‘రాళ్లు తిని అరిగించుకోగల వయసులో తినడానికి మరమరాలు కూడా దొరకలేదు.. వజ్రవైఢూర్యాలు పోగేసుకున్న వయసులో మరమరాలు కూడా అరగడం లేదు’ – ఈ మాటల్లో ఎంతటి తాత్వికత దాగుంది.
రేలంగి లాంటి హాస్య నటుడి నోటి వెంట ఇలాంటి తాత్వికత ఉట్టిపడే మాటలు కూడా వస్తాయంటే ఎవరికైనా ఆశ్చర్యకరమే. రేలంగి నటనకు నిండు నూరేళ్లు అని మనం చెప్పుకుని తీరాల్సిందే. రంగస్థల నటుడిగా 1919లో జీవితాన్ని ప్రారంభించారాయన. 1935లో సినిమా నటుడిగా 85 ఏళ్ల క్రితం నట ప్రయాణాన్ని సాగించారు. 1975 నవంబరు 27న ఈ హాస్య నటచక్రవర్తి కన్నుమూశారు. రేలంగి వర్థంతి సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.
రేలంగి వారసులు ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు? (ఈ వీడియో చూడండి)
నవ్వించడమంటే నవ్వుకునేంత హాయి కాదు .. నవ్వించడమంటే ఎదుటివారిని ఏడిపించేంత తేలికా కాదు. నవ్వించాలంటే మాటల్లో మెరుపుల్లాంటి విరుపులు ఉండాలి.. భావాల ఆవిష్కరణలో చాతుర్యం ఉండాలి .. అర్థాల్లో చమత్కారం పండాలి. అదే సమయంలో అందుకుతగిన హావభావ విన్యాసం చేయగలగాలి. అలాంటప్పుడే అవతలివారిని నవ్వించే ప్రయత్నం ఫలిస్తుంది. తెరపై నవ్వించలేకపోతే నవ్వులపాలు కావలసి వస్తుంది. అందుకే నవరసాల్లో హాస్యరసంతో అవతలివారిని మెప్పించడం చాలా కష్టతరమైనదని పెద్దలు సెలవిచ్చారు. అంతటి కష్టతరమైన హాస్యాన్ని అవలీలగా నడిపించిన తొలితరం హాస్యనటుల్లో రేలంగి వెంకట్రామయ్య ఒకరు.
రావులపాడులో పుట్టి చెన్నైలో అడుగెట్టి..
రేలంగి 1910.. ఆగస్టు 13న కాకినాడ సమీపంలోని ‘రావులపాడు’ గ్రామంలో, ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి హరికథలు చెబుతూ జీవనాన్ని నెట్టుకొచ్చేవారు. ఆర్థికపరమైన ఇబ్బందుల కారణంగా 9వ తరగతితో చదువు ఆపేసిన రేలంగి నటనపట్ల ఆసక్తిని చూపడం మొదలెట్టారు. సినిమాల పట్ల ఆసక్తితో చెన్నైకి చేరుకున్నారు. దర్శకుడు సి.పుల్లయ్య దగ్గర ప్రొడక్షన్ టీమ్ లో స్థానం లభించడంతో సాపాటుకు ఇబ్బందిలేదని హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. ఆ రోజు నుంచి పుల్లయ్యగారు అప్పగించిన బాధ్యతలను నిర్వహిస్తూ, నటుడిగా ఎప్పుడు అవకాశం వస్తుందా అనే ఆశతో ఎదురుచూడసాగారు.
రేలంగి పనితీరు .. వ్యక్తిత్వం నచ్చడంతో, ఆయనను నటుడిగా చేయాలనే నిర్ణయానికి సి.పుల్లయ్య వచ్చారు. తన సినిమాల్లో రేలంగికి చిన్న చిన్న పాత్రలను ఇవ్వడం మొదలెట్టారు. తన పని తాను చేస్తూనే ఆ పాత్రల్లో నటిస్తూ, నటుడిగా రేలంగి తన వేగాన్ని పెంచారు. ‘కీలుగుఱ్ఱం’లో చేసిన ‘గోవిదుడు’ పాత్ర .. ‘గుణసుందరికథ’లో చేసిన ‘కాలమతి’ పాత్ర హాస్య నటుడిగా ఆయన ఉనికిని చాటాయి. అలా 40వ దశకంలో నటుడిగా తన గురించి అందరూ మాట్లాడుకునేలా చేసిన రేలంగి, 50వ దశకం ఆరంభంలోనే ‘పాతాళభైరవి’ చేశారు.
