రామన్నా.. తెలుగుదనం మూర్తీభవించిన నిండైన నీ రూపం చూసి పాతికేళ్లవుతోంది. ఆత్మాభిమానం ఉట్టిపడే గంభీరమైన నీ కంఠస్వరం విని దశాబ్దాలు గడిచిపోయాయి. అయినా.. నేటికీ ప్రతి పేదవాడి గుండెలో నువ్వే.. అన్నం గిన్నెలో నువ్వే. ఢిల్లీ గద్దెను గడగడలాడించి, తెలుగు ఖ్యాతిని విశ్వవిఖ్యాతం చేసిన నీ స్ఫూర్తి.. నేడు కొరవడిందన్నా. ఆత్మగౌరవ నినాదంతో.. ‘సమాజమే దేవాలయం-ప్రజలే దేవుళ్లు’ అనే విధానంతో నీ పాలన సాగితే.. తమ స్వార్థ ప్రయోజనాల కోసం తెలుగువాడి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతూ, ‘సమాజమే సంపాదనా మార్గం-ప్రజా ధనమే భోజ్యం’ అనే సిద్ధాంతంతో సాగుతున్నారు నేటి పాలకులు. నువ్వు పార్టీ పెట్టినప్పటి పరిస్థితులు నేడు పునరావృతమయ్యాయి. ఈ తెలుగు నేలకు నీ అవసరం మళ్లీ వచ్చింది. అవినీతి చీడను వదిలించడానికి నువ్వు మళ్లీ పుట్టాలి. రగులుతున్న ప్రాంతీయ విద్వేషాలను రూపుమాపి.. తెలుగు జాతిని ఏకతాటిపై నడిపించడానికి నువ్వు మళ్లీ రావాలి. పతనావస్థలో ఉన్న తెలుగు భాషకు ఊపిరిలూది.. పూర్వ వైభవం తేవడం నీకు మాత్రమే సాధ్యం.
ఇప్పుడు నువ్వే ఉండుంటే..
తెలుగు గడ్డపై తెలుగు మాధ్యమాన్ని రద్దు చేస్తుంటే చూస్తూ ఊరుకునే వాడివా! రాజధాని కూడా లేని రాష్ట్రాన్ని గందరగోళంలోకి నెట్టేసి, రాక్షసానందం పొందుతున్న పాలకులను భరించేవాడివా! ప్రత్యేక హోదా సహా విభజన హామీలను విస్మరించిన కేంద్రపాలకుల ఆటలు సాగనిచ్చే వాడివా! ఓట్ల కోసం ప్రజల మధ్య ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతుంటే.. చూస్తూ ఊరుకునే వాడివా! నేటి తెరచాటు రాజకీయాలను సహించే వాడివా! మత పరమైన భావోద్వేగాలతో రాజకీయం చేయాలనుకుంటున్న వారి భరతం పట్టకుండా వదిలే వాడివా! నాడు 60 కోట్ల బోఫోర్స్ కుంభకోణాన్ని దేశద్రోహంగా అభివర్ణించిన నువ్వు.. నేడు జరుగుతున్న లక్షల కోట్ల అవినీతిపై ఎలా స్పందించే వాడివో..! దేశంలో సంక్షేమ పథకాలకు ఆద్యుడవు నువ్వు. నీ సంక్షేమ ధేయం.. పేదవాడి క్షేమం. నేటి సంక్షేమం.. కేవలం ఓట్ల రాజకీయం. నీ లక్ష్యం.. పేదవాడి అభ్యున్నతి. నేటి నాయకుల లక్ష్యం.. లక్షల కోట్ల అవినీతి.
Must Read ;- తారకరాముడి పట్టాభిషేకానికి 38 ఏళ్లు..
