ప్రజాగ్రహానికి శ్రీలంక ప్రధాని మహింద రాజపక్సే తలవంచక తప్పలేదు. ప్రధాని పదవికి ఆయన రాజీనామా చేశారు.గత కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా పెద్దఎత్తున నిరసనలు కొనసాగుతుండగా, రాజపక్సే పదవి నుండి తప్పుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తూ వచ్చాయి. విపక్షాల నిరసనాలతో రాజపక్సే ఎట్టకేలకు రాజీనామా చేశారు. ఆయనతో పాటు మరో ఆరుగురు మంత్రులు కూడా తమ పదవులకు రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది. ప్రధాని సహా ఆరుగురు మంత్రులు రాజీనామాతో శ్రీలంకలో జరుగుతున్న అపరిణామాలపై ఉత్కంఠ నెలకొంది.
రాజీనామా పై రాజపక్సే స్పందించారు. శ్రీలంక ప్రజలు తీవ్రమైన భావోద్వేగంతో ఉన్నారని ఆయన అన్నారు. దేశంలో నెలకొన్న ఆర్ధిక సంక్షోభానికి త్వరలోనే పరిష్కారం లాభిస్తుందంటూ ఆయన చెప్పుకొచ్చారు. ప్రజలు సంయమనం పాటించాలని ఆయన సూచించారు. హింసతో సాధించేది ఏమీ లేదని ఆయన తెలిపారు. ఇక రాజపక్సే రాజీనామా తర్వాత అధ్యక్ష భవనం వద్ద ఉద్రిక్తత నెలకొంది.
కాగా, స్వాతంత్ర్యం తర్వాత శ్రీలంక తొలిసారి తీవ్రమైన ఆర్థిక, ఆహార సంక్షోభంలో మునిగిపోయిన సంగతి తెలిసిందే. సుమారు రెండు నెలలుగా ఆ దేశం అత్యంత దారుణమైన పరిస్థితిని ఎదుర్కుంటోంది. 45 ఏళ్ళ తర్వాత తొలిసారి దేశంలో ఎమర్జెన్సీ విధనచాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితికి దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్సే, ఆయన సోదరుడు, ప్రధాని మహింద రాజపక్సేనే కారణమని శ్రీలంక ప్రజలు కొన్ని రోజులుగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. దేశానికి పూర్వ వైభవం రావాలంటే రాజపక్సే కుటుంబం పూర్తిగా రాజకీయాల నుంచి వైద్యలగాలని డిమాండ్ చేస్తూ దేశ ప్రజలు, విపక్షాలు నిరసనలు, ముఖ్యంగా కొలంబో వేదికగా జరిగిన ఆందోళనలతోనే రాజపక్సే రాజానామా నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.
రోజురోజుకీ ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపడుతున్నారు. సైన్యం రంగంలోకి దిగినప్పటికీ వారు లెక్క చేయలేదు. అధ్యక్షుడు, ప్రధాని అధికార నివాసాలపై దాడి చేసేందుకు కూడా ప్రయత్నించారు. ఈ క్రమంలో చాలా చోట్ల ఆందోళనలు హింసాత్మక రూపు దాల్చాయి. వీటిని కట్టడి చేయడానికి దేశ రాజధాని కొలంబోలో ఈరోజు కర్ఫ్యూ కూడా విధించారు.పోలీసుల కాల్పులలో దాదాపు 40 మంది గాయపడిన పరిస్థితి నెలకొన్నప్పటికీ దేశ ప్రజలు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. చివరకు విధిలేని పరిస్థితుల్లో ప్రధాని మహింద రాజపక్సే కీలక నిర్ణయం తీసుకున్నారు. తన పదవికి రాజీనామా చేశారు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం దేశంలో నెలకొన్న సంక్షోభంతో అధ్యక్ష పదవిని అదిరోహించేందుకు విపక్షాలు సైతం విముఖత వ్యక్తమవుతున్న పరిస్థితి శ్రీలంకలో నెలకొంది. ఒకవైపు ఆర్ధిక మరోవైపు ఆహార సంక్షోభంతో పాటు దేశ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరుణంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అనేది కత్తిమీద సామూలానే కనిపిస్తోందనేది పరిశీలకుల భావన. మరి ఈ పరిణామాలతో అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే కొత్త ప్రభుత్వం ఏర్పాటు పిలుపునిస్తారా ? లేక పరిస్థితులు సరదుమనిగే వరకు కొంతకాలం ఇలానే కొనసాగించి మళ్ళీ మహిందా రాజపక్సేనే ప్రధాని గా కొనసాగిస్తారా అనేది మాత్రం వేచి చూడాలి.