శ్రీశైలం మల్లన్నకు తాకిన కరోనా సెగ..!
ఏపీ వ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసుల ప్రభావం శ్రీశైలం మల్లన్నపై కూడా పడింది! కేసులు రోజురోజుకు విజృంభించడంతో స్వామివారి స్పర్శ దర్శనాన్ని రద్దు చేస్తున్నట్లు దేవస్థానం ఈవో ఎన్ లవన్న తెలిపారు. అలానే అమ్మవారి అంతరాలయ దర్శనాలు, స్వామి వారి గర్భాలయ అభిషేకాలు కూడా నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ఆన్ లైన్ ద్వారా టికెట్లు పొందిన వారు .. స్వామి వారి సేవలు పున:ప్రారంభమైన తరువాత వినియోగించుకోవాలని సూచించారు. సోమవారం నుంచి స్వామి వారి లఘు దర్శనాలకు మాత్రమే అనుమతిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అంతేకాక స్వామి వారి శఠారి, తీర్థం, ఉచిత ప్రసాద వితరణ, వేదాశీర్వచనం వంటివి తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు చెప్పారు. దర్శనానికి గంటకు కేవలం 1,000 మందని మాత్రమే అనుమతిస్తున్నట్లు పేర్కొన్నారు. పరిమిత సంఖ్యలో మాత్రమే ఆర్జిత సేవలకు అనుమతిస్తామని చెప్పారు. దర్శనం బుకింగ్ లో వ్యాక్సినేషన్ పత్రం తప్పనిసరి చేస్తామన్నారు. భక్తులు అన్నప్రసాదాలు వితరణ, పాతాళ గంగలో స్నానాలు, రోప్ వే, బోటింగ్ వంటివి కూడా నిలుపుదల చేస్తున్నట్లు ఈవో లవన్న ప్రకటించారు. కోవిడ్ ఆంక్షాలను తప్పక పాటిస్తూ.. స్వామివారిని దర్శించుకోవాలని ఆయన కోరారు.