న్యాయవ్యవస్థపై బురద చల్లాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విధాన నిర్ణయం తీసుకున్నట్లుగా వాతావరణం కనిపిస్తోంది. న్యాయవ్యవస్థపై ప్రజల్లో ఉండే నమ్మకాన్ని పూర్తిగా తొక్కేయాలనేది వారి కోరిక.
న్యాయ స్థానాలు తమ ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఎలాంటి తీర్పులు వెలువరించినా.. ప్రజలు ఆ తీర్పులనే అసహ్యించుకోవాలి తప్ప.. తమ ప్రభుత్వానికి నష్టం రాకూడదనేది వారి ఉద్దేశం. కానీ అందుకు వారు అనుసరిస్తున్న మార్గం- చంద్రబాబును బూచిగా చూపించడం. చంద్రబాబునాయుడును ఒక పెద్ద విలన్ గా ప్రజల ఎదుట ఆవిష్కరించి.. ఆ విలన్ తో అనుచిత సంబంధాలు ఉన్నట్టుగా న్యాయవ్యవస్థపై బురద చల్లేస్తే తాము ఆశించిన ప్రయోజనం నెరవేరిపోతుందని వారు అనుకుంటున్నారు. కానీ కొన్ని అసత్యాలను ప్రచారంలో పెట్టినంత మాత్రాన, వారు తొక్కిపెట్టిన ఇతర సత్యాలు బయటకు రాకుండా ఉండవు. వారు అభాసుపాలు కాక తప్పదు.
ఇప్పుడు అదే జరుగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయాల్లో లోపాలు ఉన్నాయని కోర్టులు చెబుతున్నప్పుడు.. చంద్రబాబునాయుడుకు మేలు చేయడానికే అలా చెబుతున్నారని ప్రచారం చేయడం జరుగుతోంది. చంద్రబాబునాయుడు న్యాయవ్యవస్థను మేనేజ్ చేస్తున్నాడనేది వారి వాదన. ఆయన మేనేజ్ చేస్తే- వీరు ఎందుకు మేనేజ్ అవుతారు? ఈ ప్రశ్న ప్రజలనుంచి వస్తుంది గనుక.. ఆయన జడ్జిలు అందరికీ ఇంటి స్థలాలు ఇచ్చేశారు గనుక.. వాళ్లంతా ఆయనకు అనుకూలంగా పనిచేస్తున్నారనేది వైసీపీ వర్గాల ద్వారా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం.
అమరావతిలో నివాసాలు రావడానికి వీలుగా కొన్ని ఇంటి స్థలాలు విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా. జడ్జిలు, ఐఏఎస్/ఐపీఎస్ అధికార్లు, ఉద్యోగులు, జర్నలిస్టులు ఇలా కొందరికి స్థలాలు అమ్మారు. కేవలం న్యాయమూర్తులకు మాత్రం ఇచ్చినట్టుగా ప్రచారం జరిగింది. న్యాయమూర్తులు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉపకారం పొందకూడదంటూ.. పార్టీ సోషల్ మీడియా గ్రూపుల్లో నీతులు కూడా వల్లించారు.
వైఎస్సార్ కూడా చేసింది అదే..
కానీ నిజానికి ప్రభుత్వాలు ఇలా ఇంటిస్థలాలు విక్రయించడం కొత్త కాదు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా.. 2005లోనే హైదరాబాదులో న్యాయమూర్తులకు ఇంటిస్థలాలు కేటాయించారు. 2005 ఫిబ్రవరి 28న జీవో నెం. 243ను ఇందుకోసం విడుదల చేశారు. సుప్రీంకోర్టు జడ్జిలు, హైకోర్టు జడ్జిలు.. అధికార్లు ఇలా అందరికీ స్థలాలు అమ్మడానికి నిర్ణయం తీసుకున్నారు. జడ్జిలకు 500 గజాల వంతున ఇవ్వాలని నిర్ణయించారు. అందుకు హైదరాబాదులో అప్పటికే అత్యంత కాస్ట్ లీ రియల్ ఎస్టేట్ ఏరియాగా గుర్తింపు పొందిన నానక్ రాం గూడలో కేవలం న్యాయమూర్తుల కోసం ఏకంగా 38 ఎకరాలను వైఎస్ రాజశేఖర రెడ్డి కేటాయించారు. అది కూడా విక్రయమే కానుక కాదు. తప్పు కూడా కాదు. అందుకే.. ఎవ్వరూ దాని గురించి వివాదం రేపలేదు.
