వీహెచ్… ఈ రెండక్షరాల పదం విన్నంతనే… గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు చెందిన సీనియర్ నేత, మాజీ ఎంపీ, వయసు మీద పడ్డా… పార్టీ కోసం ఎగేసుకుని మరీ ఎంటరైపోయే ఓ వృద్ధ నేత మన కళ్ల ముందు కదలాడతారు. ఎప్పుడో చాలా ఏళ్ల క్రితం రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వీహెచ్.. ఆ తర్వాత ప్రత్యక్ష ఎన్నికలకు దాదాపుగా దూరమయ్యారు. ఈ క్రమంలో ప్రత్యర్థులంతా ఆయనను ఏనాడైనా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచారా? అంటూ ప్రశ్నించిన సందర్భాలూ లేకపోలేదు. ఇప్పుడిదంతా ఎందుకంటే… ప్రత్యక్ష ఎన్నికలకు దూరమైనా… కురువృద్ధుడైనా కూడా పార్టీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉందని వీహెచ్ మరోమారు నిరూపించారని చెప్పేందుకే ఇదంతా చెప్పుకోవాల్సి వస్తోంది. మొత్తంగా పార్టీలో ఆయన రేంజేమిటో తెలిపే ఘటన తాజాగా చోటుచేసుకుంది.
టీపీసీసీ చీఫ్ రేసులో…
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) చీఫ్ గా తనకు అవకాశం ఇవ్వాలని వీహెచ్ ఇటీవల బాగా యత్నించిన సంగతి తెలిసిందే కదా. యువ నేత రేవంత్ రెడ్డితో పాటు మరో సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డిలకు ఏమాత్రం తగ్గకుండా వీహెచ్ తన వంతు యత్నాలు సాగించారు. అయితే అంతిమంగా పార్టీ అధిష్ఠానం రేవంత్ రెడ్డికి టీపీసీసీ పగ్గాలు అప్పగించింది. అయితే ఈ ప్రకటన రాకముందే వీహెచ్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. తీవ్ర అనారోగ్యానికి గురైన వీహెచ్… హైదర్ గూడలోని అపోలో ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ నుంచి తిరిగివచ్చినంతనే రేవంత్ రెడ్డి నేరుగా ఆసుపత్రికి వెళ్లి వీహెచ్ ను పరామర్శించారు.
నేరుగా సోనియా ఫోన్ చేసి పరామర్శ
తాజాగా గురువారం ఉదయం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ నేరుగా వీహెచ్ కు ఫోన్ చేశారు. నేరుగా వీహెచ్ ను పలకరించిన సోనియా… జాగ్రత్తగా ఉండాలని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాని ఆయనకు సూచించారు. త్వరగా కోలుకోవాలని, ఆయన రాజకీయ అనుభవం కాంగ్రెస్ పార్టీకి అవసరమని సోనియా చెప్పారట. తనకు ఫోన్ చేసిన సోనియాకు వీహెచ్ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని కూడా ఆయన సోనియాకు చెప్పారట. మొత్తంగా సోనియా స్వయంగా ఫోన్ చేసి పరామర్శించడంతో పాటు… పార్టీకి ఆయన సేవలు ఏపాటి అవసరమన్న విషయాన్ని నేరుగా పార్టీ అధినేత్రే చెప్పడం చూస్తుంటే… వీహెచ్ రేంజి ఏమిటో తెలిసివచ్చిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- ఒక్క ఛాన్స్ ప్లీజ్.. పాదయాత్రకు రేవంత్ ప్లాన్