ఆఫ్ఘనిస్తాన్ కష్టాలు చూస్తుంటే.. ఈ తరహా కష్టం శత్రు దేశానికి కూడా వద్దన్న మాటే వినిపిస్తోంది. మత చాంధసవాదం తలకెక్కిన తాలిబాన్ ఉగ్రవాదుల పాలనలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురి అవుతారో? వారి పాలనలో మానవ హక్కులకు ఏ మేర ఉల్లంఘనలు జరుగుతాయో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ప్రత్యేకించి మహిళలపై తాలిబాన్లు సాగించే అకృత్యాలు గుర్తుకు వస్తేనే జలదరింపు ఖాయమనే చెప్పాలి. ఒకప్పుడు ఇదే తాలిబాన్ల చెరలో చిక్కుకున్న ఆఫ్ఘన్ ఈ అనుభవాలన్నింటినీ చవిచూసింది. ఇప్పుడు కూడా తాలిబాన్లు విరుచుకుపడటంతో మరోమారు ఆ తరహా నరకం తప్పదన్నట్లుగా ఆఫ్ఘన్ ప్రజలు భయకంపితులవుతున్నారు. అందుకే కాబోలు.. ఏమాత్రం అవకాశం చిక్కినా.. ఇతర దేశాలకు పారిపోయే దిశగా ప్రాణాలకు కూడా తెగిస్తున్నారు. ప్రస్తుతం తాలిబాన్ చెరలో చిక్కుకున్న ఆఫ్ఘన్ లో పరిస్థితులు తలచుకుంటేనే.. వెన్నులో వణుకు పుట్టడం ఖాయమే. ఇలాంటి పరిస్థితుల్లో నాటి తాలిబాన్ పాలనకు చరమ గీతం పాడిన ఓ హీరో గుర్తుకు వస్తున్నారు. అదే సమయంలో ఆ హీరో కుమారుడు కూడా ఇప్పటి తాలిబాన్లను ఎలా తరమికొట్టాలన్న దిశగా వ్యూహాలు రచిస్తున్నారు. వెరసి తండ్రి మాదిరి ఇప్పుడు కొడుకు కూడా హీరోగా విజయం సాధిస్తే.. మరోమారు ఆఫ్ఘన్ ను వీడి తాలిబాన్లు పరుగు లంకించుకోక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
రష్యాను తిప్పికొట్టారట
అహ్మద్ షా మసూద్.. ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం, ప్రజలు నేషనల్ హీరోగా పిలుచుకుంటారు. ఎప్పుడో 20వ శతాబ్ధానికి చెందిన ఈయన పేరు వింటే నిజంగానే తాలిబాన్లకు వెన్నులో వణుకు పుట్టాల్సిందే. ఆఫ్ఘన్ లోని శత్రు దుర్బేధ్య ప్రాంతంగా పరిగణించే పంజ్ షీర్ ప్రాంతానికి చెందిన మసూద్.. ఇతర ఆఫ్ఘన్ పౌరుల మాదిరి తాలిబాన్లకు తలొగ్గ లేదు. 1970-80 మధ్య ఆఫ్ఘన్ మీదకు సోవియట్ రష్యా దండెత్తి వస్తే.. అహ్మద్ షా ఈ దండయాత్రను తిప్పికొట్టే దిశగా గెరిల్లా పోరు సాగించారు. షా నేతృత్వంలోని తిరుగుబాటు దళాలకు జడిసిన రష్యా వెనకడుగు వేయక తప్పలేదు. ఆ తర్వాత 1996లో ఆఫ్ఘన్ ను తాలిబాన్లు తమ చెప్పు చేతల్లోకి తీసుకున్నారు. ఈ సమయంలో ఆఫ్థన్ లోని దాదాపుగా కీలక నేతలంతా తాలిబాన్లకు లొంగిపోయారు. అందుకు అహ్మద్ షా ససేమిరా అన్నారు. తాలిబాన్లను ఆఫ్ఘన్ నుంచి తరిమికొట్టేలా వ్యూహాలు రచించారు. వెరసి తాలిబాన్లకు టార్గెట్ అయ్యారు.
