ప్రస్తుతం తెలుగులో అనేక బడా సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి. అందులో పరుశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న ‘సర్కారువారి పాట’, సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేస్తున్న ‘పుష్ప’ కూడ ఉన్నాయి. ఈ రెండు సినిమాలకు ప్రేక్షకుల్లోని, వారి అభిమానుల్లోని భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేష్ బాబు, అల్లు అర్జున్ వరస హిట్ సినిమాలతో దూసుకుపోవడమే ఇందుకు కారణం. ఈ రెండు సినిమాల షూటింగ్లు ఇంకా పూర్తి అవ్వకుండానే బిజినెస్ వర్గాల్లో మంచి డిమాండ్ ఏర్పడింది.
డిస్ట్రిబ్యూషన్, శాటిలైట్, ఆడియో రైట్స్ కోసం గట్టి పోటీ నెలకొందని టాలీవుడ్ సమాచారం. ఇప్పటికే అనేక పెద్ద సంస్థల నుండి ఈ సినిమాలకు భారీ ఆఫర్స్ వచ్చాయని టాక్. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ‘సర్కారువారి పాట’, ‘పుష్ప’ సినిమాల శాటిలైట్ రైట్స్ అమ్ముడయ్యాయని, రెండు సినిమా హక్కులనూ ‘స్టార్ మా’ ఛానెల్ దక్కించుకుందని తెలుస్తోంది. భారీ రేట్లు పెట్టి ఈ సినిమాల హక్కులను తీసుకుందని సమాచారం.
అయితే ఈ సినిమాల హక్కులు ఎంత లాభానికి అమ్ముడయ్యాయనేది ఇంకా తెలియాల్సి ఉంది. గతంలో కూడా ‘స్టార్ మా’ సంస్థ అనేక పెద్ద సినిమాల హక్కులను కొని మంచి లాభాలనే ఆర్జించింది. ‘సర్కారువారి పాట’, ‘పుష్ప’ రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ కావడంతో ఈ సినిమాలతో కూడా ‘స్టార్ మా’ మంచి లాభాలను తన ఖాతాలో వేసుకుంటుంది అనడంలో సందేహం లేదు.
ఈ రెండు సినిమాల షూటింగ్లు శరవేగంగా జరుపుకొని వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయాలనే ఉద్దేశంలో నిర్మాతలు ఉన్నారు. ఈమధ్యనే ‘సర్కారువారి పాట’ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ జాయిన్ అయ్యింది. ఇక ‘పుష్ప’ సినిమా విషయానికి వస్తే షూటింగ్ తిరిగి ప్రారంభించే పనిలో పడ్డారు చిత్ర బృందం. ఈ రెండు సినిమాలు మంచి విజయాలు సాధించి ‘స్టార్ మా’ కు ఎన్ని లాభాలు సంపాదించి పెడతాయో చూడాలి.











