టీవీ నటి శ్రావణి కేసులో ఇంకా మూడు ముక్కలాట కొనసాగుతూనే ఉంది. ఈ కేసు దర్యప్తు కొనసాగించిన పోలీసులు మొదట ఏ1 గా సాయికృష్ణ పేరును, ఏ2గా దేవరాజ్ పేరును ప్రకటించారు. అప్పటికి దొరకని అశోక్ రెడ్డిని మాత్రం ఏ 3లో జాబితాలో చేర్చారు. ఆ తర్వాత మళ్లీ ఈ పేర్లు తారుమారయ్యాయి. ఏ 2 స్థానంలో ఉన్న దేవరాజ్ ఏ1గా మారాడు. ఏ1 సాయికృష్ణ ఏ2గా సర్ధుకున్నాడు. తాజాగా ఏ2 స్థానంలో అశోక్ రెడ్డి చేరి దేవరాజ్ ఏ3 స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత మళ్లీ ఈ కేసులో రోజుకో కొత్త విషయం బయటపడుతోంది.
దాంతో ఈ నెంబర్లు అటూ ఇటూ మారే అవకాశం కనిపిస్తోంది. నిర్మాత అశోక్ రెడ్డి ఏ1గా చేరే అవకాశం కూడా లేకపోలేదు. కేసు పురోగతి సాగుతున్నప్పుడల్లా ఈ నంబర్లు మారుతున్నాయి. మొత్తం 17 మంది సాక్షుల్ని విచారించాక పోలీసులు ఈ కేసు విషయంలో ఒక అవగాహనకు వచ్చారు. అశోక్ రెడ్డిని కూడా విచారించిన తర్వాత పోలీసుకు ఈ కేసులో స్పష్టత ఏర్పడింది. కేసు దర్యాప్తును పరిశీలిస్తే అర్థమవుతున్నది ఏమిటంటే సాయికృష్ణ, అశోక్ రెడ్డిల మధ్య దేవరాజ్ ప్రవేశించడంతో కలతలు ప్రారంభమయ్యాయి.
ఈ మూడో వ్యక్తి ప్రమేయాన్ని మిగిలిన ఇద్దరూ జీర్ణించుకోలేకపోయారు. అశోక్ రెడ్డికి 2017 నుంచి శ్రావణితో పరిచయం ఉంది. ఆమెకు ఆర్.ఎక్స్. 100 చిత్రంలో ఓ గెస్ట్ రోల్ కూడా ఇచ్చారు. ముగ్గురితోనూ శ్రావణికి సంబంధ బాంధవ్యాలు కొనసాగినా ఆమె చివరికి దేవరాజ్ ను మాత్రమే ఇష్టపడి నట్లు కాల్ రికార్డింగులు స్పష్టంచేస్తున్నాయి. కాకపోతే తనను ఆర్థికంగా ఆదుకున్నారన్న కృతజ్ఞత అశోక్ రెడ్డి విషయంలో ఉంది. ముఖ్యంగా శ్రావణి కుటుంబ సభ్యులు కూడా సాయికృష్ణ, అశోక్ రెడ్డిలను వెనకేసుకు వస్తున్నారు.
అందరికీ దేవరాజ్ శత్రువయ్యాడు. అతనిపై బురదజల్లే ప్రయత్నం మాత్రం బాగా జరిగింది. దేవరాజ్ ను మాత్రం అతని కాల్ రికార్డింగులే కొంతవరకు రక్షించాయని అనుకోవాల్సి వస్తోంది. శ్రావణి ఆర్థిక పరిస్థితులను అడ్డంపెట్టుకుని అశోక్ రెడ్డి వేధించేవాడని తెలుస్తోంది. ఆమె చనిపోవడానికి గంటముందు కూడా అశోక్ రెడ్డి ఆమె ఇంటికి వచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. తనను తప్ప ఎవరిని వివాహం చేసుకున్నా ఊరుకునేది లేదని అతను హెచ్చిరించినట్లుగా కూడా చెబుతున్నారు.
సాయి, అశోక్ రెడ్డి వేధింపులను శ్రావణి దేవరాజ్ కు చెప్పడం, అతను ఆమె కాల్స్ ను రికార్డు చేయడం వల్ల అంతా దొరికిపోవాల్సి వచ్చింది. మొత్తానికి ఈ మూడు ముక్కలాట చివరికి శ్రావణిని బలితీసుకుంది. ఇలాంటి కేసుల దర్యాప్తును పరిశీలిస్తే అర్థమవుతున్నదేమిటంటే ఏ పోలీస్ కేసో, మరణమో సంబవించినప్పుడు మాత్రమే ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. లేకుంటే ఇలాంటి మరెన్నో ఘటనలు చీకటిమాటునే ఉంటున్నాయి. దొరికితే అందరూ దొంగలే… దొరకనంత వరకూ దొరలుగానే చెలామణి అవుతుంటారు.











