కూటమి ప్రభుత్వ హయాంలో అత్యంత పారదర్శకంగా భర్తీ చేసిన మెగా DSC నియామకాలను వివాదాస్పదం చేయాలని చూస్తున్న వైసీపీ అధినేత జగన్‌కు క్రీడాకారులు గట్టిగా బుద్ధి చెప్పారు. తాము ఎలాంటి సిఫార్సులు లేకుండా, కేవలం ప్రతిభతోనే ఉద్యోగాలు సాధించామని విజయవాడ వేదికగా సర్టిఫికెట్లను మీడియా ముందు ప్రదర్శించి మరీ నిరూపించారు. మైదానంలో చెమటోడ్చి, దేశం కోసం పతకాలు సాధించిన తమను ఫేక్ అంటూ జగన్ పార్టీ నేతలు అవమానించడంపై అభ్యర్థులు కన్నీళ్లు పెట్టుకున్నారు.
అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన బ్రిడ్జ్ లాంటి ఆటలను కూడా పేకాటగా చిత్రీకరిస్తూ, ఖోఖోపై కనీస జ్ఞానం లేని వారు సైతం DSC నియామకాలపై బురద చల్లుతుండటం వైసీపీ నేతల అజ్ఞానానికి పరాకాష్ట. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను సైతం వదులుకుని, బోధనపై మక్కువతో టీచర్లుగా చేరిన క్రీడాకారుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా జగన్ అండ్ కో చేస్తున్న ఫేక్ ప్రచారాలను నిరుద్యోగ యువత అసహ్యించుకుంటోంది. గత ఐదేళ్ల పాలనలో నిరుద్యోగులను గాలికొదిలేసిన జగన్..ఇప్పుడు మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో పారదర్శకంగా జరుగుతున్న నియామకాలను చూసి ఓర్వలేకపోతున్నారని, అందుకే ఇలాంటి చీప్ ట్రిక్స్‌కు తెరలేపారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
స్పోర్ట్స్ సర్టిఫికెట్లు అన్నీ ఆన్లైన్లో పారదర్శకంగా అందుబాటులో ఉన్నా..రాజకీయ లబ్ధి కోసమే కష్టపడి పైకొచ్చిన పేద యువతను మానసిక వేదనకు గురిచేస్తున్న వైసీపీ నేతల తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. జగన్ చేస్తున్న ఈ కుట్రపూరిత డ్రామాలను కనీసం ఆ పార్టీ కార్యకర్తలు కూడా నమ్మడం లేదని స్పష్టమవుతోంది. స్వార్థ రాజకీయాల కోసం క్రీడాకారుల త్యాగాలను అవమానిస్తున్న జగన్‌కు, ఆయన బ్యాచ్‌కు రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రజలతో పాటు యావత్ క్రీడా లోకం తగిన రీతిలో బుద్ధి చెప్పడం ఖాయం.











