అంతరిక్షంలోకి దూసుకుపోతున్న, సముద్రగర్భంలో సాహసాలు చేస్తున్న, మంచుపర్వతాలను అవలీలగా అధిరోహిస్తున్న, ఖండాంతరాలను అధిగమిస్తున్న సగటు భారతీయుని కథలు మనం రోజూ చదువుతుంటాం. అంత శ్రమ ఎందుకు.. అంత గుర్తింపు కీర్తి రాకపోయినా.. జీవితం మనుగడకోసం.. అంతకంటె ఎక్కువ కష్టమే పడుతున్న వారు.. మన సమాజం మధ్యలోనే ఉన్నారని మనకు తెలుసా? సరైన రహదారులు లేక అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి వెళ్లేందుకు రవాణా సదుపాయం లేక డోలీలను ఆశ్రయిస్తూ మార్గమధ్యంలోనే అడవిబిడ్డలు అసువులుబాస్తున్నారు. ఈ వాస్తవం మనం జీర్ణించుకోలేనిదైనప్పటికీ ముమ్మాటికీ నమ్మాల్సిందే. ప్రభుత్వాల ఉదాసీన వైఖరి, అధికారుల నిర్లక్ష్యం, గిరిపుత్రుల అవగాహన రాహిత్యం ఎందరో నిండుగర్భిణీలను పొట్టన పెట్టుకుంటుండగా, లోకం చూడకముందే ఎందరో పసికందులు ఆయుస్సు ముగుస్తోంది.
తూర్పుకనుమల్లో ఆంధ్ర – ఒడిశా సరిహద్దుల్లో ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో పచ్చదనంతో, పరిశుభ్రంగా పరిఢవిల్లుతున్న గిరిసీమలు నేటికీ అభివృద్ధికి ఆమడదూరంలో నిలుస్తున్నాయి. ఎతైన కొండలపై విసిరివేసినట్టు అక్కడక్కడ 30, 40కుటుంబాలతో ఉంటున్న ఈ గిరిజన పల్లెలకు సరైన రహదారి సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి.
గిరిజనాభివృద్ధికి ప్రభుత్వాలు ఏటా కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నప్పటికీ అవి ఎటు పోతున్నాయో జవాబు లేని ప్రశ్నగానే మిగులుతోంది. స్వాతంత్య్రం వచ్చి ఏడుదశాబ్దాలు గడచినప్పటికీ గిరిజనులకు నేటికీ సరైన తాగునీరు , పౌష్టికాహారం , రహదారి , సరైన వైద్యసేవలు అందకపోవడంలో ఆంతర్యం ఏంటో ఏలికలకే తెలియాలి. వేరొకవైపు రాజ్యాంగం సముచితంగా వారికి కల్పించిన రిజర్వేషన్లు గిరిజనులు అందరూ సద్వినియోగం చేసుకోయుంటే ఏడుదశాబ్దాలలో ఏ ఒక్క గిరిజనుడూ నిరుద్యోగిగా ఉండేవారు కాదు.
కానీ ఆ రిజర్వేషన్లు అందుకున్నవారే తరతరాలుగా ఆ ఫలితాలు అనుభవిస్తుంటే వాటి గురించి అవగాహన లేనివారు ఆ కొండల్లోనే సమస్యలతో సహవాసం చేస్తున్నారు. స్వచ్ఛంద సేవా సంస్థలు, ప్రచారమాధ్యమాల ద్వారా ఇప్పుడిప్పుడే అవగాహన పెంచుకుంటున్న గిరిజనులు తమ గ్రామాలకు తామే రహదారులు నిర్మించుకుంటున్నారు. విజయనగరం జిల్లా సాలూరు ఏజెన్సీలో పలు గ్రామాల గిరిజనులు కలసికట్టుగా అహర్నిశలూ శ్రమించి రహదారి నిర్మించుకుని సినీనటుడు సోన్ సూద్ ప్రశంసలు పొందడం చెప్పుకోదగ్గ విషయం .
అయినప్పటికీ ఉత్తరాంధ్రలో ఉన్న అనేక గిరిజన గ్రామాలకు నేటికీ సరైన రహదారులు లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం తాటిపూడి ప్రాజెక్టు ఆవల కొండలపై ఉన్న సుమారు 17 గిరిజన గ్రామాలకు సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో కొద్దిరోజుల క్రితం ప్రసవవేదనతో ఒక గర్భిణీ మృతి చెందడం తీవ్ర విషాదాన్ని కలిగించింది.
ధారపత్రి పంచాయతీ దుంగాడ గ్రామం నుండి గర్భవతి అయిన కస్తూరి దేవుడమ్మ (20)ను తొలి కాన్పు నిమిత్తం ప్రసవవేదనతో బాధపడుతున్న ఆమెను తొమ్మిది కిలో మీటర్ల దూరంలోవున్న మైదాన ప్రాంతమైన దబ్బగుంటకు డోలీలో ఆ గ్రామ గిరిజనులు మోసుకొచ్చారు. అక్కడ నుండి ఆటోలో శృంగవరపుకోట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే కాలాతీతమైంది. ఇటువంటి సంఘటనలూ ప్రతినిత్యం ఏదో ఒక ప్రాంతంలో చోటుచేసుకుంటున్నప్పటికీ ప్రభుత్వం సరైన ప్రత్యామ్నాయం ఆలోచించకపోవడం విస్మయానికి గురిచేస్తోంది.