ఇవాళ చంద్రబాబునాయుడు విక్రయించిన ఈ నిర్ణయం గురించి, జడ్జిలను ప్రలోభపెట్టినట్టుగా ప్రచారం చేస్తున్న వైసీపీ వర్గాలు- అప్పటి వైఎస్సార్ నిర్ణయం గురించి ఏం చెప్తారు? ఆయన కూడా జడ్జిలను మచ్చిక చేసుకోడానికే ప్రలోభాలుగానే ఆ స్థలాలు ఇచ్చారంటారా? ఇంత అర్థరహితంగా ఎందుకు వ్యాఖ్యలు చేస్తున్నారు? అనేది ప్రశ్న.
లోపాలు చెప్పడం తప్పు కాదు.. చంద్రబాబు ప్రభుత్వంలో లోపాలు జరిగిఉంటే తప్పకుండా చెప్పాల్సిందే. రాజకీయంగా అది వారి మనుగడకు అవసరం కూడా. అంతే తప్ప.. జరిగిన ప్రతి వ్యవహారాన్నీ లోపంగానే రంగు పులిమి ప్రచారం చేయడం కరెక్టు కాదు.
ఈ దుష్ప్రచారం లాభిస్తుందా?
వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రజలకు ఒక హామీ ఇస్తుంది.. దాని ఆచరణకు జీవో తెస్తుంది.. అందులో చట్టబద్ధత లేనప్పుడు అది కోర్టులకు చేరి తాత్కాలికంగా ఆగిపోతుంది- ఇలా జరిగిన ప్రతి సందర్భంలో.. తాము తెచ్చిన జీవోలోని లోపాల వల్ల ఆగిపోయిన సంగతి ప్రజలు గుర్తించకుండా.. చంద్రబాబును ద్వేషించేలా వారి దృష్టి మరల్చడానికే వైసీపీ ఇలాంటి వాదనకు దిగుతున్నట్టు కనిపిస్తోంది.
చంద్రబాబును ప్రజల నమ్మకుండా చేయడం వారికి రాజకీయ అవసరం. ఆ యావలో- తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవ్వరు మాట్లాడినా వారందరూ చంద్రబాబు కోటరీ వ్యక్తులే అని ముద్ర వేసేయడం వారు అనుసరిస్తున్న పద్ధతి. ఈ అనైతిక పోకడ.. పార్టీ కార్యకర్తలు, అభిమానులకు బాగానే రుచిస్తుంది. వారందరూ విచక్షణను కాసేపు పక్కన పెట్టి, ఇలాంటి ప్రచారాల్ని ఎడాపెడా లక్షల మందిలోకి చాలా చురుగ్గా వ్యాప్తి చేస్తారు. బురద చల్లిన సంతృప్తిని పొందుతారు.
కానీ, ప్రజాస్వామ్యం అంటే కేవలం పార్టీల కార్యకర్తలు మాత్రమే కాదు. కేవలం కార్యకర్తలు, అభిమానులే గెలిపించగలిగే దామాషాలో ఓటర్లలో ఉంటే గనుక.. అలాంటి చోట ప్రజాస్వామ్యానికి అర్థం లేదు. అవసరం కూడా లేదు. ఎన్నిసార్లు ఎన్నికలు జరిగినా ఒకడే గెలుస్తుంటాడు. నియంతృత్వమే నడుస్తుంటుంది. ఆ దామాషాలో ఈ రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ అభిమానులు ఉంటే.. జగన్మోహన్ రెడ్డి.. ఆయన కోరుకుంటున్నట్టు ముప్పయ్యేళ్లు కాదు కదా.. ఆజన్మాంతమూ, ఆచంద్ర తారార్కమూ తానే సీఎంగా ఉండగలరు.
కానీ.. ప్రజాస్వామ్యంలో పాలకులు ఎవరనేది కార్యకర్తలు, ఫ్యాన్స్ కాదు- తటస్థులు నిర్ణయిస్తుంటారు. వారు చంద్రబాబు అనుభవం వైపు మొగ్గినందుకు 2014లో ఆయన ప్రభుత్వం ఏర్పడింది. జగన్ ఉత్సాహం వైపు మొగ్గినందుకు 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడింది. అలాంటి వర్గంలో- నైతికత హద్దులు మీరుతున్న ఇలాంటి ప్రచారం అసహ్యం, ఏవగింపు పుట్టిస్తే గనుక.. అది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే నష్టం చేస్తుంది.
.. సురేష్ పిళ్లె