అది చాలా చిన్న దేశం.జనాభా ఒక మిలియన్ కూడా ఉండదు. పోనీ ఆ దేశం నియంతల పాలనలో ఉందా అంటే..అదేం కాదు. రాచరిజం,ప్రజాస్వామ్యం రెండూ మిళితమైన దేశం.కాని ఆ దేశంలో కొవిడ్ వల్ల చనిపోయింది ఒకే ఒక్కరు.కొవిడ్ కేసులు కూడా 2వేల లోపే ఉన్నాయి.ఆ దేశం విదేశాల సాయంతో దేశ జనాభాలోని 95శాతం మందికి రెండో దశ వ్యాక్సిన్ కూడా పూర్తి చేసింది.ప్రపంచ దేశాల ప్రశంసలు అందుకుంటోంది.ఆ దేశమే భూటాన్.భారత్‌కి సరిహద్దుదేశమైన భూటాన్‌లో స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ఎంత ఎక్కువగా ఉంటాయో నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు కూడా అలాగే ఉంటాయి. ఆ దేశ కట్టుబాట్లకు అంతా తలొగ్గాల్సిందే.ప్రస్తుతం భూటాన్‌లో కొవిడ్ కేసులు జీరో స్థాయికి వచ్చేశాయని చెప్పవచ్చు.
నాంగ్యాల్ వాంగ్‌ఛుక్ రాచరిక పాలనలో..
జిగ్మే ఖేసార్ నాంగ్యాల్ వాంగ్‌ఛుక్ రాచరిక పాలనలో భూటాన్ ప్రధానిగా లొతాయ్ త్సెరింగ్ ఉన్నారు.ఆయన స్వయంగా వైద్యుడు,పరిశోధకుడు. ఆయన సారథ్యంలోని కొవిడ్ నియంత్రణ కమిటీ తీసుకున్న చర్యల వల్ల దేశంలో ఒకే ఒక కరోనా మరణం నమోదైంది. దేశ జనాభా 7.7లక్షలు కాగా 95శాతం మందికి వ్యాక్సినేషన్ రెండో ప్రక్రియ కూడా మొదలైంది. ప్రపంచబ్యాంకు ద్వారా 5మిలియన్ డాలర్ల ప్రత్యేక సాయం పొందిన భూటాన్‌కి భారత్ ఉచిత వ్యాక్సిన్లు సరఫరా చేసింది. ఆస్ట్రాజెనెకా టీకాలను పంపించింది.మరో వారం రోజుల్లో నూరుశాతం వ్యాక్సినేషన్ దేశంగా రికార్డు సాధించనుండడంతో పలు దేశాలు భూటాన్‌ను అభినందిస్తున్నాయి.
మోదీకి భూటాన్ ప్రధాని ఫోన్..
భారత్ ప్రధాని మోదీతో భూటాన్ ప్రధాని రెండు రోజుల క్రితం ఫోన్లో మాట్లాడుతూ భారత్ ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితిలో తాము సంఘీభావం ప్రకటిస్తున్నామన్నారు.తమకు సాధ్యమైనంత సాయం చేస్తామని,తాము కష్టకాలంలో ఉన్న సమయంలో భారత్ పెద్ద మనసుతో వ్యవహరించిందని వ్యాఖ్యానించారు.అదే సమయంలో భూటాన్‌లో వ్యాక్సినేషన్ ప్రక్రియ విషయంలో భారత ప్రధాని మోదీ..భూటాన్ దేశ విధానాలను అభినందించారు.అమెరికా ఇప్పటికే భూటాన్‌ను ప్రశంసించింది.
పోల్చలేం..కాని ఆదర్శవంతంగా..
మన దేశంతో ఏ కోణంలోనూ భూటాన్ పోల్చే పరిస్థితి లేదు. సంప్రదాయాలు, పద్ధతులు, ఆహారపు అలవాట్లు, కట్టుబాట్లు, హక్కులు-స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు, చట్టాల అమలు,పాలనాపరమైన వ్యవస్థలు, భౌగోళిక పరిస్థితులు, జనాభా, దేశ జీవన విధానం..ఇలా ఏ కోణంలోనూ భూటాన్‌తో పోల్చలేం. అయితే కొవిడ్ నియంత్రణ విషయంలో భూటాన్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఆదర్శవంతంగా తీసుకోవాలని ఇప్పటికే అంతర్జాతీయ మీడియా వ్యాఖ్యానించింది.సీఎన్ ఎన్, ఫాక్స్ న్యూస్, న్యూయార్క్ టైమ్స్,ది గార్డియన్ లాంటి అంతర్జాతీయ మీడియా భూటాన్ ప్రభుత్వం అమలు చేసిన విధానాలను ప్రశంసించింది.ఇక భారత్ జనాభా 2020 అంచనా ప్రకారం 138కోట్లు కాగా భూటాన్ జనాభా 7.78లక్షలు.భారత్‌లో చిన్న రాష్ట్రమైన సిక్కింతో పోల్చితే సిక్కిం జనాభా 6,62,810 కాగా భూటాన్ జనాభా 7,78,847. సిక్కింలో 10,165 కేసులు కాగా భూటాన్‌లో 1247కేసులు వచ్చాయి.సిక్కింలో కొవిడ్‌తో 177మంది చనిపోగా భూటాన్‌లో ఒక్కరు మాత్రమే చనిపోయారు.ఇక టెస్ట్‌ల విషయానికి వస్తే సిక్కింలో 1,01,002 టెస్టులు చేయగా భూటాన్‌లో 7,31,572 టెస్టులు చేశారు.దేశంలో మొత్తం మీద 47వేల టెస్టులు చేస్తే జనాభాతో సరిసమానంగా టెస్టులు చేసిన దేశంగా రికార్డు నెలకొల్పుతోంది. సిక్కింతోనే కాదు.. భారత్‌లోని ఏ రాష్ట్రంతోనూ పోల్చలేం. కాని కొవిడ్ అరికట్టే విషయంలో అమలైన విధానాలను ఆదర్శవంతంగా తీసుకోవచ్చనే చర్చ మొదలైంది.

