పురాణ పురుషుడు శ్రీరామచంద్రుడు పాన్ ఇండియా పాత్రధారిగా మారాడు. ఓ పక్క అయోధ్యలో శ్రీరామ జన్మభూమికి శంకుస్థాపన జరగడం, మరో పక్క ఇదే శ్రీరాముడిపై బాలీవుడ్ లో రెండు భారీ ప్రాజెక్టులు తెరపైకి రావడం కాకతాళీయమే అయినా ఇప్పుడు అందరి దృష్టీ శ్రీరామచంద్రుడిపైనే ఉంది. ఎందరికో ఆదర్శనీయమైన శ్రీరాముడి పాత్ర ద్వారానే మన నందమూరి తారకరామారావు ప్రజలకు ఆరాధ్య దైవంగా మారారు అనే సంగతి అందరికీ తెలుసు. శ్రీరాముడి పాత్రకున్న ప్రత్యేకతే వేరు. ఓ స్వచ్చత, ఓ సచ్చీలత, ఓ శాంత గుణం… వెరసి శ్రీరామచంద్రుడి పాత్ర. ఆ పాత్ర పోషించాలంటే మామూలు విషయం కాదు. నటుడి నటనా కౌశలం ఎలాంటిదో ఈ పాత్రధారణతోనే తెలుస్తుంది. మాస్ ఇమేజ్ ఉన్న పాత్ర ధరించడం వేరు… క్లాస్ గా సాగిపోయే సౌమ్యమైన పాత్రధారణ వేరు.
ఏమిటి రామాయణం ప్రత్యేకత?
మనిషి ఎలా బతకాలో రామాయణం నేర్పితే, మనిషి ఎలా జీవించకూడదో మహాభారతం మనకు నేర్పింది. అయనం అంటే అర్థం ప్రయాణం. రామాయణం అంటే రాముడి ప్రయాణం. రాముడు మంచి బాలుడు అనే మాటను మనం తరచూ వింటుూ ఉంటాం. మన శ్రీరామచంద్రుడు కూడా అలాంటివాడే. కానీ చెడుపై యుద్ధాన్ని ప్రకటించాల్సి వస్తే వెనుకాడడు. ధీరోదాత్తమైన పాత్ర శ్రీరాముడిది. రామో విగ్రహవాన్ ధర్మహ: అన్న ఆర్యోక్తి శత్రువు సైతంరాముడి గొప్పతనాన్ని తెలిపేవే. రామరాజ్యం అనే మాటను మనం ఎన్నోసార్లు విన్నాం… కానీ ఇంతవరకూ చూడలేదు. ఎక్కడ చూసినా మనకు రావణ రాజ్యాలే కనిపిస్తాయి. రావణుడు కూడా గొప్పవాడే. కానీ చూసే దృష్టికోణం వేరు. వెలుగు వెనక చీకటి ఉన్నట్లే… చీకటి తర్వాత వెలుగూ ఉంటుంది. ఈ ద్వంద్వాలు సృష్టిధర్మం.
శ్రీరాముడి వెలుగుకు వేదిక మన తెలుగు సినిమానే
తెర మీద శ్రీరాముడు వెలిగిన మన తెలుగు నాటే జరిగింది. శ్రీరాముడి కథతో వచ్చిన తొలి సినిమా ‘శ్రీరామ పాదుకా పట్టాభిషేకం’. 1932లో ఈ సినిమా విడుదలైంది. ఇందులో శ్రీరాముడిగా యడవల్లి సూర్యనారాయణ తొలిసారిగా రాముడి పాత్రను పోషించారు. ఆ తర్వాత మరికొందరు నటులు ఈ పాత్రను పోషించినా శ్రీరాముడంటే ఎన్టీఆరే అనుకునేలా ఆయన పాత్రధారణ జరిగింది. శ్రీరాముడి పాత్రను ఏ మేరకు నటించాలో అంతగా నటించి అద్భుతం అనిపించారు స్వర్గీయ ఎన్టీఆర్. సీతా వియోగంతో బాధపడినప్పుడు విషాదాన్ని, రావణ సంహారంలో కోపాన్ని, మహారాజుగా శాంతాన్ని… ఇలా నవరసాలనూ మేళవించి శ్రీరాముడి పాత్రకు ప్రాణంపోశారు. ఎన్నిసార్లు చూసినా తనివితీరని కథ రామకథ.
ఎన్టీఆర్ తొలిసారిగా‘సంపూర్ణ రామాయణం’, ‘శ్రీరామ పట్టాభిషేకం’, ‘రామాంజనేయం యుద్ధం’ తదితర సినిమాల్లో నటించారు. ఎన్టీఆర్ కన్నా ముందు అక్కినేని నాగేశ్వరరావు కూడా శ్రీరాముడి పాత్రతోనే సినిమా రంగ ప్రవేశం చేశారు. కాకపోతే పౌరాణిక పాత్రల మీద ఆయన అంతగా దృష్టి పెట్టలేదు. ఎన్టీఆర్ తర్వాత అంతగా రాముడి పాత్రలో మెప్పించిన నటుడు హరనాథ్. ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన ‘సీతారామకళ్యాణం’ సినిమాతో పాటు ‘శ్రీరామకథ’ అనే చిత్రంలో హరనాథ్ శ్రీరాముడిగా నటించి మెప్పించాడు. దాంతో ఈ పాత్రను పోషించాలంటే ఎన్టీఆర్, హరనాథ్, ఆ తర్వాత శోభన్ బాబుల పేర్లు వినవస్తాయి. శోభన్ బాబును శ్రీరాముడిగా బాపు దర్శకత్వంలో వచ్చిన ‘సంపూర్ణరామాయణం’ సినిమా ఆ పాత్రను చక్కగా ఆవిష్కరించింది. ఇదే తరహాలో శ్రీరాముడి పాత్రను మరికొందరు కూడా పోషించారు. ‘శ్రీరామదాసు’ సినిమాలో సుమన్ ఈ పాత్రను పోషించారు.
‘దేవుళ్లు’ సినిమాలో శ్రీరాముడిగా శ్రీకాంత్ నటించారు. బాలయ్యబాబు ‘శ్రీరామరాజ్యం’లో నటించి మెప్పించారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ తెరంగేట్రమే ‘బాల రామాయణం’ తో జరిగింది. ఒక విధంగా ఇది ఆ కుటుంబానికి కలిసి వచ్చిన పాత్ర అని చెప్పాలి. రాముడు అనే పేరుతో వచ్చిన ఎన్టీఆర్ సినిమాలు అనేకం బ్లాక్ బస్టర్ హిట్లు సాధించాయి. ఇక టీవీ సీరియల్ లో ఈ పాత్రను అరుణ్ గోవిల్ పోషించి మెప్పించారు. ఇంతటి ప్రాముఖ్యం ఉన్న ఈ పాత్ర ఇప్పుడు ప్రభాస్ చెంతకు చేరింది. ఇప్పుడు వారి సరసన ప్రభాస్ చేరబోతున్నారు. ఒక విధంగా ఈ పాత్ర పోషణ ప్రభాస్ కు కత్తిమీద సామే. మాస్ లుక్ లో కనిపించే ప్రభాస్ తన బాడీలాంగ్వేజ్ ను పూర్తిగా మార్చేసుకోవలసి ఉంటుంది. ప్రభాస్ ఖాతాలో ఓ మంచి సినిమా పడినట్లుగానే భావించాలి.