ఐఏఎస్ అవ్వాలనుకునే వారికి కలియుగ దానకర్ణుడు సోనూ సూద్ అభయ హస్తం ఇచ్చేశాడు. సేవే లక్ష్యంగా సోనూ అడుగులు పడుతున్నాయి. కరోనా కాలంలో అవతరించిన దేవుడిలా జనానికి సోనూ కనిపిస్తున్నారు. ఎక్కడ కష్టం ఉంటే అక్కడ సోనూ ఉంటాడని జనానికి అర్థమైపోయింది. చిన్న పిల్లలకు ఉచిత విద్య, వైద్య సదుపాయాలపై కూడా సోనూ దృష్టిసారించాడు. సమస్య ఏదైనా తనదైన శైలిలో స్పందించడం సోనూకు అలవాటుగా మారింది. అధికారంలో ఉండి కూడా చేయలేకపోతున్నవారికి ఎలా చేయవచ్చో సోనూ చేసి చూపిస్తున్నాడు.
సోనూసూద్ చేస్తున్న సేవలను ఐక్యరాజ్యసమితికూడా గుర్తించింది. ఎస్.డి.జి. స్పెషల్ హ్యుమానిటేరియన్ యాక్షన్ అవార్డుతో ఆయనను సత్కరించిన సంగతి తెలిసిందే. సోనూసూద్ తాజాగా మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తన తల్లి ప్రొఫెసర్ సరోజ్ సూద్ 13 వ వర్ధంతిని పురస్కరించుకుని ఆమె జ్ఞాపకార్ధం ఓ కార్యక్రమాన్ని ప్రకటించారు. ఆమె పేరు మీదుగా స్కాలర్ షిప్ లు ఇస్తున్నట్టుగా ప్రకటించాడు.
పేదరికంలో ఉండి ఐ.ఎ.ఎస్. కి సిద్ధమవుతున్న అభ్యర్ధులు ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకోవచ్చు. వారు తమ లక్ష్యాన్ని చేరుకోవడం కోసమే తానీ సహాయం చేస్తునట్టుగా సోనూ పేర్కొన్నారు. ఈ స్కాలర్ షిప్ ల కోసం www.schollifeme.com వెబ్ సైట్ లో అప్లయ్ చేసుకోవాలని సూచించారు. సోనూసూద్ చేస్తున్న ఈ గొప్ప సహాయానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అతనికి జేజేలు పలుకుతున్నారు.