తెలంగాణలోని హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఈ దఫా సరికొత్త పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నెల 30న పోలింగ్ జరగనుండగా.. బుధవారం సాయంత్రానికే ప్రచారానికి తెర పడిపోయింది. మైకులన్నీ మూగబోయిన మరుక్షణమే ప్రలోభాలకు తెర లేసింది. ఈ ప్రలోభాల్లో భాగంగా దాదాపుగా అన్ని పార్టీలు ఓటర్లను తమ వైపునకు తిప్పుకునే క్రమంలో డబ్బుల పంపిణీని ప్రారంభించేశాయి. ఈ డబ్బుల పంపిణీ టీఆర్ఎస్‌కు మద్దతుగా నిలిచే వారిలో తీవ్ర అసంతృప్తిని రాజేసింది. కొందరికి మాత్రమే డబ్బులు ఇచ్చిన టీఆర్ఎస్ నేతలు.. తమను మాత్రం పట్టించుకోలేదని, ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదని, తమకూ డబ్బు ఇవ్వాల్సిందేనని డబ్బు చేతికందని వారు బహిరంగంగానే తెగేసి చెబుతున్నారు. అలా డబ్బు తమ చేతిలో పడకపోతే మాత్రం తమ ఓటును బీజేపీకి వేస్తామని కూడా వారు బహిరంగంగానే చెబుతున్న తీరు గులాబీ దళానికి డేంజర్ బెల్స్ వినిపిస్తోంది.
గులాబీ దళానికి చావో, రేవో
వాస్తవానికి హుజూరాబాద్ ఉప ఎన్నిక అధికార టీఆర్ఎస్‌కు చావో, రేవో కిందే లెక్క. ఎందుకంటే.. కేసీఆర్ కేబినెట్ నుంచి బర్తరఫ్‌నకు గురైన మాజీ మంత్రి ఈటల రాజేందర్.. టీఆర్ఎస్ సభ్యత్వంతో పాటుగా ఆ పార్టీ నుంచి దక్కిన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసేసి బీజేపీలో చేరిపోయారు. ఈటల రాజేందర్‌తో హుజూరాబాద్ అసెంబ్లీకి ఉప ఎన్నిక అనివార్యం కాగా.. ఈటల బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగితే.. టీఆర్ఎస్ మాత్రం తన యువజన విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను బరిలోకి దించింది. ఈ క్రమంలో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఈటల ఈ ఉప ఎన్నికలో గెలిస్తే.. టీఆర్ఎస్ ప్రభతో పాటు సీఎం కేసీఆర్ సత్తాకు కూడా ప్రశ్నార్థమయ్యే ప్రమాదం లేకపోలేదు. ఈ కారణంగానే హుజూరాబాద్‌లో ఎలాగైనా పార్టీ అభ్యర్థిని గెలిపించి తీరాలన్న కసితో కేసీఆర్ వ్యూహాలు రచించారు. ఈ వ్యూహాలను మంత్రి హరీశ్ రావు అమలు చేస్తూ దూసుకుపోతున్నారు. ప్రచారం పూర్తి కావడంతో ఇక ప్రలోభాలకు తెర లేసింది. ఆ పార్టీ, ఈ పార్టీ అన్న తేడా లేకుండా దాదాపుగా అన్ని పార్టీలూ ఓటర్లను తమ వైపునకు తిప్పుకునేందుకు యత్నిస్తున్నాయి. అందులో భాగంగానే భారీ ఎత్తున డబ్బు పంపిణీకి తెర తీశాయి. అయితే ఇప్పటిదాకా ఏ పార్టీ కూడా డబ్బు పంపుతూ పట్టుబడకపోగా.. అధికార పార్టీగా ఉన్న టీఆర్ఎస్ కొందరికి డబ్బు పంచిందని, అయితే పార్టీకి అనకూలంగా ఉన్న తమను మాత్రం పట్టించుకోలేదని కొందరు వ్యక్తులు ఆరోపించారు. ఎన్నికలకు ఇంకా రెండు రోజుల సమయం ఉన్నందున తమకూ డబ్బు అందిస్తేనే టీఆర్ఎస్‌కు ఓట్లేస్తామని. లేని పక్షంలో బీజేపీకిఒ ఓటేస్తామని హుజూరాబాద్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓటర్లు బహిరంగంగానే చెప్పేశారు.
ఈటల గట్టెక్కేనా?
హుజూరాబాద్ ఉప ఎన్నిక ఇటు టీఆరెఎస్‌తో పాటు అటు మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు కూడా చావో, రేవోనేనని చెప్పక తప్పదు. ఎందుకంటే.. ఈటల రాజీనామాతోనే హుజూరాబాద్ ఉప ఎన్నిక జరుగుతోంది. అంతేకాకుండా హుజూరాబాద్‌తో తాను గెలుస్తూనే వస్తున్నానని, ఇప్పటిదాకా తన బలంతోనే అక్కడ గెలిచానని, టీఆర్ఎస్ బలంతో మాత్రం కాదని ఈటల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఈటల ఓడితే.. ఆయన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థంగా మారే ప్రమాదం లేకపోలేదు. ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో పాటు తనకు మద్దతుగా నిలుస్తున్న వారి ఓట్లపైనే ఈటల ఆధారపడ్డారు. అయితే అప్పటిదాకా బలహీనంగా కనిపించిన కాంగ్రెస్ పార్టీ.. రేవంత్ రెడ్డి పీసీసీ పగ్గాలు చేపట్టడంతో ఒక్కసారిగా బలోపేతమైపోయింది. స్థానిక నేతగా చిరపరచితులైన బల్మూరి వెంకట్ ను బరలోకి దింపిన రేవంత్.. బలహీన అభ్యర్థే అయినప్పటికీ.. పార్టీని నమ్ముకున్నందుకే బల్మూరికి టికెట్ ఇచ్చినట్లుగా ప్రకటించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటులో కాంగ్రెస్ కూడా తన వాటాను దక్కించుకునే అవకాశాలున్నాయన్న విశ్లేషణలు సాగుతున్నాయి. ఇదే జరిగితే.. ఈటల గెలుపుపై ప్రభావం పడే అవకాశాలు లేకపోలేదు. మొత్తంగా హుజూరాబాద్ ఉప ఎన్నిక ఎన్నెన్ని ఈక్వేషన్లకు కారణమవుతోందోనన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.