ఏపీ రాజకీయాల్లో వైసీపీ పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు రాష్ట్రవ్యాప్తంగా పార్టీకి క్షేత్రస్థాయిలో పూర్తి నెగెటివిటీ చుట్టుముట్టింది. రాబోయే స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఏ ఒక్క నాయకుడు, కార్యకర్త కూడా ముందుకు రావడం లేదు. పార్టీలో అభ్యర్థుల తీవ్ర కొరత ఏర్పడటంతో ఫ్యాన్ పార్టీ హైకమాండ్‌కు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి తయారైంది.
రాష్ట్రంలో బలమైన కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటం, సీఎం చంద్రబాబు నాయుడు చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జోరుగా సాగుతుండటంతో ప్రజల్లో మంచి స్పందన వస్తోంది. మరోవైపు అమరావతి రాజధాని నిర్మాణం, మౌలిక వసతుల కల్పన, సంక్షేమ పథకాల అమలుతో కూటమి సర్కార్ దూసుకెళ్తోంది. ఈ దూకుడును తట్టుకోవడం తమవల్ల కాదని, ఈ పరిస్థితుల్లో బరిలోకి దిగితే ఘోర పరాభవం తప్పదని వైసీపీ కేడర్ భావిస్తోంది.
ఎలాగూ గెలవం..అనవసరంగా డబ్బులు ఖర్చు చేయడం ఎందుకనే నిరాశ నిస్పృహల్లో వైసీపీ నేతలు కూరుకుపోయారు. గతంలో పార్టీని అంటిపెట్టుకుని ఉన్న బలమైన నేతలు సైతం ఇప్పుడు ఎన్నికల ఖర్చులకు భయపడి పక్కచూపులు చూస్తున్నారు. ఎన్నికల బరిలో నిలిచి ఆర్థికంగా నష్టపోవడంతో పాటు కేసులు మూటగట్టుకోవడం ఎందుకని నాయకులు అంతర్మథనం చెందుతున్నారు. పార్టీ అధిష్టానం ఎన్ని ప్రయత్నాలు చేసినా, స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు కరవై ఎవరూ ముందుకు రాకపోవడం వైసీపీ దుస్థితికి అద్దం పడుతోంది.
మొత్తానికి, నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం, కేడర్ నైతిక స్థైర్యం పూర్తిగా కోల్పోవడం, కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో పెరుగుతున్న నమ్మకం వంటి పరిణామాలు వైసీపీని కింది స్థాయి నుంచి కోలుకోలేని విధంగా దెబ్బతీస్తున్నాయి. శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా కనీసం పోటీ ఇచ్చే నాథుడు కూడా లేక పార్టీ అడ్రస్ గల్లంతయ్యే స్థితికి చేరిందని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.











