సోము వీర్రాజు. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన అధ్యక్షుడు. ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీని పటిష్ట పరచడం కోసం, ప్రభుత్వ చర్యలపై ఉద్యమాలు నిర్మించడం కోసం బీజేపీ అధిష్టానం ఎంపిక చేసిన కొత్త అధ్యక్షుడు సోము వీర్రాజు . ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చర్యలను తీవ్రంగా వ్యతిరేకించిన మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను తప్పించి ఆయన స్థానంలో సోము వీర్రాజు నియమించింది పార్టీ అధిష్టానం.
భారతీయ జనతా పార్టీలో సామాన్య కార్యకర్తగా జీవితం ప్రారంభించిన సోము వీర్రాజు పార్టీకి విధేయుడు అనే పేరు ఉంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చర్యలపై విరుచుకుపడ్డారన్న రికార్డు కూడా సోము వీర్రాజు ఉంది. అధిష్టానం పెద్దలపై ఈగ వాలకుండా ప్రత్యర్థులను తన మాటలతో ఎండ కట్టగలరు అనే పేరూ ఉంది. ఇన్ని లక్షణాలు ఉన్న సోము వీర్రాజుకి పార్టీ పగ్గాలు అప్పగిస్తే మరింత బలపడుతుందని బిజెపి అగ్రనాయకత్వం ఆయనను అధ్యక్షుడిగా చేసింది. ఇక్కడి వరకు కథ బాగానే ఉంది. కమల దళపతి గా పదవీ బాధ్యతలు చేపట్టి రెండు నెలలు పైబడినా సోము వీర్రాజు మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పై ఆచితూచి మాట్లాడుతున్నారు.
ప్రమాణ స్వీకారం సమయంలో దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన మహారాష్ట్రకే ఒకే ఒక్క రాజధాని ఉందంటూ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ తీవ్రస్థాయిలో విరుచుకు పడినా సోము వీర్రాజు నుంచి మాత్రం ఒక్క మాట కూడా రాలేదు. ప్రమాణ స్వీకారం సందర్భంగా ప్రభుత్వం చేపట్టే ప్రజావ్యతిరేక కార్యక్రమాలపై పోరాటాలు చేస్తామంటూ కమల దళాలు విసిరే మాటలు తప్ప ఇప్పటి వరకు ఆయన చేపట్టిన కార్యక్రమం ఒకటి లేదు. అమరావతి రైతుల నిరసనలు 250 రోజులు దాటినా సోము వీర్రాజు వారికి బహిరంగంగా మద్దతు పలికింది లేదు.
ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి రోజు రోజుకూ విస్తరిస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం కట్టడి చేయడం లేదంటూ ఒక్క ప్రకటన కూడా చేయలేదు సోము వీర్రాజు. దీనిపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ శ్రేణులు లోలోన మండిపడుతున్నారు. కొత్త అధ్యక్షుడిగా సోము వీర్రాజును తీసుకురావడం ప్రభుత్వానికి అనుకూలంగా ఉండటం కోసమా అని వారిలో వారు ప్రశ్నిస్తున్నారు.
అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మిత్రపక్షమైన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను మర్యాద పూర్వకంగా కలుసుకున్న సోము వీర్రాజు ఆ పార్టీతో కలిసి నిరసన దీక్షలు చేపడతామని ఇప్పటి వరకు ప్రకటించ లేదు. దీనిపై జనసేనలోను అసంతృప్తి రగులుతోంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై కమల దళపతి ఎప్పుడు గళం విప్పి తారోని పార్టీ శ్రేణులు ఎదురు చూస్తున్నాయి.
సోము వీర్రాజు కాపు కులానికి చెందిన వారు కావడంతో ఆ కులం మద్దతు భారతీయ జనతా పార్టీకి ఉంటుదని కమలనాథుల ఆశ. అయితే, సోము తీరుతో అది కూడా నెరవెరుతుందా.. లేదా అనే సంశయాలు ఇప్పుడు కలుగుతున్నాయని పార్గీ వర్గాలు చెబుతున్నాయి. సోము వీర్రాజు పని తీరు తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాలనే వారూ ఉన్నారు.