ఫ్యామిలీ ఎమోషన్స్ కి ప్రాధాన్యతనిస్తూ కుటుంబ కథాచిత్రాలను రూపొందించే దర్శకుల జాబితాలో శ్రీకాంత్ అడ్డాల ఒకరుగా కనిపిస్తాడు. లవ్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కి పెద్దపీట వేస్తూ కథాకథనాలను నడిపించడంలో ఆయనకి మంచి అనుభవం ఉంది. ఆయన తొలి ప్రయత్నంగా వచ్చిన ‘కొత్త బంగారు లోకం‘ ప్రేమకథా చిత్రాల పరంగా కొత్త ట్రెండ్ ను సృష్టించింది. ఈ సినిమా ప్రభావం నుంచి బయటపడటానికి యూత్ కి చాలాకాలమే పట్టింది. ఈ సినిమా సాధించిన విజయంతో ఒక్కసారిగా శ్రీకాంత్ అడ్డాల చాలామంది దృష్టిలో పడ్డాడు. ఆయన దర్శకత్వంలో చేయడానికి పెద్ద హీరోలు సైతం ఉత్సాహాన్ని కనబరిచారు.
శ్రీకాంత్ అడ్డాల నుంచి రెండవ సినిమాగా ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు‘ వచ్చింది. వెంకటేశ్ .. మహేశ్ బాబు .. ప్రకాశ్ రాజ్ .. జయసుధ .. సమంత .. ఇలా పెద్ద పెద్ద ఆర్టిస్టులతో ఆయన ఈ కథను నడిపించాడు. కుటుంబాలు .. బంధాలు .. అనుబంధాలు .. నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తరువాత వరుణ్ తేజ్ కథానాయకుడిగా ఆయన ‘ముకుంద’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. అయితే ఈ సినిమా యూత్ ను ఓ మాదిరిగా మాత్రమే ప్రేక్షకులను ఆకట్టుకోగలిగింది. గతంలో శ్రీకాంత్ అడ్డాలతో ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ చేసిన మహేశ్ బాబు, మరోసారి ఆయనకి అవకాశం ఇచ్చాడు.
అలా వాళ్ల కాంబినేషన్లో ‘బ్రహ్మోత్సవం’ రూపొందింది. శ్రీకాంత్ అడ్డాలపై .. ఈ కథపై నమ్మకంతో మహేశ్ బాబు కూడా ఒక నిర్మాతగా వ్యవహరించడం విశేషం. సత్యరాజ్ .. జయసుధ .. రేవతి లాంటి సీనియర్ ఆర్టిస్టులు, కాజల్ .. సమంత .. ప్రణీత వంటి గ్లామరస్ నాయికలు ఉన్నప్పటికీ ఈ సినిమా భారీ పరాజయం పాలైంది. పేరున్న ఆర్టిస్టులతో తెర అంతా నింపేశాడుగానీ, కాగడా పట్టుకుని వెతికినా కథ కనిపించలేదనే విమర్శలు వచ్చాయి. ఆ ఫ్లాఫ్ ప్రభావం ఆయన కెరియర్ పై బాగానే పడింది. ఫలితంగా నాలుగేళ్లకు పైగా గ్యాప్ వచ్చేసింది.
ప్రస్తుతం వెంకటేశ్ కథానాయకుడిగాశ్రీకాంత్ అడ్డాల ‘నారప్ప‘ సినిమా చేస్తున్నాడు. సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందుతోంది. తమిళంలో ధనుశ్ చేసిన ‘అసురన్’ హిట్ కొట్టడంతో, ఆ కథను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. వెంకటేశ్ కెరియర్లో చెప్పుకోదగిన పాత్రల సరసన ‘నారప్ప’ కూడా చేరుతుందని అంటున్నారు. ఇప్పుడు ఈ కథపైనే శ్రీకాంత్ అడ్డాల నమ్మకం పెట్టుకున్నాడు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందని భావిస్తున్నాడు. ఆ దిశగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వెళుతున్నాడు. ఈ సినిమాతో శ్రీకాంత్ అడ్డాల కెరియర్ మళ్లీ పుంజుకుంటుందేమో చూడాలి.
Must Read ;- టీజర్ టాక్ : ఆవేశంతో గర్జించిన ‘నారప్ప’