అమెరికాపై దాడికి రెండ్రోజుల ముందే
తనను చంపేందుకు తాలిబాన్లు యత్నిస్తున్నారన్న విషయం తెలిసి కూడా అహ్మద్ షా తాలిబాన్లను తరిమికొట్టే యత్నాలకు స్వస్తి చెప్పలేదు. దేశంలోని పరిస్థితులను అవగతం చేసుకుని విదేశీ సాయం లేకుండా తాలిబాన్లను తరిమికొట్టడం సాధ్యం కాదన్న భావనతో విదేశాలకు వెళ్లి అంతర్జాతీయ సహకారం కోరారు. ఈ క్రమంలో అహ్మద్ షా యత్నాలు ఫలిస్తున్న సూచనలు కనిపించగానే.. 2001 సెప్టెంబర్ 9న ఓ బాంబు దాడిలో ఆయనను తాలిబాన్లు చంపేశారు. అహ్మద్ షా చనిపోయిన రెండు రోజులకే ఆల్ కాయిదా ఉగ్రవాదులు అమెరికాలోని ట్విన్ టవర్లపై విరుచుకుపడ్డారు. ఈ దెబ్బతో ఉగ్రవాదుల ప్రభావం ఎలా ఉంటుందన్న విషయాన్ని ప్రత్యక్షంగా తెలుసుకున్న అమెరికా.. అప్పటిదాకా అహ్మద్ షా మసూద్ చెప్పిన మాటలన్నీ నిజమేనని నమ్మి.. నాటో బలగాలను ఆఫ్ఘన్ పంపింది. నాటో బలగాల దాడిలో తాలిబాన్లు చిత్తు కాగా.. ఆప్ఘన్‌కు విముక్తి లభించింది. తాలిబాన్ పాలన తర్వాత ఆఫ్ఘన్ తొలి అధ్యక్షుడిగా ఎన్నికైన హమీద్ కర్జాయ్.. అహ్మద్ షా మసూద్ ను నేషనల్ హీరోగా ప్రకటించారు.
ఇప్పుడు అహ్మద్ కొడుకు అదే పనిలో..
నాడు తాలిబాన్లను విదేశీ సేన సాయంతో దేశం నుంచి వెళ్లగొట్టేలా అహ్మద్ షా మసూద్ వ్యవహరించిన తీరును ఇప్పటికీ ఆఫ్ఘన్ ప్రజలు కథలుకథలుగా చెప్పుకుంటారు. తాలిబాన్ల చెర నుంచి ఆఫ్ఘన్ కు విముక్తి లభించకముందే.. అహ్మద్ షా చనిపోయినా.. ఆయన నెరపిన మంత్రాంగం కారణంగానే నాటో బలగాలు తాలిబాన్ల తాట తీశాయన్నది ఏ ఒక్కరూ కాదనలేని సత్యం. ఇప్పుడు మరోమారు తాలిబాన్లు ఆఫ్ఘన్ ను తమ చేతుల్లోకి తీసుకున్నారు. దేశంలోని మెజారిటీ ప్రాంతాలన్నీ తాలిబాన్ల వశం అయిపోయాయి. అధ్యక్షుడు ఘనీ కూడా పారిపోయారు. అయితే అహ్మద్ షా మసూద్ కుమారుడు అహ్మద్ మసూద్ కూడా తాలిబాన్ల పనిబట్టే వ్యూహాల రచనలోనే నిమగ్నమయ్యారట. ఆఫ్ఘన్ లోని మెజారిటీ ప్రాంతాలన్నీ తాలిబాన్ల వశం కాగా.. పంజ్ షీర్ మాత్రం ఇంకా వారి వశం కాలేదు. అక్కడి ప్రాంతానికే చెందిన అహ్మద్ మసూద్ తాలిబాన్లను తరిమికొట్టే వ్యూహాలకు పదును పెడుతున్నారట. అధ్యక్షుడు ఘనీ పారిపోయినా.. ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్.. అహ్మద్ మసూద్ బృందంతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం పంజ్ షీర్ లోనే తిష్ట వేసిన ఆ దేశ రాజకీయ ప్రముఖులంతా అహ్మద్ మసూద్ నేతృత్వంలో తాలిబాన్లపై తిరుగుబాటు వ్యూహం రచిస్తున్నారట. తండ్రి మాదిరే అహ్మద్ మసూద్ కూడా సక్సెస్ అయితే.. తాలిబాన్లు ఇకపై ఆఫ్ఘన్ వైపు కన్నెత్తి చూడలేరన్న వాదనలు వినిపిస్తున్నాయి.