( విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
నగర నడిబొడ్డున ఉన్న వాల్తేరు క్లబ్ భూముల వివాదం ఇప్పటిలో పరిష్కారమయ్యే సూచనలు కనిపించడం లేదు. ఈ స్థలాలపై ప్రభుత్వ పెద్దలు కన్నేసినట్టు.. క్లబ్ నిర్వాహకులు ఆరోపిస్తూ ఉండగా, అవి ప్రభుత్వ భూములని అధికారులు, వ్యతిరేక వర్గం స్పష్టం చేస్తోంది. ఇక్కడి భూముల స్వాధీన ప్రక్రియ సజావుగా సాగితే … గవర్నర్ బంగ్లా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించినట్లు ప్రచారం జరిగింది. అయితే, కోర్టు వివాదాల్లో ఉన్న ఈ భూములపై క్లారిటీ ఇప్పట్లో రాదని మెజారిటీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. క్లబ్ నడుపుతున్న స్థలం ప్రభుత్వానికి చెందిందని ఇటీవల న్యాయవాది ఒకరు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు స్పందించిన ప్రత్యేక దర్యాప్తు బృందం( సిట్ ) కాలపరిమితి తీరి పోయినప్పటికీ… ఆ ఫిర్యాదు విచారణకు స్వీకరించింది. ఐదో తేదీన క్లబ్‌కు నోటీసు జారీ చేసింది. క్లబ్ నుంచి తమ భూములపై తమకు సర్వ హక్కులు ఉన్నాయంటూ సభ్యులు వాదిస్తున్నారు. అయితే, ఆ భూములు తమవే అని వారసులుగా పేర్కొంటున్న మరో వర్గం.. భూములు ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరుతోంది. ఈ క్రమంలోనే క్లబ్ నిర్వాహకులు, భూ యజమాని వారసులుగా చెప్పుకుంటున్న వర్గం ప్రతినిధులు ఇప్పటికే సిట్ ముందు హాజరై తమ ఆధారాలను సమర్పించారు. క్లబ్ భూమిపై ఇప్పటికే జిల్లా కోర్టు, హైకోర్టులో కేసులు పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. అయినప్పటికీ చేపడుతున్న సిట్ విచారణపై తాజాగా హైకోర్టు స్టే విధించింది.
ఎందరో ప్రముఖులకు కేరాఫ్..
నగరంలోని ఎందరో ప్రముఖులకు కేరాఫ్‌గా నిలిచే ఈ క్లబ్ భూములు చేజారి పోతూ ఉంటే ఉపేక్షిస్తేరా? అన్నది తొలి ప్రశ్న. ప్రభుత్వ సంకల్పం ఎలా ఉన్నా.. క్లబ్‌కు ఉన్న హక్కుల ఆధారంగా ఈ వివాదం ఏళ్ళ తరబడి హైకోర్టు, సుప్రీంకోర్టు లలో నడిచే అవకాశం లేకపోలేదని న్యాయ న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. క్లబ్ చరిత్ర విషయానికి వస్తే… వంద సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న క్లబ్ ఇది. సుమారు 31 ఎకరాలను పేర్ల అనే కుటుంబం నుంచి 1895లో లీజుకు తీసుకొని క్లబ్‌ను ప్రారంభించారు. ఇక్కడి భూములకు అనకాపల్లి సెటిల్మెంట్ అధికారి 1961లో రఫ్ పట్టాను జారీ చేశారు. కానీ అది రఫ్ లీజ్ పట్టా అని ప్రభుత్వం వాదిస్తోంది. లీజు కాలపరిమితి ముగిసింది అని చెబుతోంది. ఈ పట్టాను వ్యతిరేకిస్తూ అప్పట్లోనే అర్బన్ తహసిల్దార్ సర్వే సెటిల్మెంట్ కోర్టుకు వెళ్లారు. అనంతరం సర్వే అండ్ సెటిల్మెంట్ రాష్ట్ర కమిషనర్ చేసిన అపీల్‌తో 1990లో పట్టా ఉత్తర్వులు రద్దు చేశారు. అదే సమయంలో ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ కింద పిటిషన్ దాఖలు చేసుకోవచ్చు అని క్లబ్‌కు సూచించారు. కానీ ఆ విధంగా క్లబ్ చర్యలు చేపట్టలేదు. అదే ప్రస్తుతం ప్రభుత్వ పెద్దలకు అవకాశంగా మారుతోంది. ఆ భూములపై క్లబ్‌కు హక్కులు లేవని రెవెన్యూ అధికారులు వాదిస్తున్నారు. ఈ మేరకు స్వాధీన ప్రక్రియ కోసం నోటీసులు జారీ చేశారు. దానిపై క్లబ్ నిర్వాహకులు హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు.
స్వాధీనం చేసుకునే దారులు..
విలువైన ఈ భూములు స్వాధీనం చేసుకునేందుకు అడ్వకేట్ జనరల్ స్థాయిలో ప్రభుత్వ పెద్దలు మంతనాలు జరిపారు. న్యాయపరంగా స్వాధీనం చేసుకునేందుకు దారులు వెతుకుతున్నారు. క్లబ్లో సభ్యులంతా ఉన్నత స్థానాల్లో, మంచి హోదాల్లో కొనసాగిన వ్యక్తులు కావడంతో.. టీడీపీ నేతలు, పేదల, వ్యాపారుల భూములు స్వాధీనం చేసుకున్నట్టు.. చేయడం సాధ్యం కావడం లేదు. బలవంతంగా భూములు స్వాధీనం చేసుకుంటే ముందు ముందు న్యాయపరమైన ఇబ్బందులు ఎదురవుతాయని జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ప్రత్యేక అధికారుల బృందం సిట్‌తో విచారణ చేపట్టి భూములు స్వాధీనం చేసుకోవాలని చేసిన ప్రయత్నాలపై కోర్టు అభ్యంతరం చెప్పడంతో మరికొంత కాలం ఈ వివాదం కొనసాగుతుందని స్పష్టమవుతోంది. ప్రభుత్వానికి నివేదిక సమర్పించే తరుణంలో సిట్ మరో ఫిర్యాదు స్వీకరించి విచారణ చేపట్టడంపైన అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.