మనసంటూ ఉన్నాక .. వయసంటూ వచ్చాక ప్రేమలో పడకుండా ఎవరుంటారు? ప్రేమంటూ కలిగాక .. కలలన్నీ కబుర్లయ్యాక కలిసి ఎగరనివారు ఎవరుంటారు? ప్రేమకథలు ఎప్పుడూ కొత్తగానే అనిపిస్తూ ఉంటాయి .. ఎవరూలేని ఏకాంతాన తీపిరాగాలు తీస్తూనే ఉంటాయి. అలాంటి ప్రేమకథలను తెరపై అందంగా మలచడంలోను .. యూత్ హృదయాలు నిండేంతగా కొలచడంలోను శేఖర్ కమ్ముల ముందువరుసలో కనిపిస్తారు. ఈ రోజున ఆయన పుట్టినరోజు.
శేఖర్ కమ్ముల ప్రేమకథల్లో సున్నితత్వం ప్రధానంగా కనిపిస్తుంది. అమ్మాయి .. అబ్బాయి రాత్రుళ్లు గోడలు దూకడాలు .. లేచిపోవడాలు .. రౌడీలు తరుముతుంటే తప్పించుకోవడాలు .. భారీ ఫైట్లు ఇలాంటి హడావిడి ఏదీ ఆయన సినిమాల్లో కనిపించదు. తల్లిదండ్రులను ఎదిరిస్తేనే ప్రేమ .. అమ్మాయి తండ్రిని విలన్ గా నిలబెడితేనే ప్రేమ అనే కాన్సెప్టులకు దూరంగా ఆయన కథలు నడుస్తాయి. ప్రేమ అనేది ఇద్దరు వ్యక్తులకు సంబంధించినదే అయినా, అది ఫలించాలంటే రెండు కుటుంబాల అనుమతి కావాలనే సందేశాన్ని ఇస్తూ సాగుతాయి.
సాధారణంగా ప్రేమకథలు .. ప్రేమికుల చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. వాళ్ల ఆటపాటలు .. అలకలు .. విరహాలు .. వియోగాలు ఇవన్నీ లేకుండా ప్రేమకథలు పూర్తికావు. వీటన్నింటినీ కూడా ఆయన ఆయా నేపథ్యాలకి తగిన విధంగా నడిపిస్తారు. ‘ఆనంద్’ .. ‘గోదావరి’ .. ‘ఫిదా‘ సినిమాలను అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ కథలన్నీ కూడా మన కళ్ల ముందు జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది .. ఈ పాత్రలన్నీ కూడా మన చుట్టూ తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఈ కథ మనది .. ఇందులో మనం కూడా ఒకళ్లం అనే ఫీలింగ్ ప్రేక్షకులకు తీసుకురావడమే శేఖర్ కమ్ముల ప్రత్యేకత.
Must Read ;- రౌడీ బేబీ అదే మ్యాజిక్ రిపీట్ చేస్తుందా?
శేఖర్ కమ్ముల సినిమాల్లో హీరోయిన్స్ ప్రేమలో పడతారు .. కానీ వాళ్లు ప్రేమికుడు తానా అంటే తందానా అనరు. కులాసాగా తిరుగుతూ కుటుంబాల పరువు ప్రతిష్ఠలను తాకట్టుపెట్టరు. వాళ్లకంటూ ఒక వ్యక్తిత్వం ఉంటుంది. వాళ్లు కుటుంబ విలువలు పాటిస్తారు .. ఆ నియమాల పరిధిలోకే కథానాయకుడిని లాగేసి కలిసి నడవాలని చూస్తారు. అందువలన కథానాయికల పాత్రలకి మంచి ప్రాధాన్యత ఉంటుంది. వాళ్ల పాత్రలను ఆయన తీర్చిదిద్దే తీరు ఎంతో ఉత్తమంగా .. మరెంతో ఉన్నతంగా ఉంటుంది. ఆయన సినిమాల్లో మాటలు ఎంత సహజంగా ఉంటాయో .. పాటలు కూడా అంతే సహజంగా సాగుతాయి.
సాధారణంగా సినిమాల్లో ఇద్దరు ప్రేమికులు పాడుకునే పాటల్లో, ప్రేమకంటే కోరిక ఎక్కువ కనిపిస్తుంది. కానీ శేఖర్ కమ్ముల సినిమాల్లో పాత్రల స్వభావానికి తగినట్టుగానే పాటలు ఉంటాయి .. వాటిలో నిజమైన ప్రేమనే నిండుగా కనిపిస్తుంది. ట్యూన్ కూడా అలజడి రేపేదిగా కాకుండా .. అనుభూతిని తట్టిలేపేదిగా ఉంటుంది. అందుకే ఆయన కథలు మందాకినిలా ప్రవహిస్తాయి .. కథా సుగంధంతో కలిసి పరిమళిస్తాయి. శేఖర్ కమ్ముల ప్రేమకథలు బోర్ అనిపించవు .. ఆయన సృష్టించిన పాత్రలు పాతవే అనిపించవు. అందుకు కారణం ఆ ప్రేమకథల నేపథ్యాలు వేరుగా ఉండటం. ఆయన తెరకెక్కించిన సినిమాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది.
ఇక ఆయన స్క్రీన్ ప్లే కూడా చాలా నీట్ గా ఉంటుంది. ఎక్కడా ప్రేక్షకుడు అయోమయానికి లోనుకాడు. ఒక చందమామ కథలా మహానగరాల్లోని యూత్ నుంచి, మారుమూల గ్రామాల్లోని సాధారణ ప్రేక్షకుల వరకూ ఆయన సినిమా అర్థమైపోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, ఆయన కథలు .. పాత్రలు .. మాటలు .. పాటలు అన్నీ కూడా సున్నితత్వాన్ని కలుపుకునే నడుస్తాయి. అన్నివర్గాల ప్రేక్షకులను అనుభూతి ఆకాశంలో విహరింపజేస్తాయి. ఈ రోజున పుట్టినరోజు జరుపుకుంటున్న ఆయనకి, ‘ది లియో న్యూస్’ టీమ్ శుభాకాంక్షలు అందజేస్తోంది.
— పెద్దింటి గోపీకృష్ణ
Also Read ;- ‘లవ్ స్టోరీ’ నాగ చైతన్య కోరిక నెరవేరుస్తుందా..?