4ఏళ్లలో రాష్ట్రాన్ని 40ఏళ్ళు వెనక్కినెట్టిన క్రెడిట్ సీఎం జగన్మోహన్ రెడ్డిదే..
2019ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి, ఆయన పార్టీకి వచ్చిన అద్భుతమైన మేండేట్ (151 అసెంబ్లీ సీట్లు, 22ఎంపీ సీట్లు) బూడిదలో పోసిన పన్నీరైంది… ఈ నాలుగేళ్లలో ఏం సాధించారని ప్రశ్నిస్తే జీరోనే కాదు, అంతా మైనస్సే.. రివర్స్ పాలనలో అంతా తిరోగమనమే.. రావాలి-కావాలన్న వాళ్లే జన్మలో మళ్లీ వద్దేవద్దని ఘొల్లుమనేలా చేశారు. 4ఏళ్ల తర్వాత చూస్తే ‘‘నల్లబొగ్గులు-చిల్లపెంకులే’’… ఈ నాలుగేళ్లలో ఏపి నవ్వులపాలే..
డెవలప్ మెంట్ పూర్తిగా జీరో.. ప్రాజెక్టుల నిర్మాణం పడకేసింది..ఏ ప్రాజెక్టుల గురించైతే తన పాదయాత్రలో, ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టాడో, గొప్పలు చెప్పారో, అవేమీ చేయకుండా చేతులెత్తేశాడు, చతికిలబడ్డాడు. ‘‘మా నాన్న జలయజ్ఞం చేశాడు, ప్రాజెక్టులపై మా నాన్న ఎన్నో వేలకోట్లు ఖర్చు పెట్టాడు, చంద్రబాబు 9ఏళ్లు సీఎంగా హంద్రీనీవా కెంత పెట్టాడు, గాలేరు నగరి కెంత పెట్టాడని పెడబొబ్బలు పెట్టిన జగన్ ఇప్పుడీ 4ఏళ్లలో ప్రాజెక్టులపై ఎంత పెట్టాడో ఆయనే చెప్పాలి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా 5ఏళ్లలో(2014-19) రూ 65వేల కోట్లు ఖర్చుచేశాడు ప్రాజెక్టులపై, మరి జగన్ ఖర్చుచేసింది అందులో మూడోవంతు లేదు. ఏడాదికి చంద్రబాబు ప్రాజెక్టులపై రూ 15వేల కోట్లు ఖర్చుచేస్తే ఈయన రూ 5వేల కోట్లు పెట్టలేదు, ఇవన్నీ బడ్జెట్ రికార్డులు..42 ప్రాజెక్టులు పూర్తి చేస్తానన్న జగన్ ఈ 4ఏళ్లలో 2ప్రాజెక్టులు పూర్తిచేయలేదు..
పేదల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిగా పడకేయించాడు..4ఏళ్లలో పీఎం ఆవాస యోజన కింద కట్టింది 5ఇళ్లేనని పార్లమెంటులో కేంద్రం చెప్పింది. 4ఏళ్లలో కట్టింది 450ఇళ్లని ఇటీవల సీఎం జగన్ హవుసింగ్ సమీక్ష నివేదికను టిడిపి బైటపెట్టింది.. మొన్న ఉగాదికి 3లక్షల ఇళ్ల గృహ ప్రవేశాలుంటాయని చెప్పారు, ఉగాదెళ్లి 2నెలలైనా అతీగతీలేదు..చంద్రబాబు హయాంలో నిర్మాణం పూర్తయిన లక్షలాది టిడ్కో ఇళ్లను లబ్దిదారులకివ్వకుండా పాడుబెట్టి శిథిలావస్థకు చేర్చారంటే ఎంత సైకో మనస్తత్వమో..