ఆనాడు కిలో బియ్యం రెండు రూపాయలకే అందించినందుకు నిన్ను విమర్శించిన పెద్దలే.. నేడు కిలో బియ్యం రూపాయికిస్తున్నారు. నువ్వు రైతులకు 50 రూపాయలకు హార్స్పవర్ విద్యుత్తునిస్తే తిట్టిపోయిన వాళ్లే.. ఉచిత విద్యుత్తునిస్తున్నారు. నువ్వు పేదవాడికి స్లాబ్ వేసి పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తే.. ఖజానా ఖాళీ చేస్తున్నావంటూ నీపై దుమ్మెత్తి పోసిన వాళ్లే.. నేడు డబుల్ బెడ్రూం ఇళ్లంటున్నారు. నువ్వు తాలూకా వ్యవస్థను రద్దు చేసి, మండల వ్యవస్థను తెచ్చినప్పుడు, దాన్ని తుగ్లక్ చర్యగా అభివర్ణించిన వాళ్లు.. ఇన్నేళ్లయినా దాన్ని మార్చే సాహసం చేయలేకున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని.. వారి కోరిక మేరకు రాష్ట్ర ఆదాయాన్ని కూడా త్యజించి.. సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తే.. ఆదాయం పోతోందని దానికి తూట్లు పొడిచారు నేటి పాలకులు.
నీకు, నేటి నాయకులకు ఎంత తేడా..!
నువ్వు అవినీతిపరులకు సింహస్వప్నంలా నిలిస్తే.. నేటి నాయకులు అవినీతి సింహద్వారం నుంచి వస్తున్నారు. నువ్వు నీ మంత్రివర్గ సహచరుడినే ఏసీబీకి పట్టించి చరిత్రకెక్కితే.. నేటి పాలకులు అవినీతి పరులకే పదవులిచ్చి ప్రోత్సహిస్తున్నారు. నాడు నువ్వు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించి, వారి కోసం ప్రత్యేక విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పి, వారి గుండెల్లో అన్నలా శాశ్వతంగా నిలిచిపోతే.. నేడు రాజధానిని కాపాడుకునేందుకు రోడ్డెక్కిన నీ తెలుగింటి ఆడపడుచులను మగ పోలీసులతో విచక్షణా రహితంగా కొట్టించి రాక్షసానందం పొందుతున్నారు మా పాలకులు. మా పాలకులు.. నీకు కూడా ప్రాంతీయతను అంటగట్టి, నీ స్మారకాన్ని నిర్లక్ష్యం చేయగలరేమో గానీ.. ప్రజల హృదయాల్లో నువ్వు ఏర్పరచుకున్న సుస్థిర స్థానాన్ని అంగుళం కూడా కదిలించలేరు. నీ పాలనలో దిగ్ధిశాంత యశోవిరాజితమేన తెలుగు భాషను.. నేటి పాలకులు అథఃపాతాళానికి తొక్కేస్తున్నారు. ఈ దుస్థితి నుంచి తెలుగు నేల బయటపడి కోలుకోవాలంటే.. నువ్వు మళ్లీ పుట్టాలన్నా.. నిద్రావస్థలో ఉన్న తెలుగువాడి ఆత్మగౌరవాన్ని తట్టి లేపాలి. పౌరుషాగ్నిని రగిలించాలి. తెలుగు వాడి వాడిని వేడిని కరడుగట్టిన ఢిల్లీ గద్దెకు మరోసారి చూపించాలి. తెలుగు కీర్తి పతాకను రెపరెపలాడించాలి. ! ఓ దైవాంశ సంభూతా.. దేవుడికే రక్షణ లేని ఈ రాష్ట్రాన్ని కాపాడగ రావయ్యా! ‘తెలుగు జాతి పిలుస్తోంది.. రా.. కదలిరా..’
నీ రాక కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తూ..
-ఆత్మగౌరవం ఉన్న ఓ తెలుగువాడు
Also Read ;- లక్ష్మీపార్వతి ఇంట్లో చిన్న ఎన్టీఆర్ పుట్టాడా?