ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్డీఏ ప్రభుత్వంలో వహిస్తున్న కీలక పాత్రతో ఆయనకు కేంద్ర పెద్దలు ఇస్తున్న ప్రాధాన్యం కూడా పెరిగింది. అందులో భాగంగా ముఖ్యమంత్రికి ఢిల్లీలో కేటాయించిన అధికారిక నివాసం మారింది. తాజాగా చంద్రబాబుకు 1 – జన్ పథ్ లో ఇంటిని కేటాయించారు. ఇకపై చంద్రబాబు ఎప్పుడు ఢిల్లీ పర్యటనకు వెళ్లినా ఆ 1 – జన్ పథ్ ఇంట్లోనే బస చేయనున్నారు. చంద్రబాబు రెండు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీకి వెళ్లి హోం మంత్రి అమిత్ షాను కలిసిన సంగతి తెలిసిందే.
కేంద్ర బడ్జెట్ దగ్గరికి వస్తున్నందున రాష్ట్ర ప్రయోజనాలను మరోసారి గుర్తు చేసేందుకు చంద్రబాబు ఢిల్లీకి వెళ్లారు. ఈ సందర్భంగానే ఆయన తనకు కేంద్రం కేటాయించిన కొత్త నివాసంలో అడుగు పెట్టారు. 1- జన్ పథ్ లో చంద్రబాబు ప్రవేశించినందున.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా నిర్వహించిన ఆ పూజల్లో కూడా చంద్రబాబు పాల్గొన్నారు. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పుడు ఈ నివాసాన్ని చంద్రబాబుకు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. కానీ, అప్పట్లో చాలా కారణాలతో చంద్రబాబు ఈ ఇంట్లో ఉండేందుకు ఆసక్తి చూపించలేదు. 2019లో ముఖ్యమంత్రి అయిన జగన్ ఢిల్లీకి వచ్చిన సమయంలో ఈ అధికారిక నివాసంలోనే బస చేసేవారు. ఇప్పుడు చంద్రబాబు తిరిగి ఆ నివాసంలో బస చేసేందుకు అంగీకరించారు. పక్కనే 2 – జన్‌పథ్ క్వార్టర్‌లో మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ గతంలో నివాసం ఉండేవారు.
ఈ మధ్య ఎన్నికల్లో గెలిచిన తరువాత చంద్రబాబు ఎప్పుడు ఢిల్లీ వచ్చినా ప్రతిసారి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు లేదా మాజీ ఎంపీ గల్లా జయదేవ్ నివాసంలోనే బస చేస్తున్నారు. ఇప్పుడు తిరిగి 1 – జన్ పథలో చంద్రబాబు అడుగు పెట్టారు. అయితే, ఏపీ సీఎం బస చేయడానికి ఢిల్లీలోని అశోకారోడ్డులో ఉన్న ఏపీ భవన్ ప్రత్యేక భవనాలు కూడా ఉన్నాయి. ఉమ్మడి ఏపీలో సీఎంలుగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి ఏపీ భవన్ బసను వాడేవారు.
2014లో చంద్రబాబు సీఎం అయ్యాక అప్పట్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామిగా ఉండటంతో ఏపీ ముఖ్యమంత్రికి మరో అధికారిక బస అయిన 1 జన్ పథ్ ను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. 2019లో టీడీపీ ఓటమి పాలైన తర్వాత 1 జన్ పథ్ నివాసాన్ని జగన్ మోహన్ రెడ్డి వినియోగించారు. జగన్ సీఎం అయ్యాక జన్ పథ్ నివాసాన్ని ఆయన అభిరుచికి అనుగుణంగా మార్చడానికి రూ.కోట్లు ఖర్చు పెట్టారు. పైగా ఏపీ భవన్ బస సదుపాయాలకు కూడా జగన్ రూ.కోట్లు వెచ్చించారు.