రాష్ట్రంలో ప్రతి జిల్లాలో రోడ్లన్నీ గుంతలమయమే..నరకప్రాయంగా మారాయి. ఈ 4ఏళ్లలో ఒక్క రోడ్డు వేయడంగాని, గుంతలు పూడ్చడంపైగాని శ్రద్ధపెట్టలేదు. ఏపి రోడ్లను పొరుగు రాష్ట్రాల మంత్రులు ఎగతాళి చేసే దుస్థితి తెచ్చారు..
గత నాలుగేళ్లలే పేద, మధ్యతరగతి ప్రజలపై ‘‘బాదుడే బాదుడు’’…7సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు, ఆర్టీసి ఛార్జీలు పెంచారు, చెత్తపన్ను వేశారు, ఆస్తి పన్ను డబుల్ చేశారు, లక్ష కోట్ల భారం మోపారు.. ఫలితంగా ప్రజల్లో పొదుపుశక్తి తగ్గింది, కొనుగోలు శక్తి పడిపోయింది, సంపద చక్రం ధ్వంసమైంది, నిరుద్యోగం ప్రబలింది, పేదరికం పెరిగిపోయింది.
వాటాల కోసం బెదిరించి పరిశ్రమలను, కంపెనీలన్నీ పొరుగు రాష్ట్రాలకు పారిపోయేలా చేశారు.. తాజాగా అమరరాజా కంపెనీ విస్తరణ ప్రాజెక్టు తెలంగాణలో చేపట్టారు…రూ 10వేల కోట్ల పెట్టుబడి, వేలాది మందికి ఉపాధి పోయింది. మేమే అమరరాజా ను వెళ్లిపొమ్మన్నామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడం సిగ్గుచేటు..ఫాక్స్ కాన్ విస్తరణ ప్రాజెక్టు కూడా తెలంగాణకే వెళ్లింది.. అంతకుముందు కియా ఆగ్జిలరీ ఇండస్ట్రీస్ కూడా వెళ్లిపోయాయి, విశాఖ నుంచి ఫ్రాంక్లిన్ టెంపుల్ టన్ తరలిపోయింది, లులూ గ్రూప్ ను తరిమేశారు, హెచ్ ఎస్ బిసి వెళ్లిపోయింది,మిలీనియం టవర్స్ ను పాడుబెట్టారు. విశాఖలోనే 100 స్టార్టప్ లు మూతపడటం, ఈ నాలుగేళ్ల విధ్వంస పాలనకు ప్రత్యక్ష సాక్ష్యాలు..
జగన్మోహన్ రెడ్డి పాలన చూసి తెలంగాణ మంత్రుల ఎగతాళి, అవహేళనలు శోచనీయం…గతంలో ఏనాడైనా ఆంధ్రప్రదేశ్ గాని, ఏ ముఖ్యమంత్రిగాని ఈవిధంగా అవహేళనలకు గురైన పరిస్థితి ఉందా..? తెలంగాణ మంత్రి కేటిఆర్ మాట్లాడుతూ, ‘‘తెలంగాణలో అభివృద్ధి లేదనేవాళ్లను ఒకసారి మా ఊరికి తీసుకురండి, మా రోడ్లపై తిరిగాక, తిరిగి వెనక్కివచ్చాక వాళ్లే చెబుతారు తెలంగాణ ఎంత అభివృద్ధి చెందిందో’’ అని ఏపీకి చెందిన తన స్నేహితుడే చెప్పారన్న వ్యాఖ్యలు సిగ్గుచేటు..
మరో మంత్రి హరీశ్ రావుకూడా అదేరకంగా కామెంట్ చేశారు, ‘‘తిరుపతి వెళ్లినప్పుడు అనంతపురం రైతులను కదిలించా, కరెంటు ఎలా ఇస్తున్నారని అడిగితే, మూడు నాలుగు గంటలు కూడా ఇవ్వడం లేదని వాళ్లే చెప్పారని, రాష్ట్రం విడిపోతే తెలంగాణ చీకటి రాష్ట్రం అవుతుందన్నవాళ్ల బతుకులే చీకటయ్యాయని’’ ఎద్దేవా చేశాడు. ‘‘తెలంగాణలో టీచర్లకు 80% ఫిట్ మెంట్ ఇస్తే, ఆంధ్రాలో టీచర్లను లోపలేస్తున్నారని’’ కూడా అన్నారు.
ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ఎగతాళి చెప్పక్కర్లేదు. ‘‘గతంలో ఆంధ్రాలో ఎకరం అమ్మితే ఇక్కడ 4ఎకరాలు వచ్చేదని, ఇప్పుడిక్కడ ఎకరం అమ్మితే ఆంధ్రాలో 4ఎకరాలు వస్తదని’’ అన్నమాటలే ఆంధ్రప్రదేశ్ లో దిగజారిన అభివృద్ధికి సాక్ష్యాలు కాదా..?
నాలుగేళ్ల జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ మున్నెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో నవ్వులపాలైంది.. పొరుగు రాష్ట్రాల అవహేళనలకు గురైంది. దేశ విదేశాల్లో నగుబాటుకు గురైంది అనడానికి ఇంకింతకన్నా నిదర్శనాలు ఏం కావాలి..
ఈ 4ఏళ్లలోనే రూ 8లక్షల కోట్ల అప్పులు చేశారు, ఏడాదికి రూ 2లక్షల కోట్లు చొప్పున..గతంలో రెండున్నర లక్షల కోట్లు కలిపితే దాదాపు 11లక్షల కోట్ల అప్పుల్లో ఏపిని ముంచేశారు. ఒక్కో రైతుపై రెండున్నర లక్షల అప్పు ఉంది..తెలంగాణ కన్నా 5లక్షల రైతు కుటుంబాలెక్కువ ఏపిలో అప్పుల్లో కూరుకు పోయినవి(29లక్షల కుటుంబాలు). జాతీయ స్థాయి కన్నా ఏపిలో 231% ఎక్కువ తలసరి రైతు అప్పు ఉండటం గమనార్హం..
ఇక సంక్షేమం గురించి…వెల్ఫేర్ ఏదో ఓట్లు కురిపిస్తుందని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆశలు నిరాశలుగాక తప్పదు..రూ 2లక్షల కోట్లు పేదలకు సంక్షేమ పథకాల కింద ఇచ్చామని, డిబిటి నాన్ డిబిటి కలిపితే 2.30 లక్షల కోట్లని అన్నమాటలు బూమ్ రాంగ్ అయ్యాయి. ఇది మీరేమీ కొత్తగా చేసింది కాదే..సంక్షేమానికి పేటెంట్ మీరేమీ కాదే..సంక్షేమం ఇందిరాగాంధీ చేసింది, ఎన్టీఆర్ చేశాడు, చంద్రబాబు చేశాడు, రాజశేఖర్ రెడ్డి చేశాడు, మన్మోహన్ సింగ్ చేశాడు, ఇప్పుడు మోదీ-జగన్ చేస్తున్నారు. ఇదేమీ జగన్ ఒక్కడే కొత్తగా చేసిన వెల్పేర్ కాదు..పేదల సంక్షేమం ప్రభుత్వాల విధి అనేది ప్రజలందరికీ తెలిసిందే..వాళ్లేమీ వాళ్ల సొంత జేబుల్లోనుంచి ఇచ్చేవికాదని, ప్రజాధనమే ఇస్తున్నారనేది అందరికీ విదితమే..సంక్షేమానికి ఓట్లు రాల్తాయంటే అది జగన్ భ్రమే..వెల్ఫేర్ తోనే ఓట్లు పడితే చంద్రబాబు ఓడిపోడు మొన్న..దాదాపు రూ 20వేల కోట్ల ‘‘పసుపు-కుంకుమ’’ తీసుకున్న మహిళలు, రూ 2వేలు పెన్షన్ తీసుకున్న లక్షలాది లబ్దిదారులు ఓటేస్తే చంద్రబాబుగాని, తెలుగుదేశం పార్టీగాని ఓడిపోయేదా…? సంక్షేమం ఓట్లు కురిపిస్తది అనుకుంటే, ఎన్టీ ఆర్ ఓడిపోడు 1989లో..వైఎస్ రాజశేఖర రెడ్డే చెప్పాడు, తాను జస్ట్ పాస్ అయ్యానని 2009లో..అంటే బియాండ్ వెల్ఫేర్ ఇంకేదో ఉంది..ప్రజలు కోరేది ఇంకేదో ఉందనేది వైసిపి వాళ్లు తెలుసుకోవాలి. డెవలప్ మెంట్ కోరతారు, రోడ్లు కోరుకుంటారు, పరిశ్రమలు రావాలని కోరుకుంటారు, తమ పిల్లలకు ఉద్యోగాలు కోరుకుంటారు. అటు అభివృద్ధి, ఇటు సంక్షేమం పారలల్ గా నడవాలి..అంతేగాని ఇప్పుడీ జగన్ మార్క్ వెల్ఫేర్ ఓన్లీ సంక్షేమం వితౌట్ అభివృద్ధి అంటే నడవదు.