పాటలు పాడటంలోనూ ఘనాపాటి
‘పాతాళ భైరవి’ సినిమాలో సూరసేనుడి పాత్రలో ‘వినవే బాలా నా ప్రేమ గోల’ అంటూ రేలంగి చేసిన సందడితో కెరియర్ పరంగా ఇక ఆయన వెనుదిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. అప్పట్లో ఏ స్టేజీ నాటకంలోనైనా ఈ పాట ఉండవలసిందే అనేంతగా ఈ పాట పాపులర్ అయింది. రేలంగికి ఒక పాట పెట్టడమనేది ఈ సినిమా నుంచే మొదలైంది. ‘శివ శివ మూర్తివి గణనాథా .. ‘ .. ‘ధర్మం చెయ్ బాబూ ..’ .. ‘కాశీకి పోయాను రామా హరే .. ‘శివగోవింద గోవిందా .. ‘ఇంగిలీషులోన మ్యారేజీ .. ‘ చక్కనిదానా చిక్కనిదానా ..’ .. ‘సుందరి నీ వంటి దివ్య స్వరూపం .. ‘, ‘సరదా సరదా సిగరెట్టు..’ వంటి కొన్ని పాటలను అందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
రేలంగిపై చిత్రీకరించిన పాటలన్నీ ఆదరణ పొందుతూ, అవి ఆయా సినిమాలకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తూ ఆయన కెరియర్ ను మరింత బలంగా ముందుకు నడిపించాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతకుముందు కమెడియన్ గా ఉన్న కస్తూరి శివరావు .. రేలంగి సహనటుడైన రమణారెడ్డి ఇద్దరూ బక్కపలచగా ఉండి, తమదైన బాడీ లాంగ్వేజ్ తో నవ్వులు పూయించారు. ఆ శరీరాకృతి కారణంగా కామెడీని పండించడంలో వాళ్లు చాలా చురుకుగా ఉండేవారు. వాళ్లతో పోలిస్తే రేలంగి కాస్త మందంగానే ఉండేవారు. నిదానంగా .. భారంగా అడుగులువేస్తూ, కనుబొమలు .. భుజాలు ఎగరేస్తూ గమ్మత్తైన మేనరిజంతో డైలాగ్స్ చెబుతూ ఆయన ముందుకెళ్లారు.
నడకతోనే నవ్వులు పూయించే ఆయన తీరుకి ప్రేక్షకులు పట్టుబడిపోయారు. హాస్య పాత్రల్లో ఒదిగిపోయే విధానానికి ఆనందంతో అభిమానులైపోయారు. తెరపై రేలంగి కనిపిస్తే నిండుదనం .. పండుగదనం అనుకుంటూ ఆత్మీయులైపోయారు. ‘మిస్సమ్మ’ చిత్రంలో ప్రతిచిన్న విషయానికి ‘తైలం .. తైలం’ అంటూ డబ్బులు వసూలు చేసే ‘దేవయ్య’ పాత్రలో ఆయన చేసిన హడావుడిని ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేరు. ఇక ‘వెలుగు నీడలు’లో మాటకి ముందు .. వెనుక ‘శ్రీమతే రామానుజాయ నమః’ అంటూ ఆయన పోషించిన ఉదాత్తమైన పాత్ర కళ్లముందు కదలాడుతూనే ఉంటుంది.
‘అప్పుచేసి పప్పుకూడు’ సినిమా రేలంగి పాత్రపైనే మొదలవుతుంది. ఈ సినిమాలో అప్పులవారి బారి నుంచి తప్పించుకునే ‘భజగోవిందం’ పాత్రలో ఆయన పెట్టిన కితకితలు ఇప్పటికీ తలచుకుని నవ్వుకునేలా చేస్తాయి. ‘పెద్దమనుషులు’ సినిమాలోని ‘తిక్క శంకరయ్య’ పాత్ర రేలంగికి మంచిపేరు తెచ్చిపెట్టింది. పెద్దమనుషుల ముసుగులో అక్రమాలకు పాల్పడుతున్నవారిని ఆటపట్టిస్తూ .. ఆటకట్టించే పాత్రలో ఆయన నటన అభినందనీయమని చెప్పకతప్పదు.