కొవిడ్‌పై పోరు ఇలా..
భూటాన్‌లో కొవిడ్ నియంత్రణకు ముందస్తు చర్యలు గత ఏడాది ఫిబ్రవరిలో మొదలయ్యాయి.కఠినమైన నిబంధనలు అమలయ్యాయి.మొదటి కేసు కేసు 5మార్చి 2020లో నమోదైంది.వెంటనే దేశమంతా అలెర్ట్ అయింది.అంతర్జాతీయ సరిహద్దుల మూసివేశారు.దేశంలో అంతర్గతంగా రాకపోకలపై కఠినమైన ఆంక్షలు పెట్టారు.కొవిడ్ పాజిటీవ్ వచ్చిన వారికి సంబంధించి ప్రైమరీ కాంటాక్ట్‌ల వివరాలు 24 గంటల్లో సేకరించడంతోపాటు టెస్టింగ్లూ పూర్తయ్యాయి.ఒక్కో కొవిడ్ పాజిటీవ్ పేషెంట్‌కి సంబంధించి సగటున 48 మందిని టెస్ట్ చేయడం,క్వారంటైన్‌గా 21 రోజులపాటు ప్రభుత్వం ఉచితంగా ఏర్పాటు చేసిన వనర ఐసోలేషన్ కేంద్రంలో ఉంచారు.అన్నిటి కంటే ముఖ్యంగా గత 15నెలల్లో భూటాన్ రాజు నిద్రపోయే సమయంలో తప్ప రాజభవనంలో ఉన్న సందర్భాలు చాలా తక్కువ.సగం రోజులపాటు ప్రత్యక్షంగా కొవిడ్ ఫ్రంట్ లైన్ వారియర్స్, సైన్యంతోనే గడిపారు.ఆయనే స్వయంగా రోజూవారీ క్షేత్రస్థాయి పరిశీలన,ఆకస్మిక తనిఖీలు చేపట్టేవారు.ప్రతి వెయ్యి మందికి ఒక టీం ఏర్పాటు చేసి కేసుల పరిశీలన,రాకపోకల వివరాలు తెప్పించుకునేలా ప్రధాని ఓ కమిటీని ఏర్పాటు చేశారు. కఠిన మైన ఆంక్షలతో పాటు హెర్డ్ ఇమ్యూనిటీ,రోగనిరోధక శక్తి పెంపొందించే విధంగా స్పష్టమైన మార్గదర్శకాలు జారీ అయ్యాయి.ఆహారం విషయంలో మార్గదర్శకాలు జారీ చేశారు. ఇటీవలే వ్యాక్సినేషన్ ప్ర్రక్రియ మొదలు పెట్టారు.9రోజుల్లో 95శాతం రెండోడోసు వ్యాక్సినేషన్ కూడా పూర్తి చేశారు.
రవాణాపై ఆంక్షలు..
వస్తువులు, నిత్యావసరాల రవాణాపై నిఘా ఉంచడంతోపాటు దేశ ప్రజల రాకపోకలపై ఆంక్షలు అమలయ్యాయి.ప్రతి 7కిలోమీటర్లకు ఒక చెక్ పాయింట్ పెట్టారు.ప్రతి 15కిలోమీటర్ల పరిధిలో ఒక టెస్టింగ్ కేంద్రం (ప్రయాణీకులకు సంబంధించి) ఏర్పాటైంది.ప్రాథమిక టెస్ట్‌లు పూర్తయ్యాకే ప్రయాణానికి అనుమతించేవారు.పాజిటీవ్ తేలితే ప్రభుత్వం సాయంతో క్వారంటైన్లో ఉండాల్సిందేనన్న నిబంధన అమలైంది. అంతేకాదు.. ప్రయాణికులు,పోలీసులు,రవాణా వాహనాల వారు, వ్యాపారులు, వైద్యులు, వైద్య సిబ్బంది, పాలన విభాగాల్లో పనిచేస్తున్నవారు,నిత్యం ప్రజలతో కలవాల్సిన పనుల్లో ఉన్నవారు కచ్చితంగా ప్రతి 15రోజులకోసారి టెస్ట్‌లు చేయించుకోవాలనే నిబంధన కూడా అమలవుతోంది.