ఇక గతంలో లేనిది, ఇప్పుడీ 4ఏళ్లలో జడలు విరుచుకున్న భూతం ‘‘కక్ష సాధింపు’’..టిడిపిపై కక్ష సాధింపు, జనసేనపై కక్ష సాధింపు, కమ్యూనిస్టులపై కక్ష సాధింపు, కొత్తగా బిజెపిపై కూడా చూస్తున్నాం, మొన్నెక్కడో బిజెపి నాయకుడి తల డిఎస్పీ కాళ్ల మధ్య నలిగిపోయిందో చూశాం..బాలింత మహిళ కడుపులో బూటుకాలుతో పోలీసు తొక్కడం అమరావతిలో చూశాం..
చరిత్రలో చూడలేదు ఇంత నిర్బంధ కాండ..రాష్ట్ర ప్రజలు కనీవినీ ఎరుగనంత నిర్బంధ కాండ..ఎంతమందిపై తప్పుడు కేసులు, ఎన్నెన్ని అక్రమ నిర్బంధాలు..అమరావతి రైతులపై ఎన్ని కేసులు, మహిళలపై ఎంత నిర్బంధం..ఎంతమంది మాజీ మంత్రులను, మాజీ ఎమ్మెల్యేలను జైళ్లకు పంపారు. అచ్చెన్నాయుడు(83రోజులు), కొల్లు రవీంద్ర(54రోజులు), ధూళిపాళ నరేంద్ర, జెసి ప్రభాకర్ రెడ్డి, చింతమనేని ప్రభాకర్ లే కాకుండా అనేకమంది నాయకులు, కార్యకర్తలను అక్రమ నిర్బంధాలకు గురిచేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కాన్వాయ్ ను ముందుకెళ్లనీకుండా అనపర్తిలో పోలీసులే బైఠాయించడం చూశాం.. ఉండవల్లిలో చంద్రబాబు నివసించే ఇంటికి నోటీసులు అంటించడం, ఆయన్ను బైటకు రానీకుండా గేట్లకు తాళ్లు కట్టడం, విశాఖలో పవన్ కల్యాణ్ ను హోటల్ నుంచి బైటకు రానీకుండా, కనీసం కారులోనుంచి ప్రజలకు అభివాదం చేయనీకుండా ఎలా నిర్బంధించారో రాష్ట్రం మొత్తం చూసింది..
