టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ సత్తా చాటుతున్నారు. ఇటీవలి ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడం, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలో కొత్త సర్కారు కొలువుదీరడం, ఆ సర్కారు కేబినెట్ లో విద్యా శాఖతో పాటు ఐటీ శాఖల పర్యవేక్షణ బాధ్యతలు దక్కించుకున్న లోకేశ్ తన పనితీరుతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. ఏపీని ఐటీలో మేటిగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో పాటుగా రాష్ట్రాన్ని పారిశ్రామిక పరంగా పురోభివృద్ధి బాటలో నడపాలన్న కసితో సాగుతున్న లోకేశ్ తనకు అందివచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. అందులో భాగంగా ఉక్కు తయారీతో ప్రపంచంలోనే అగ్రశ్రేణి కంపెనీగా రాణిస్తున్న ఓ సంస్థ… ఏపీ, ఒడిశాల పరిధిలో భారీ కర్మాగారం ఏర్పాటు చేసే దిశగా సర్వే చేస్తోందన్న విషయం తన చెవిన పడినంతనే… సదరు కంపెనీ సీఈఓతో నేరుగా జూమ్ లో సమావేశమయ్యారు. ఈ భేటిలో లోకేశ్ ఇచ్చిన ప్రజెంటేషన్ కు ముగ్ధుడైన సదరు కంపెనీ సీఈఓ… రూ.1.40 లక్షల కోట్లతో ప్రారంభించనున్న ఉక్కు తయారీ కర్మాగారాన్ని ఏపీలో ఏర్పాటు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఇలా కేవలం సింగిల్ జూమ్ కాల్ తో లోకేశ్ రాష్ట్రానికి రప్పించిన ఆ పెట్టుబడి, కంపెనీ వివరాల్లోకి వెళ్లిపోదాం పదండి. ప్రపంచంలోనే ఉక్కు తయారీలో ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ కంపెనీ అగ్ర శ్రేణి కంపెనీగా కొనసాగుతున్న సంగతి తెలిసింది. ప్రవాస భారతీయుడు లక్ష్మీ మిట్టల్ కుటుంబానికి చెందిన ఈ కంపెనీ… మొన్నటిదాకా ఇంగ్లండ్ వేదికగా కార్యకలాపాలు సాగించింది. తాజాగా ఇటీవలి కాలంలో తన స్వదేశంలోనూ తన కంపెనీ కార్యకలాపాలను విస్తరించాలని మిట్టల్ భావించారు. అందులో భాగంగా ఉక్కు తయారీలో మరో అగ్రశ్రేణి కంపెనీగా రాణిస్తున్న జపాన్ కంపెనీ నిప్పన్ స్టీల్ తో కలిసి ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా పేరిట ఓ జాయింట్ వెంచర్ ను ఏర్పాటు చేశారు. దీనికి మిట్టల్ కుటుంబానికి చెందిన ఆదిత్య మిట్టల్ సీఈఓగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే భారత్ తో తన కార్యకలాపాలు మొదలుపెట్టేసిన ఈ కంపెనీ… ఇనుప ఖనిజ గనులను పెద్ద ఎత్తున లీజులో దక్కించుకుంది. ఇక సదరు గనులకు సరిపడ రీతిలో ఓ భారీ ఉక్కు తయారీ కేంద్రం ఏర్పాటుకు ఆదిత్య మిట్టల్ రంగంలోకి దిగారు. ఏపీలోని అనకాపల్లి, ఒడిశాలోని కొన్ని ప్రాంతాల్లో తన ఫ్యాక్టరీ ఏర్పాటు దిశగా ఆయన పరిశీలన చేస్తున్నారు.
ఈ విషయం తెలుసుకున్న లోకేశ్… నేరుగా ఆదిత్య మిట్టల్ తో జూమ్ లో సమావేశమయ్యారు. భారీ పెట్టుబడులతో రాష్ట్రానికి వచ్చే కంపెనీలకు తమ ప్రభుత్వం నుంచి అందే సహాయసహకారాలను ఈ సందర్భంగా లోకేశ్ ఆయనకు వివరించారు. లోకేశ్ ప్రజెంటేషన్ విన్నంతనే… తమ నూతన ఉక్కు తయారీ కేంద్రాన్ని అనకాపల్లి పరిధిలోని నక్కపల్లిలో ఏర్పాటు చేసేందుకు ఆయన సుముఖత వ్యక్తం చేశారు. రెండు దశలుగా ఏర్పాటు కానున్న ఈ పరిశ్రమ కోసం ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ కంపెనీ ఏకంగా రూ.1.40 లక్షల కోట్లను పెట్టుబడిగా పెట్టనుంది. అంతేకాకుండా ఈ భారీ కర్మాగారంతో అనకాపల్లి పరిధిలోని యువతకు వేలసంఖ్యలో ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. అదే సమయంలో విశాఖ ఉక్కుతో విశాఖపట్నం నగరం ఎలాగైతే సువిశాల నగరంగా రూపుదిద్దుకుందో…ఈ కంపెనీ ఏర్పాటు చేసే కర్మాగారంతో అనకాపల్లి కూడా మరో విశాఖ సిటీగా రూపుదిద్దుకోనుంది.
ఇక లోకేశ్, ఆదిత్య మిట్టల్ ల మధ్య జరిగిన సంభాషణ మేరకు వివవరాలు ఇలా ఉన్నాయి. నక్కపల్లిలో ఫార్మా సిటీ కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 1,800 ఎకరాలను సేకరించింది. అయితే మిట్టల్ కంపెనీ కోసం 2.600 ఎకరాలు అవసరం కానున్నాయి. ఇప్పటికే సేకరించిన1,800 ఎకరాలకు మరింత మేర భూమిని సేకరించి ఇస్తే సరిపోతుందని మిట్టల్ తెలిపారు. ఇక తొలి దశలో ఏర్పాటు చేయనున్న కర్మాగారంలో ఏడాదికి 7.3 మిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేయనున్నారు. ఇందుకోసం మిట్టల్ కంపెనీ ఏకంగా రూ.80 వేల కోట్లను వెచ్చించనుంది. ఇక ఆ తర్వాత ఈ కర్మాగారం ఉత్పత్తి సామర్థ్యాన్ని రెండో దశలో ఏకబిగిన 17.8 మిలియన్ టన్నులకు పెంచనున్నారు. దీని కోసం మిట్టల్ కంపెనీ రూ.60 వేల కోట్లను వెచ్చించనుంది. ఈ కంపెనీ రాకతో ఏపీ రూపురేఖలే మారిపోతాయని, ఇంతటి భారీ పెట్టుబడిని లోకేశ్ కేవలం ఒకే ఒక్క జూమ్ కాల్ తో సాధించడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.