వాయు కాలుష్యంతో దేశ రాజధాని ఢిల్లీ ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఢిల్లీని కొందరు గ్యాస్ ఛాంబర్‌తో పోల్చుతున్నారు. రాజధాని నగరంలో నివాసం ఉండే వారు అక్కడి వాయు కాలుష్యంతో మృత్యువాత పడుతున్నారు. వాయు కాలుష్యం ఢిల్లీ వాసులను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. అది ఎంతగా అంటే రోజుకు పెట్టె సిగరెట్లు కాల్చినంత తీవ్రత ఉంటోంది. అసలు నివాసానికి ఢిల్లీ పనికి రాదని కూడా పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సోనియాగాంధీ కూడా దేశ రాజధానిని వదలి దూరంగా వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు.
సోనియాకు తప్పని తిప్పలు
యూపీఏ ప్రభుత్వంలో షాడో ప్రధానిగా చక్రం తిప్పిన సోనియాకు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. ఇప్పటికే క్యాన్సర్, ఛాతి ఇన్ఫెక్షన్లతో బాధ పడుతున్న సోనియా ఆరోగ్యాన్ని ఢిల్లీ వాయు కాలుష్యం మరింత ప్రమాదంలోకి నెట్టింది. కొంత కాలంగా పూర్తిగా వైద్యుల పర్యవేక్షణలో ఛాతి ఇన్ఫెక్షన్ కు మందులు వాడుతున్నా సోనియా ఆరోగ్యం మెరుగుపడలేదు. దీంతో వైద్యులు ఆమెను ఢిల్లీ వదలి వెళ్లాలని సూచించారు. దీంతో ఆమె గోవా లేదా చెన్నైయ్ నగరాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. సోనియా అంటే ఎక్కడికైనా వెళ్లగలరు. మరి సామాన్యుల పరిస్థితి ఏమిటి?
ఢిల్లీలోనే ఎందుకంత కాలుష్యం?
ఢిల్లీ కాలుష్యానికి ప్రధానంగా రెండు కారణాలు. ఒకటి ఢిల్లీలో మూడు కోట్ల వాహనాలు రోడ్లపై తిరుగుతున్నాయి. అందులో కాలం చెల్లిన వాహనాలు 30 శాతంపైగానే ఉన్నాయనేది ఒక అంచనా. ప్రతి రోజూ 3 కోట్ల వాహనాలు విడుదల చేస్తున్న కార్భన్ డయాక్సైడ్ తో ఢిల్లీ మొత్తం కాలుష్య మేఘాలు కమ్ముకుంటున్నాయి. అక్కడి చల్లని వాతావరణం కూడా వాయు కాలుష్యం త్వరగా వెళ్లనీయకుండా చేస్తోంది.
ఇక రెండవ ప్రధాన కారణం. హర్యానా, పంజాబ్ లో రైతులు ఖరీఫ్ గోదుమ పంట నూర్పిడి తరవాత వచ్చే వ్యర్థాలకు పొలంలోనే నిప్పు పెడుతున్నారు. దీంతో పెద్ద ఎత్తున కాలుష్యం వస్తోంది. ఈ కాలుష్య మేఘాలు ఢిల్లీని చుట్టుముడుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎన్ని చర్యలు తీసుకున్నా హర్యానా, పంజాబ్ రైతులు మాత్రం పంట వ్యర్థాలు తగులబెట్టడం మాత్రం ఆపడం లేదు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఢిల్లీ కాలుష్య నియంత్రణపై చేతులెత్తేశాయనే చెప్పవచ్చు.
Must Read ;- జనసేనానికి ఢిల్లీ సిగ్నల్స్ నిజమేనా? బిల్డప్పా?
పరిష్కారం లేదా?
ఉంది. దేనికైనా పరిష్కారం ఉంటుంది. అయితే ప్రజల సహకారం లేకుండా మాత్రం ఏదీ సాధ్యం కాదు. ముందుగా వ్యక్తిగత వాహనాలను సాధ్యమైనంత తగ్గించుకోవాలి. ఢిల్లీ మెట్రోరైల్ సేవలు వినియోగించుకోవాలి. వాహనాల సంఖ్యను సగానికి తగ్గించడంతోపాటు, కాలం చెల్లిన వాహనాలను వెంటనే స్వాధీనం చేసుకోవాలి. ఎందుకంటే పది కొత్త వాహనాలు వెదజల్లే కాలుష్యాన్ని, పాత వాహనం ఒక్కటే వెదజల్లుతుంది. ఇక పంజాబ్, హర్యానా రైతులతో గ్రూపులు ఏర్పాటు చేసి, పంట వ్యర్థాలను ఎరువుగా మార్చే ప్రణాళికలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఖర్చుతో చేపట్టాలి. అవసరం అయితే పంట వ్యర్థాలను సేకరించే ఏర్పాట్లు చేసుకోవాలి. ఇక చివరగా విద్యుత్ వాహనాలను ప్రోత్సహించాలి.
అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పటికే విద్యుత్ హైబ్రిడ్ వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. లండన్లో మరో పదేళ్లలో డీజిల్, పెట్రోల్ వాహనాలు నిషేధించాలని అక్కడి ప్రభుత్వం ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించింది. అలాగే ఢిల్లీలోనూ విద్యుత్ వాహనాలు మాత్రమే తిప్పాలనే నిబంధన అమలు చేయాలి. ఇవన్నీ ఒక్కసారి సాధ్యం కాదు. కాబట్టి పదేళ్ల ప్రణాళికతో అమలు చేయాలి. ముఖ్యంగా ప్రజల సహకారం తీసుకోవాలి. అప్పుడే ఢిల్లీ రాజధాని నివాసానికి పనికి వస్తుంది. లేదంటే అందరూ ఖాళీ చేయాల్సి రావచ్చని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు.
Also Read ;- రాజధాని తరలింపుపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు