Social Mediaనారా, నందమూరి కుటుంబాల మూడో తరం వారసుడు, IT మంత్రి నారా లోకేష్ – బ్రాహ్మణిల కుమారుడు నారా దేవాన్ష్ డిజిటల్ మీడియా ప్రపంచంలోకి అడుగుపెడుతున్నాడు. సాధారణంగా రాజకీయ కుటుంబాల వారసులు చాలా లేట్‌గా లైమ్‌లైట్‌లోకి వస్తుంటారు. కానీ, దేవాన్ష్ కేవలం 8 ఏళ్ల వయసులోనే సరికొత్త రికార్డు సృష్టించబోతున్నాడు. తనకంటూ సొంత పాడ్‌కాస్ట్‌ను ప్రారంభించి టాక్ షో హోస్ట్‌గా మారబోతున్నాడు. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ సహా కుటుంబసభ్యులంతా సోషల్ మీడియా వేదికగా పంచుకోవడంతో నెట్టింట భారీ హైప్ క్రియేట్ అయింది.
ఈ పాడ్‌కాస్ట్ అనౌన్స్‌మెంట్ చేస్తూ నారా లోకేష్ తన ఎక్స్ ఖాతాలో పెట్టిన పోస్ట్ ఎంతో సరదాగా, ఆసక్తికరంగా సాగింది. ఇల్లంతా అకస్మాత్తుగా డైనోసార్లతో నిండిపోయింది..ఎక్కడ చూసినా డైనోసార్ పుస్తకాలు, డైనోసార్ పెయింటింగ్‌లు, బొమ్మలే కనిపిస్తున్నాయి. అసలు ఇంట్లో ఏం జరుగుతుందో అర్థం కాక నేను ఆశ్చర్యపోయాను. అప్పుడు దేవాన్ష్ అసలు రహస్యాన్ని బయటపెట్టాడు అంటూ లోకేష్ రాసుకొచ్చారు. తన కుమారుడు డైనోసార్లపై ప్రత్యేకంగా డినో డీట్స్ పేరుతో సరికొత్త పాడ్‌కాస్ట్‌ను తీసుకురాబోతున్నాడని ఆయన వెల్లడించారు.
దేవాన్ష్‌కు చిన్నప్పటి నుంచి జువాలజీ అంటే ఇంట్రెస్ట్, ముఖ్యంగా కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై జీవించిన డైనోసార్ల చరిత్ర, వాటి జీవన విధానంపై విపరీతమైన ఆసక్తి ఉంది. కేవలం ఆసక్తితోనే ఆగిపోకుండా వాటిపై విస్తృతంగా రీసెర్చ్ చేశాడు దేవాన్ష్. ఈ డినో డీట్స్ పాడ్‌కాస్ట్ ద్వారా దేవాన్ష్ తనే స్వయంగా హోస్ట్‌గా మారి..డైనోసార్లకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు, వింతలు, వాటి రకాలు, చారిత్రక విశేషాలను తనదైన క్యూట్ స్టైల్‌లో ప్రపంచానికి వివరించబోతున్నాడు. పిల్లలతో పాటు పెద్దలను కూడా ఆకట్టుకునేలా ఇన్ఫర్మేటివ్‌గా ఈ సిరీస్ సాగనుందని తెలుస్తోంది.
చంద్రబాబు నాయుడు మనవడిగా దేవాన్ష్ ఇలా వినూత్నమైన ప్రాజెక్ట్‌తో ముందుకు రావడం నారా అభిమానుల్లో, నెటిజన్లలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ క్రేజీ పాడ్‌కాస్ట్‌కు సంబంధించిన ఫస్ట్ ఎపిసోడ్ ఈ శుక్రవారం విడుదల కాబోతోంది. చిన్న వయసులోనే దేవాన్ష్ చూపిస్తున్న ఈ క్యూరియాసిటీకి, రీసెర్చి నైపుణ్యానికి సోషల్ మీడియాలో నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. తాతకు తగ్గ మనవడు..చిన్న వయసులోనే గ్లోబల్ ట్రెండ్‌ను పట్టుకున్నాడంటూ దేవాన్ష్‌పై అభినందనల వర్షం కురిపిస్తున్నారు.