బీసి, ఎస్సీ, ఎస్టీ ముస్లిం మైనార్టీ వర్గాల ప్రజలపై గత నాలుగేళ్లలో జరిగినంత హింసా విధ్వంసాలు, దమనకాండ చరిత్రలో చూడలేదు. విశాఖలో దళిత వైద్యుడు సుధాకర్ ను పెడరెక్కలు విరిచికట్టి నడిరోడ్డులో లాఠీలతో కొట్టి చిత్రహింసలు పెట్టి ఆయన మరణానికి కారకులయ్యారు. కడపలో దళిత వెటర్నరీ వైద్యుడు అచ్చెన్నను హత్యచేశారు. చిత్తూరు డాక్టర్ అనితారాణికి వేధింపులతో మానసిక క్షోభ పెట్టారు. జడ్జి రామకృష్ణను, ఆయన కుటుంబసభ్యులపై, జడ శ్రావణ్ కుమార్ పై తప్పుడు కేసులు పెట్టి చిత్రహింసలు పెట్టారు. వరప్రసాద్, శ్రీకాంత్ ల శిరోముండనాలు దళితులపై దమనకాండకు అద్దంపట్టాయి..4ఏళ్లలో 26మంది బీసిలను హత్యచేశారు, 2600మందిపై తప్పుడు కేసులు పెట్టారు. ఇక ముస్లిం మైనార్టీలపై హింసా విధ్వంసాలు అన్నీఇన్నీ కావు. నంద్యాలలో అబ్దుల్ సలామ్ కుటుంబాన్ని చిత్రహింసలు పెట్టి సామూహిక ఆత్మహత్యలకు పాల్పడేలా చేశారు. అబ్దుల్ సత్తార్, ముస్లిం బాలిక మిస్బా ప్రాణాలు బలితీసుకున్నారు. పల్నాడులో ఆత్మకూరులో బీసిలను, పిన్నెల్లిలో వందలాది ముస్లిం కుటుంబాలను గ్రామ బహిష్కారం చేస్తే చంద్రబాబు స్పందించి వారికోసం గుంటూరులో వైసిపి బాధిత పునరావాస శిబిరం నెలరోజులపాటు నడపడం తెలిసిందే..
ఇక కూల్చివేతలు-విధ్వంసాలు లెక్కేలేదు..ప్రజావేదిక ధ్వంసంతో మొదలైన విధ్వంసకాండ ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమలో అన్నిజిల్లాల్లో యధేచ్ఛగా కొనసాగించారు..జనసేన సభకు 52ఎకరాల భూమి ఇచ్చారని, గుంటూరు జిల్లా ఇప్పటంలో 52ఇళ్లు కూల్చేశారు.. విశాఖలో అయ్యన్న పాత్రుడు, గీతం వర్సిటీ భవనాలు ప్రహరీగోడల కూల్చివేతలు,నెల్లూరులో ముస్లింల ఇళ్ల కూల్చివేతలు, పల్నాడు, రాయలసీమలో తోటల నరికివేతలు, బోర్ల విధ్వంసం నాలుగేళ్ల జగన్ పాలన విధ్వంసకాండలో మచ్చుకు కొన్నే..
ఈ దురాగతాలన్నీ కళ్లకు కట్టినట్లు ప్రజల కళ్ల ముందే ఉంది ..రేపటి ఓట్లను ఇవన్నీ ప్రభావితం చేస్తాయి..వీటన్నింటినీ దాటుకుని జగన్ కు వెల్ఫేర్ స్కీముల ఓట్లు రాల్చాలంటే కష్టమే మరి.. ఎందుకంటే ఆ స్కీముల్లో కూడా స్కాముల ఆరోపణలే ఎక్కువ.
ఉదాహరణకి జగనన్న ఇళ్ల కాలనీలే..ఎకరం రూ 5లక్షలు చేయనిది రూ 50లక్షలకు కొనిపించి, వైసిపి నాయకులు, అధికారులు వాటాలు వేసుకుని పంచుకోవడం వివాదాస్పదమైంది. ప్రతి నియోజకవర్గంలో రూ 100కోట్ల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా రూ 30వేల కోట్ల కుంభకోణం ఇళ్ల స్థలాల పంపిణీలోనే జరిగిందనే ఆరోపణలున్నాయి. పల్లపు భూముల్లో ముంపు ప్రాంతాల్లో ఇళ్ల స్థలాల మెరకకు, చదునుకు మరో రూ 5వేల కోట్ల స్కామ్ లకు పాల్పడ్డారు. ఈ ముంపు భూముల్లో విష సర్పాల మధ్య, ఏవిధమైన మౌలికవసతుల్లేని చోట జగనన్న కాలనీల్లో కట్టే ఇళ్లంటేనే లబ్దిదారులు బేజారెత్తిపోయే స్థితి..