‘మాయాబజార్’ లో చేసిన ‘లక్ష్మణ కుమారుడు’ పాత్ర .. ‘నర్తనశాల’లో చేసిన ‘ఉత్తర కుమారుడు’ పాత్ర దేనికవే వైవిధ్యభరితమైనవి. ఈ రెండు పాత్రలు .. అసమానమైన ఆయన హాస్యరస పోషణకు అద్దం పడతాయి. ఇక ‘లవకుశ’ సినిమాలో అనుమానంతో భార్యను నిందిస్తూ, ఆ సమస్యను తీసుకెళ్లి రాముడికి ముడిపెట్టే సన్నివేశంలో ఆయన నటన అనితర సాధ్యం అనిపిస్తుంది. ‘విప్రనారాయణ’లో వేశ్య కుటుంబానికి చెందిన స్త్రీ మాయలో తన గురువుగారు పడకుండా కాపాడుకునే ‘రంగరాజు’ పాత్ర .. ‘వాగ్దానం’లో హరికథలు చెప్పుకుని జీవించే ‘రామదాసు’ పాత్ర ఆయన సహజ నటనకు సాక్ష్యంగా నిలుస్తాయి. నిజమైన నటనకు నిర్వచనం చెబుతాయి.
ఇలా ఎన్నో విభిన్నమైన కథలు .. విలక్షణమైన పాత్రలు .. విరామమెరుగని విజయాలు రేలంగి ఖాతాలో కనిపిస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే రేయింబవళ్లు చెప్పుకున్నా తరగని చరిత్రే రేలంగి. ఈ రోజుల్లో కొంతమంది సినిమాల్లో అవకాశాల కోసం కొన్ని రోజుల పాటు ప్రయత్నాలు చేసి, ఇక ఈ కష్టాలు తమవల్ల కాదని నిరాశ చెందుతారు. అవకాశాలు రావడం లేదని దిగాలుపడిపోతారు. అలాంటివారికి ఎప్పటికీ ఎనర్జీని ఇచ్చే పాఠం .. రేలంగి జీవితం. ఆయన పని చేయలేదు .. ఒక యజ్ఞం చేశారు .. ఒక తపస్సు చేశారు. కష్టాలు వచ్చినప్పుడు కన్నీళ్లతో సావాసం చేయకుండా, ఆశల దుప్పటికప్పి నిరాశను నిద్రబుచ్చారు.
కాలానికి ఎదురీదే ఓ వ్యక్తి జీవితంలో ఎంతవరకూ ఎదగగలడు అనే ప్రశ్నకి, తన పేరునే సమాధానంగా చూపిన నటుడు ‘రేలంగి’ ఒకానొకప్పుడు చెన్నైలో అద్దె ఎక్కువగా ఇచ్చుకోలేని కారణంగా ఊరు బయట ఇంట్లో మకాం పెట్టిన రేలంగి, ఆ తరువాత అంచలంచెలుగా ఎదుగుతూ వరుస బంగ్లాలను కట్టించారు. ఏ రోడ్లపై ఎర్రటి ఎండల్లో నడిచారో .. అదే రోడ్లపై ఏసీ కారుల్లో తిరిగారు. తను హాస్య నటుడై వుండి, మరో హాస్యనటుడైన పద్మనాభానికి అవకాశాలు ఇప్పించిన విశాల హృదయం ఆయన సొంతం.
అంకితభావాన్ని మిత్రుడిగా ఆదరించిన ఆయన, అహంభావాన్ని మాత్రం ఎప్పుడూ శత్రువులానే చూశారు. ఆకలితో పాటు ఆత్మాభిమానం కూడా అందరికీ ఉంటుందని భావించిన రేలంగి, ఎవరి మనసులను కష్టపెట్టకుండా మసలుకునేవారు. తనని తాను మైనంలా మలచుకుంటూ ఆయన మేరు పర్వతంలా ఎదిగిపోయారు. తెలుగు తెరపై చెరగని నవ్వుల సంతకంలా మిగిలిపోయారు. ఈ రోజున రేలంగి వర్ధంతి .. ఈ సందర్భంగా ‘ది లియో న్యూస్’ ఆయనను స్మరించుకుంటోంది.
– పెద్దింటి గోపీకృష్ణ