగానే మత్స్య ప్రియులు అందరికీ నోరూరుతుంది. కొన్ని రోజుల కిందటే.. గోదావరి జిల్లాల్లో ఒక పులసచేప 31 వేల రూపాయలకు అమ్ముడుపోయి ఔరా అనిపించింది. పులసను తలుచుకుని నోట్లో నీళ్లు ఊరించుకోవాల్సిందే తప్ప.. మన తాహతుకు కొని తినలేం అని.. పులసప్రియులు నీరస పడిపోయారు కూడా. కానీ ప్రకాశం జిల్లాలో ఒక మత్స్యకారుడికి ఒక చేప దొరికింది.
ఆ చేప పేరు కచ్చిడి. కచ్చిలి చేప అని కూడా అంటారు. చేప బరువు ఓ మోస్తరుగానే ఉంది. అంటే ఆ ఒక్కచేపే 28 కిలోల బరువు తూగింది. నేను కొంటానంటే నేను కొంటా అంటూ లోకల్ గా చేపల వ్యాపారులంతా పోటీ పడ్డారు. మొత్తానికి బేరం తెగింది. 28 కిలోల ఆ కచ్చిడి చేప ఏకంగా 1.7 లక్షల రూపాయల ధర పలికింది.
పాపం.. ధర బాగా పడిపోయింది..
ఏమిటేమిటీ.. ఎంత 28 కిలోల బరువు ఉంటే మాత్రం.. ఒక చేప 1.7 లక్షల ధర పలికితే.. ధర పడిపోయింది పాపం.. అంటున్నారా.. మతి ఉండే మాట్లాడుతున్నారా.. ఈ రాతలు రాస్తున్నారా అని కోపం వస్తోంది కదా.. మీరు ఎంత కోపగించుకున్నా సరే.. చేప ధర మాత్రం బాగా పడిపోయినట్టే లెక్క.
నిరుడు జులైలో కాకినాడ తీరంలో ఒక మత్స్య కారుడికి ఇదే జాతికి చెందిన కచ్చిడి చేప వలకు దొరికింది. అది కూడా ఇలాగే.. ఇంచుమించుగా 30 కిలోల బరువుంది. దాన్ని అప్పట్లో కుంభాభిషేకం రేవులో వేలం వేశారు. ఏకంగా 2.05 లక్షల ధర పలికింది. అప్పట్లో కాకినాడ వ్యాపారే దాన్ని కొనుగోలు చేసి హౌరాకు తరలించారు. ఇప్పుడు ఈ ప్రకాశం జిల్లా కచ్చిడి చేపను కూడా.. స్థానికంగా ఉండే దారకొండ అనే వ్యాపారి కొన్నాడు. తను మాత్రం కోసుకు తినడు కదా.. ఏ హౌరాకో.. అంతకంటె పెద్దదైన ఇంకో చేపల మార్కెట్ కో తరలించేస్తాడు. అంతకంటె ఎక్కువ మొత్తానికే అమ్ముకుంటాడు.
ఇంతకీ కచ్చిడికి ఇంత రేటు ఎందుకు చెప్మా?
కచ్చిడి అంటే మామూలు చేప కాదు. పులస లాగా లొట్టలేసుకుంటూ.. పులుసు పెట్టి తినేసే చేప కాదు. ఇది చాలా ఔషధ విలువలున్న చేప. ఈ చేప పొట్ట భాగాన్ని మందుల తయారీలో వాడుతారు. ఆ మందులు కూడా చాలా ఖరీదైన మందులు.
పైగా ఈ కచ్చిడిలో ఆడ, మగ చేపలు వేర్వేరుగా ఉంటాయి. మగ చేపకు గిరాకీ చాలా ఎక్కువ. దీని పొట్టభాగాన్ని మందుల తయీరాలో వాడుతారట. ఈ చేప నుంచి సర్జరీ తర్వాత కుట్లు వేసే అరుదైన దారాలను కూడా తయారు చేస్తారట. అలాగే ఈ చేప భాగాలను ఖరీదైన వైన్ తయారీలో కూడా వినియోగిస్తారట.
అందుకే మరి ఇన్ని లాభాలు ఉన్నాయి గనుకనే.. 28 కిలోల చేప 1.7 లక్షలకు అమ్ముడుపోయినా .. గత సంవత్సరం పలికిన ధరకంటె బాగా రేటు పడిపోయిందని అంతా అనుకుంటున్నారు.