ఇక జగన్ నమ్మకం, జగన్ భవిష్యత్తు వలంటీర్లే.. ఆ 2లక్షల మంది సైన్యాన్ని అడ్డంపెట్టుకుని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు రావనే బెదిరింపులతో ఓటర్లను బ్లాక్ మెయిల్ చేసి ఓట్లను దండుకోవాలనే పథకానికి రంగం సిద్ధం చేశారు..అందుకే వాళ్లను కూడా మీరు జీతం చూసుకోబాకండి, మిమ్మల్ని నాయకుల్ని చేస్తా అని ప్రలోభపెట్టడం గమనార్హం..ఈ వ్యవస్థ లేనప్పుడు పేదలకు సంక్షేమ పథకాలు అందలేదా..? ఉన్న వ్యవస్థలను ధ్వంసంచేసి కొత్తగా తెచ్చిన వలంటీర్ల వ్యవస్థతో ప్రజలకు ఒనగూడిందేమి ఉంది, ఇదొక నిరర్ధక వనరు అనే వాదనా ఉంది..వాళ్లకిచ్చే జీతం రూ 5వేలంటే రోజుకు రూ 166, ఉపాధి హామీ కూలీకి ఇంకా ఎక్కువ వస్తుందనే అసంతృప్తి వలంటర్లలో కూడా నెలకొంది..
ఇక ప్రచారం సంగతి…పార్టీ రంగులకు, పత్రికల్లో యాడ్స్ కు ఎన్ని వందలకోట్లు వేలకోట్లు తగలేశారు..? ఫీజులు ఏడాదికి 4సార్లు ఇస్తున్నారు, ప్రతి క్వార్టర్ కు ఫుల్ పేజీ యాడేనా..? లాయర్ నేస్తం స్కీమ్ బడ్జెట్ రూ 3కోట్లట, దాని యాడ్ రూ 3కోట్లట.. పావలా కోడికి ముప్పావలా మసాలా అంటే ఇదే..సొంత మీడియా సాక్షికి ఈ 4ఏళ్లలోనే వేల కోట్ల యాడ్స్ ఇచ్చి ప్రజాధనం దుర్వినియోగం చేశారు. ఇక ఏ రెండు కేసులైతే తెలుగుదేశంపైకి నెట్టి సానుభూతి ఓటుతో గద్దెనెక్కారో అదే వివేకా హత్య కేసు, కోడికత్తి కేసు ఇప్పుడు జగన్మోహన రెడ్డి మెడకే కాదు, మొత్తం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మెడకే చుట్టుకుని ఊపిరాడకుండా చేస్తున్నాయి..చెరపకురా చెడేవు అంది అందుకే..రాష్ట్రాన్ని మళ్లీ బాగుచేయడానికి వీల్లేనంతగా ఈ నాలుగేళ్ల వైసిపి పాలనలో అధోగతి పాల్జేసిన పాపం జగన్మోహన్ రెడ్డిని వెంటబడి తరమడం తథ్యం. ఎప్పుడుప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ ను బంగాళాఖాతంలో కలుపుదామా అని బాధిత ప్రజానీకం ఎదురుచూస్తోంది.
బిగ్ బ్రేకింగ్.. లోకేష్ అరెస్ట్ పై ఫుల్ అప్డేట్..!
కాకరేపుతున్న అక్రమ కేసులు..! తెలుగు దేశంపార్టీ అధినేత నారా చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్...