(విజయవాడ నుంచి లియోన్యూస్ ప్రతినిధి)
సామాన్యులు రిజర్వు ఫారెస్టులో అడుగు పెట్టాలంటేనే భయం. కానీ కృష్ణా జిల్లాలో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు.
విజయవాడ సమీపంలోని కొండపల్లి రిజర్వు ఫారెస్టులో రాత్రికి రాత్రి వందలాది లారీల మట్టి అక్రమంగా తరలిస్తున్నారు. ఇదంతా అధికారులకు తెలియకుండానే జరుగుతుందా? కొండపల్లి సమీపంలోనే గనులశాఖ, అటవీ శాఖ, రెవెన్యూ శాఖ అధికారుల కార్యాలయాలు ఉన్నాయి. వారికి తెలియకుండా ప్రతి రోజూ 200 టిప్పర్ల మట్టి తరలించడం సాధ్యం అవుతుందా? నిత్యం వందలాది లారీలు తిరుగుతున్నాయి. రాత్రి సమయాల్లో వాటికారణంగా అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. రిజర్వు ఫారెస్టు నుంచి ఏం జరుగుతుందో వారికి తెలియకపోయినప్పటికీ.. ప్రమాదాల గురించి స్థానిక ప్రజలు ఆందోళనకు దిగుతున్నారు గానీ.. పట్టించుకునేదెవరు?
మూడు శాఖల ముష్ఠి యుద్ధం- అక్రమార్కులకు వరం!
గనుల శాఖ, రెవెన్యూ, అటవీ శాఖాధికారులు తమ పరిధి కాదంటే తమకు సంబంధం లేదంటూ చాలా కాలం ఒకరిపై ఒకరు నిందలు వేసుకున్నారు. అక్రమ తవ్వకాలు జరిపే ప్రాంతంతో మాకు సంబంధం లేదని ఆ మూడు శాఖల స్ధానిక అధికారులు చేతులెత్తేశారు. దీంతో అక్రమార్కులు రెచ్చిపోయారు. దీంతో కొండపల్లి ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకోవడంతో జనం రోడ్డెక్కారు. అక్రమార్కులపై మీడియాలో కథనాలు వరుసగా రావడంతో ఉన్నత స్థాయి అధికారులకు విషయం చేరింది. దీంతో అక్రమ తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాలను మూడు శాఖల ఉన్నత అధికారులు పరిశీలించారు. చివరకు ఆ భూమి రిజర్వు ఫారెస్ట్ అని తేల్చారు. దీంతో అక్రమ తవ్వకాలకు బ్రేక్ పడింది. మరి అంతకాలమూ ఇన్ని శాఖల అధికారులు ఎలా కళ్లు మూసుకుని ఉపేక్షించారన్నదే పెద్ద ప్రశ్న.
మట్టికి డిమాండ్ పెరగడంతో దందా షురూ!
అవును. విజయవాడ పరిసరాల్లో ఎవరు నిర్మాణం చేయాలన్నా మూడు, నాలుగు అడుగుల మట్టి వేయాల్సి ఉంటుంది. దీంతో ఆ ప్రాంతంలో మట్టికి ఎక్కడ లేని గిరాకీ ఏర్పడింది. ప్రజల అవసరాలను అక్రమార్కులు అనుకూలంగా మలచుకున్నారు. ఒక్కో లారీ మట్టి దూరాన్ని బట్టి రూ.10 వేల నుంచి 20 వేలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. వీరికి నాయకుల అండదండలు కూడా ఉన్నాయని, లేకపోతే ఇంత సాహసానికి తెగించరని ప్రజలు అనుకుంటున్నారు.
నున్నలో రూ.20 కోట్ల విలువైన మట్టి తరలింపు
విజయవాడ రూరల్ నున్నలో వరి పొలాల్లో ఓ భారీ వెంచర్ వేసిన ప్రయివేటు సంస్థ, ఆ వెంచర్‌ను పోలవరం కాలువ మట్టితో నింపే పనులు చేపట్టారు. పోలవరం కాలువ తవ్వకంలో వచ్చిన మట్టి తరలించేందుకు అనుమతులు కూడా తీసుకున్నారు. అయితే ఇక్కడ ప్రతి రోజూ 400 లారీల మట్టి తరలిస్తూ ప్రభుత్వ లెక్కల్లో మాత్రం 50 లారీల మట్టి తరలిస్తున్నట్టు బిల్లులు తయారు చేశారు. దీంతో మీడియా మరోసారి రంగంలోకి దిగింది. నున్నలో అక్రమ మట్టి తరలింపుపై సాక్ష్యాలతో సహా మీడియాలో రావడంతో అక్రమార్కుల ఆటకు అడ్డుకట్టపడింది. గనుల శాఖ అధికారుల ఆదేశాలతో మట్టి తరలింపునకు బ్రేక్ పడింది.
అధికారులకు తెలియకుండా మట్టి తరలింపు సాధ్యమా?
అక్రమంగా మట్టి తరలించే వారిలో ఎక్కువగా అధికార పార్టీ నేతలే ఉన్నారనే ప్రచారం ఉంది. ముందుగానే స్థానిక అధికారులకు విషయం తెలియజేయడంతో వారు మిన్నకుంటున్నారు. మట్టి తరలించే ముందే మండల స్థాయి అధికారులు, గ్రామ స్థాయి రెవెన్యూ సిబ్బందిని అక్రమార్కులు మేనేజ్ చేస్తున్నారు. దీంతో వారి పని సులువవుతోంది.
ఇక వందలాది టిప్పర్లను, పొక్లెయిన్లను రంగంలోకి దింపి ఒక ఆపరేషన్ మాదిరిగా వారంలోనే 10000 లారీల మట్టి తరలిస్తున్నారు. ఇక అప్పటికే ఆయా గ్రామాల్లో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోవడంతో స్థానికులు మీడియాకు, ఉన్నత అధికారులకు సమాచారం ఇస్తున్నారు. ఆ తరవాత మీడియాలో వరుసగా కథనాలు రావడంతో ఉన్నత అధికారులు రంగంలోకి దిగుతున్నారు. ఈలోగా అక్రమార్కులు సాంతం సర్దుకుంటున్నారు.
అనుమతులు తీసుకుని మరీ దోపిడీ
మట్టి తవ్వకం చేసే వారిలో కొందరికి అనుమతులు కూడా ఉన్నాయి. మరి ఇంకేటి సమస్య అని అనుమానం రావచ్చు. వారు తీసుకునే అనుమతి గోరంత అయితే తవ్వేది మాత్రం కొండంత. అసలు సమస్య ఇక్కడే. రోజుకు 200 టన్నుల మట్టి తవ్వకాలకు అనుమతి తీసుకుని 5000 టన్నుల మట్టి తరలిస్తున్నారు. వీరితో కొందరు అధికారులు కూడా చేతులు కలపడంతో వందల కోట్ల విలువైన మట్టి అక్రమంగా తరలిపోతోంది. ఈ వ్యవహరం ఇంతటితో ముగుస్తుందని భావిచడం కూడా భ్రమే ఎందుకంటే ఇది మొదటిది కూడా కాదు. గతంలో ఇలాంటి అక్రమ తవ్వకాలు చాలా జరిగాయి. ప్రస్తుతం జరుేగుతున్నాయి. భవిష్యత్‌లోనూ జరుగుతాయి. నేతలు, అధికారులు చేతులు కలిపితే ఇక వారిని అడ్డుకునేది ఎవరు..?











